సంక్రాంతికి మహేష్ బాబు-త్రివిక్రమ్ హ్యాట్రిక్ ఫిల్మ్
* ఆకట్టుకుంటున్న కొత్త పోస్టర్
‘అతడు’, ‘ఖలేజా’ వంటి క్లాసిక్ సినిమాల తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కలయికలో రూపొందుతోన్న మోస్ట్ వాంటెడ్ ఫిల్మ్ ‘ఎస్ఎస్ఎంబి 28′(వర్కింగ్ టైటిల్). టాలీవుడ్ అగ్ర చిత్ర నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో ఎస్.రాధాకృష్ణ (చినబాబు) భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే, శ్రీలీల కథానాయికలుగా నటిస్తున్నారు. చిత్ర ప్రకటన వచ్చినప్పటి నుంచే ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. తాజాగా ఈ సినిమా కొత్త విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు.
ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్న మహేష్-త్రివిక్రమ్ హ్యాట్రిక్ ఫిల్మ్ ని సంక్రాంతి కానుకగా 2024, జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల చేయబోతున్నట్లు తెలుపుతూ చిత్ర యూనిట్ ఆదివారం సాయంత్రం ఓ కొత్త పోస్టర్ ను వదిలారు.
“సూపర్ స్టార్ మహేష్ బాబు ‘ఎస్ఎస్ఎంబి 28’తో సరికొత్త మాస్ అవతార్‌లో జనవరి 13, 2024 నుండి ప్రపంచవ్యాప్తంగా థియేటర్‌లలో అలరించనున్నారు” అంటూ మేకర్స్ విడుదల చేసిన పోస్టర్ అసలుసిసలైన సంక్రాంతి సినిమాని తలపిస్తూ విశేషంగా ఆకట్టుకుంటోంది.
పండుగలా ‘ఎస్ఎస్ఎంబి 28’ కొత్త పోస్టర్:
మేకర్స్ చెప్పినట్టుగా తాజాగా విడుదల చేసిన పోస్టర్ లో మహేష్ బాబు సరికొత్త మాస్ అవతార్ లో కనిపిస్తున్నారు. పోస్టర్ ని బట్టి చూసే ఇది మిర్చి యార్డ్ లో జరిగే యాక్షన్ సన్నివేశమని అనిపిస్తోంది. మిర్చి యార్డ్ లో కొందరికి బుద్ధిచెప్పి.. కళ్లద్దాలు, నోట్లో సిగరెట్ తో గుంటూరు మిర్చి ఘాటుని తలపిస్తూ స్టైల్ గా నడిచొస్తున్న మహేష్ బాబు మాస్ లుక్ ఆకట్టుకుంటోంది. మొత్తానికి వచ్చే సంక్రాంతికి మహేష్ బాబు, త్రివిక్రమ్ కలిసి మాస్ బొమ్మ చూపించబోతున్నారని పోస్టర్ తోనే అర్థమవుతోంది.
మహేష్ బాబు సినిమాలకు సంక్రాంతి సెంటిమెంట్ ఉంది. మహేష్ బాబు నటించిన ‘ఒక్కడు’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘సరిలేరు నీకెవ్వరు’ వంటి సినిమాలు సంక్రాంతి కానుకగా విడుదలై ఘన విజయాలను అందుకున్నాయి. ఇక దర్శకుడు త్రివిక్రమ్ గత చిత్రం ‘అల వైకుంఠపురములో’ సైతం 2020 సంక్రాంతికి విడుదలై ఇండస్ట్రీ రికార్డులను సృష్టించడం విశేషం. అసలే హ్యాట్రిక్ కాంబినేషన్, అందులోనూ సంక్రాంతి సీజన్ కావడంతో ‘ఎస్ఎస్ఎంబి 28’ చిత్రం సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయమని అభిమానులు నమ్మకంగా ఉన్నారు.
సంగీత ప్రపంచంలో సంచలనాలు సృష్టిస్తున్న తమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహిస్తున్న విషయం విదితమే. ఎడిటర్ గా జాతీయ అవార్డ్ గ్రహీత నవీన్ నూలి , కళా దర్శకునిగా ఎ.ఎస్. ప్రకాష్, ఛాయాగ్రాహకుడు గా పి.ఎస్.వినోద్ వ్యవహరిస్తున్నారు.
తారాగణం: మహేష్ బాబు, పూజా హెగ్డే, శ్రీలీల
రచన, దర్శకత్వం: త్రివిక్రమ్
నిర్మాత: ఎస్.రాధాకృష్ణ(చినబాబు)
సంగీతం: తమన్
డీఓపీ: పి.ఎస్.వినోద్
ఆర్ట్ డైరెక్టర్: ఎ.ఎస్. ప్రకాష్
ఎడిటర్: నవీన్ నూలి
పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్