“గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి”లోని రత్న పాత్ర మీ హృదయాల్లో నిలిచిపోతుంది – కథానాయకుడు మాస్ కా దాస్ విశ్వక్ సేన్
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కథానాయకుడిగా నటించిన చిత్రం “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి”. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. వెంకట్ ఉప్పుటూరి, గోపీచంద్ ఇన్నుమూరి సహ నిర్మాతలు. కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నేహా శెట్టి, అంజలి కథానాయికలుగా నటించారు. ప్రముఖ స్వరకర్త యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన పాటలకు, ప్రచార చిత్రాలకు విశేష స్పందన లభించింది. భారీ అంచనాలతో మే 31వ తేదీన “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మే 28వ తేదీన సాయంత్రం హైదరాబాద్ లోని ఎన్ కన్వెన్షన్ లో ప్రీ రిలీజ్ వేడుకను వైభవంగా నిర్వహించారు. మే 28న యుగపురుషుడు నందమూరి తారక రామారావు గారి జయంతి. గతేడాది ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” ఫస్ట్ లుక్ విడుదల చేసిన నిర్మాతలు, ఈ ఏడాది ఎన్టీఆర్ 101వ జయంతికి ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించడం విశేషం. ఇక ఈ కార్యక్రమానికి ‘గాడ్ ఆఫ్ మాసెస్’ నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేయడం మరో విశేషం. ఈ కార్యక్రమంలో “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” నుంచి “గిరి గిరి” అనే మాస్ సాంగ్ ను బాలకృష్ణ చేతుల మీదుగా విడుదల చేశారు.
‘గాడ్ ఆఫ్ మాసెస్’ నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. ముందుగా నాకు జన్మనిచ్చి, నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు, దైవాంశ సంభూతుడు, విశ్వానికే నటవిశ్వరూపం ఎలా ఉంటుందో చూపించిన కారణజన్ముడు, నా తండ్రి, నా గురువు, నా దైవం, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, నటరత్న, కళాప్రపూర్ణ శ్రీ నందమూరి తారక రామారావు గారికి, ఆయన 101వ జయంతి సందర్భంగా ఘన నివాళులర్పిస్తున్నాను. ఎన్ని సినిమాలు చేసినా కూడా ఇప్పటికీ ఒక సినిమాలో డైలాగ్ చెప్పాలంటే టెన్షన్ పడతాను. అదే కాపాడుతుంది అనుకుంటా. సినిమా అంటే అంత పాషన్. ఈ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ నిర్మాతలు నాగవంశీ గారికి, సాయి సౌజన్య గారికి ఆల్ ది బెస్ట్. నాన్నగారి 101వ జయంతి సందర్భంగా ఈ సినిమా వేడుక జరగడం సంతోషంగా ఉంది. మనకి సంక్రాంతి, ఉగాది ఎలాగో.. ప్రతి సంవత్సరం మే 28న కులాలకు, మతాలకు అతీతంగా అందరూ జరుపునే పండుగ రామారావు గారి జయంతి. అలాంటి రోజున ఈ కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నాను. ముందుగా మా సోదరుడు విశ్వక్ సేన్ గురించి చెప్పాలి. ఒక తల్లి కడుపున పుట్టకపోయినా.. బయట చూస్తే ఎవరైనా మమ్మల్ని కవలలే అంటారు. సినీ పరిశ్రమలో కొంతమందితోనే నేను చాలా సన్నిహితంగా ఉంటాను. విశ్వక్ కి సినిమా అంటే పాషన్. విశ్వక్ సినీ ప్రయాణాన్ని మొదటి నుంచి చూస్తున్నాను. తను కూడా నాలాగే సినిమా సినిమాకి, పాత్ర పాత్రకి కొత్తదనం చూపించాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. అలాగే ఉడుకు రక్తం, నాలాగే దూకుడుతనం కూడా ఉంది. