‘మారుతి నగర్ సుబ్రమణ్యం’రామ్ చరణ్ చేతుల మీద ట్రైలర్ రిలీజ్

Must Read


రావు రమేష్ కథానాయకుడిగా నటించిన సినిమా ‘మారుతీ నగర్ సుబ్రమణ్యం’. లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించారు. క్రియేటివ్ జీనియస్ సుకుమార్ సతీమణి తబితా సుకుమార్ సమర్పణలో పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ సంస్థలపై రూపొందిన చిత్రమిది. బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య నిర్మాతలు. రావు రమేష్ సరసన ఇంద్రజ… అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి మరో జంటగా, హర్షవర్ధన్ కీలక పాత్రలో నటించారు. 

సుకుమార్ సతీమణి తబిత తొలిసారి సమర్పకురాలిగా వ్యవహరించడం ‘మారుతి నగర్ సుబ్రమణ్యం’తో మొదలు కావడం విశేషం. కంటెంట్ నచ్చడంతో తెలంగాణ, ఏపీలో ఈ చిత్రాన్ని అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌కు చెందిన మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్‌పి విడుదల చేస్తోంది. ఆగస్టు 23న సినిమాను భారీ ఎత్తున విడుదల చేయనున్నట్లు దర్శక నిర్మాతలు వెల్లడించారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా ఈ రోజు ట్రైలర్ విడుదల చేశారు.

మారుతి నగర్ వాసి సుబ్రహ్మణ్యానికి ఎటకారం ఎక్కువ. ఉదయాన్నే కిటికీ నుంచి వస్తున్న పొగలు చూసిన పొరుగింటి వ్యక్తి ‘పొద్దున్నే పూజ మొదలు పెట్టావా? అగరబత్తి పొగలు కక్కుతోంది’ అని అడిగితే… ‘గోల్డ్ ఫ్లాక్ కింగ్ అని కొత్త బ్రాండ్ అగరబత్తి. నీ కూతురు వాడుతుంటే చూసి కొన్నాను’ అని చెబుతాడు. టైటిల్ రోల్ రావు రమేష్ చేయగా… ఆయన భార్యగా ఇంద్రజ కనిపించారు. భర్త సిగరెట్లకు భార్య డబ్బులు ఇస్తోందని ‘ఈ రోజు నుంచి మీ సిగరెట్ ఖర్చులకు నేను డబ్బులు ఇవ్వను’ అని ఇంద్రజ డైలాగ్ చెప్పడంతో అర్థం అవుతుంది. ఆ వెంటనే ‘నీకు అదృష్టం ఆవగింజ అంత ఉంటే… దురదృష్టం ఆకాశమంత ఉందిరా బాబు’ అని అన్నపూర్ణమ్మ చెప్పారు. ఆవిడ రావు రమేష్ అత్తగారి పాత్ర చేశారు. సుబ్రమణ్యం కుమారుడు ఏమో ‘మా నాన్న అల్లు అరవింద్’ అని గొప్పలు చెప్పి ఓ డబ్బున్న అమ్మాయిని ప్రేమలో పడేశాడు.

సుబ్రమణ్యం, అతని కుమారుడు ఏం చేశారు? ఈ కుటుంబ కథ ఏమిటి? అనేది ఆగస్టు 23న థియేటర్లలో సినిమా చూసి తెలుసుకోవాలి. 

కంటెంట్ ఓరియెంటెడ్ ఫిల్మ్ అని ‘మారుతి నగర్ సుబ్రమణ్యం’ ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. ఆ కంటెంట్ ఒక ఎత్తు అయితే… రావు రమేష్ నటన మరొక ఎత్తు. టిపికల్ డైలాగ్ డెలివరీతో సుబ్రమణ్యం పాత్రలో జీవించారు. ‘అవన్నీ ఓకే’ అని డైలాగ్ చెప్పడంలో, నుదుట నామాలు పెట్టి కుర్చీ తీసిన సన్నివేశంలో ఆయన చూపించిన యాటిట్యూడ్ నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్. అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి సైతం తమ నటనతో ఆకట్టుకున్నారు. డైలాగులు బావున్నాయి. సినిమాపై ఈ ట్రైలర్‌ మరిన్ని అంచనాలు పెంచింది.

రావు రమేష్, ఇంద్రజ, అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి, హర్షవర్ధన్, అజయ్, అన్నపూర్ణమ్మ, ప్రవీణ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సాహిత్యం: ఆస్కార్ పురస్కార గ్రహీత చంద్రబోస్, భాస్కరభట్ల, కళ్యాణ్ చక్రవర్తి, ఆర్ట్ డైరెక్షన్: సురేష్ భీమంగని, ఎడిటర్: బొంతల నాగేశ్వర్ రెడ్డి, పీఆర్వో: పులగం చిన్నారాయణ, సినిమాటోగ్రఫీ: ఎంఎన్ బాల్ రెడ్డి, లైన్ ప్రొడ్యూసర్: శ్రీహరి ఉదయగిరి, క్రియేటివ్ హెడ్: గోపాల్ అడుసుమిల్లి, సహ నిర్మాతలు: రుషి మర్ల, శివప్రసాద్ మర్ల, సమర్పణ: తబితా సుకుమార్, నిర్మాతలు: బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య, కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్: లక్ష్మణ్ కార్య.

Latest News

Thaman S Releases Lyrical Song Kavalayya from Movie Mr. Idiot

Mass Maharaja Ravi Teja's younger brother Raghu's son, Maadhav, takes the lead role in the movie "Mr. Idiot," alongside...

More News