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ అనే టైటిల్ విభిన్నంగా ఉంది. టైటిల్ తోనే సినిమా పట్ల ఆసక్తి కలుగుతోంది. ట్రైలర్ చాలా బాగుంది. గోదావరి అందాలతో పాటు, మంచి ఎమోషనల్ గా ఉంది. మంచి కిక్కిచ్చే సినిమాలా ఉంది. నిర్మాత నాగవంశీ, సోదరుడు విశ్వక్ సేన్ కలయికలో వస్తున్న ఈ సినిమా ఖచ్చితంగా బాగుంటుంది. మనం ఎప్పుడూ కొత్తదనం ఇవ్వాలి. అది నేను మా నాన్నగారి దగ్గర నుంచి నేర్చుకున్నాను. మనం కొత్తదనం ఇస్తే ప్రేక్షకులు ఖచ్చితంగా ఆదరిస్తారు. ఈ సినిమాలో ఆ కొత్తదనం కనిపిస్తుంది. అలాగే దర్శకుడు కృష్ణ చైతన్య. నేను బాలకృష్ణుడిని, ఈయన కృష్ణచైతన్య.. అదీ తేడా. అంతకముందు మా నారా రోహిత్ తో ‘రౌడీ ఫెలో’, నితిన్ తో ‘ఛల్ మోహన్ రంగ’ చేశారు. ఆ రెండు సినిమాలు ఆదరణ పొందాయి. ఈ సినిమా కూడా ఖచ్చితంగా ప్రేక్షకుల మెప్పు పొందుతుంది. ఈ సినిమలో ఇద్దరు ముద్దుగుమ్మలు ఉన్నారు నారి నారి నడుమ మురారిలా. అంజలితో కలిసి ‘డిక్టేటర్’ సినిమా చేశాను. మంచి మనిషి. అలాగే నేహా శెట్టి కూడా డీజే టిల్లు తో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకుంది. విశ్వక్ సేన్ ని అతని తల్లిదండ్రులు ఎంతో ప్రోత్సహిస్తున్నారు. అలాగే నా తనయుడు మోక్షజ్ఞ కూడా సినీ రంగంలోకి వస్తాడు. వాడికి ఈ తరం హీరోలు విశ్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డ, అడివి శేష్ వంటి వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని చెబుతుంటాను. చిత్ర బృందం అందరికీ ఆల్ ది బెస్ట్.” అన్నారు.
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. “ముందుగా నందమూరి బాలకృష్ణకి ధన్యవాదాలు. మీ అందరికీ ఒక ఇన్సిడెంట్ చెబుతాను. నేను ఈ సినిమాకి ఫైట్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు లారీ మీద నుంచి కిందకి పడిపోయా, మోకాలికి దెబ్బ తగిలింది. ఆల్మోస్ట్ మోకాలు చిప్ప విరిగిపోయింది. రెండేళ్లు మంచానికే పరిమితం అవ్వాలి అనుకున్నాను. అయితే దేవుడి దయవల్ల ఏమీ జరగలేదు. ఇంతమంది దీవెనలు, ప్రేమ అనుకుంటా. ఆ సమయంలో నాకు ఏమైందో అని చాలామంది వాకబు చేశారు. చాలామంది ఆరోగ్యం బాగుండాలని కోరుకున్నారు. అయితే నందమూరి బాలకృష్ణ గారు నాకు ఫోన్ చేసి 15 నిమిషాల పాటు నా ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నారు. అప్పుడు ఫోన్ లో కనిపించలేదు కానీ నేను ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఏడ్చాను.. ఆయన గొంతులో ఎప్పుడూ ఒక గాంబీర్యం ఉంటుంది కానీ నేను పడిపోయాను అని తెలిసి ఆయన ఎక్కువ బాధపడ్డారు. నీ గురించి చాలా బాధపడుతున్నాను అని ఆయన అంటుంటే వెంటనే ఏడ్చేశాను. నిజానికి కుటుంబ సభ్యుల తర్వాత అంత ప్రేమ చూపించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. నాకు బాలకృష్ణ గారి ఆ వాత్సల్యం దక్కింది. నాకు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో అర్థం కావడం లేదు కానీ ఈరోజు నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి సందర్భంగా జోహార్ ఎన్టీఆర్ అని మొదలు పెడుతున్నాను. నిజానికి అన్నగారి పోస్టర్ తోనే మా సినిమా ప్రయాణం, ఇదే జయంతి రోజున మొదలైంది. ఇప్పుడు ఇదే రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతోంది. నిన్న రాత్రి ఐదేళ్లలో ఏం జరిగింది అని ఆలోచిస్తుంటే సరిగ్గా మార్చి 31వ తేదీనే ఫలక్‌నుమా దాస్ రిలీజ్ అయింది. నేను ఇక్కడ నిలుచున్నాను అన్నా, నా ఐదేళ్లు నోట్లోకి వెళుతున్నాయి అన్నా, నాకు ఏం జరిగిందన్నా.. ఫలక్‌నుమా దాస్ అనే సినిమా నేను రిస్క్ తీసుకుని, మా నాన్న రిస్క్ తీసుకుని, నా స్నేహితులు రిస్క్ తీసుకుని ఆ సినిమా తీసినందుకే. ఆ సినిమాని ఆదరించిన ప్రేక్షకుల వల్లనే. అర్థం కాకుండానే ఐదు సంవత్సరాలు అయిపోయింది. ఐదు సంవత్సరాలు నన్ను సపోర్ట్ చేసిన అందరికీ థాంక్యూ సో మచ్, ముఖ్యంగా ఫ్యాన్స్ కి. చాలాసార్లు జీవితంలో ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయి. మీ వల్లనే నిలబడ్డాను. ఇక మా డైరెక్టర్ కి నాకు ఒకరినొకరు పొగుడుకోవడం ఇష్టం ఉండదు. కానీ నన్ను ఎలా ఊహించుకున్నాడో కానీ.. నాకు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఒక పాత్ర దొరికినట్లు అయింది. వెంటనే వంశీ అన్నకి ఫోన్ చేసి “నువ్వు నేను వెతుకుతున్న కత్తి దొరికేసింది అది దింపుదామని” చెప్పి రెడీ చేసిన కత్తి ఈ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. మా ఈ సినిమా కొత్త అప్రోచ్ తో వస్తున్న ఒక కమర్షియల్ సినిమా. బాలకృష్ణ గారు నాకు ఫోన్ చేసి ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఇది కొత్త సీసాలో ఉన్న పాత వైన్ అన్నారు. ఇదే ఆ కొత్త సీసా. నాగ వంశీ గారికి థాంక్యూ సో మచ్. రెండు మూడు సినిమాలు చేయడానికి రెడీ అయి కూడా చివరికి ఇది ఫిక్స్ అయ్యాం. నేను పని చేసిన తొమ్మిది సినిమాల బ్యానర్లలో ఇది బెస్ట్ బ్యానర్. నాగ వంశీ గారు నేను పనిచేసిన అందరిలో బెస్ట్ ప్రొడ్యూసర్. మా కో ప్రొడ్యూసర్స్ వెంకట్, గోపీచంద్ కూడా మొదటి రోజు నుంచి చాలా సహకరిస్తూ వచ్చారు. నన్ను, చైతన్యని భరించినందుకు థాంక్యూ సార్. మా నటీనటులు అందరు అద్భుతంగా నటించారు. నేను ఈ సినిమా అయిపోయిందని మొన్న రియలైజ్ అయ్యి రత్నాకి ఉన్నట్టే నేను కూడా చెవికి పోగు కుట్టించుకున్నాను. నాకు రత్న అనే వాడు నా జీవితంలో ఉండిపోవాలని కుట్టించుకున్నాను. చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాము. చాలా మంచి సినిమా తీశాం, చాలా నిజాయితీగా పని చేశాం. ఖచ్చితంగా మే 31న థియేటర్ కి ఫ్యామిలీ మొత్తం కలిసి రావచ్చు. సెన్సార్ కూడా యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. వైలెన్స్ కూడా కావాలని పెట్టింది కాదు.. ఒక కారణంతోనే ఉంటుంది. రత్న అనే వాడు ఏడిపిస్తాడు, నవ్విస్తాడు, తిట్టించుకుంటాడు కానీ చివరికి మీతో పాటు ఇంటికి వస్తాడు. చూసిన రెండు మూడు రోజులపాటు వెంటాడుతూనే ఉంటాడు. యువన్ శంకర్ రాజా గారి అభిమానిగా పెరిగాను, ఆయనతో సినిమా చేస్తున్నానని తెలిసి ఆనందపడ్డాను. మా కథానాయకుల గురించి చెప్పాలంటే ముందు రత్నమాల అనే క్యారెక్టర్ చెప్పినప్పుడు ఈ క్యారెక్టర్ అంజలి చేయాలని ఒక నిమిషం కూడా గ్యాప్ తీసుకోకుండా చెప్పేశాను. ఒక తమిళ్ సినిమా చూసి ఈమెతో ఎప్పటికైనా పని చేయాలనుకున్నాను. అది ఈ సినిమాతోనే కుదిరింది. ఈ పాత్రకి నువ్వు తప్ప ఎవరు న్యాయం చేయలేరు అంజలి. నేహా నువ్వు ఈ సినిమా తర్వాత ఎన్ని సినిమాలు అయినా చేయి ఇప్పటివరకు నిన్ను రాధిక అంటున్నారు కానీ ఇకమీదట బుజ్జి అని గుర్తుపెట్టుకుంటారు. రమ్యకృష్ణ గారి నీలాంబరి క్యారెక్టర్ లాగా ఈ సినిమాలో నీ క్యారెక్టర్ ని గుర్తు పెట్టుకుంటారు. మే 31న ధియేటర్లలో కలుద్దాం.” అన్నారు
కథానాయిక అంజలి మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. బాలకృష్ణ గారు చాలా రోజుల తర్వాత మిమ్మల్ని చూడడం చాలా సంతోషంగా ఉంది. ఈ వేడుకను వచ్చినందుకు థాంక్యూ సో మచ్ సర్. మీ గురించి నేను మాట్లాడే అంత స్థాయి లేకపోయినా మీ గురించి కొన్ని మాటలు చెప్పగలను. బాలకృష్ణ గారితో డిక్టేటర్ లో కలిసి చేస్తున్నప్పుడు నాకు ఆయనతో కలిసి పనిచేయటమే టెన్షన్ గా అనిపించింది. కానీ ఆయన ఎంతో స్వీట్ పర్సన్. అలాంటి పెద్ద స్టార్ తో పని చేస్తున్నప్పుడు నాకు కంఫర్ట్ అనిపించిందంటే.. అది కేవలం ఆయనతో కలిసి పనిచేయడం వల్లే. నేను ఇప్పటికీ అది గుర్తుపెట్టుకుంటాను. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి గురించి చెప్పాలంటే నేను ఇప్పటికే చాలాసార్లు చెప్పినట్టు ఇది నాకు ప్రత్యేక చిత్రం. రత్నమాల అనే పాత్ర ఇంకా ప్రత్యేకం. ఎందుకంటే నేను చేసిన సినిమాలలో, పాత్రలలో రత్నమాల చాలా విభిన్నంగా ఉంటుంది. కొన్నిసార్లు నాకే టఫ్ గా అనిపించింది. ఆ బాడీ లాంగ్వేజ్, ఆమె మాట్లాడే విధానం, డైలాగ్ డెలివరీ, ఇంతకుముందు ఎక్కడ నేను వాడని పద్ధతులు వాడాల్సి వచ్చింది. ఇది మీరందరూ ట్రైలర్ లోనే చూసి ఉంటారు. నాకు రత్న అనే క్యారెక్టర్ ఇచ్చినందుకు మా దర్శకుడికి థాంక్స్. నా సహనటుడు విశ్వక్ సేన్ టైగర్. విశ్వక్ గురించి చెప్పాలంటే ఆయన స్వీట్ హార్ట్. బేసిక్ గా తనతో వర్క్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. ఆయన పక్కన చేసే వాళ్ళకి చాలా కంఫర్టబుల్ అనిపిస్తుంది. ఈ సినిమాలో రత్న రూపంలో విశ్వక్ కి చాలా రోజులు గుర్తుండిపోయే ఒక పాత్ర దొరికింది. నేహాతో కలిసి కొన్ని సీన్స్ చేశాను కానీ ఆ ఎక్స్పీరియన్స్ అద్భుతంగా ఉంది. మేము మళ్లీ కలిసి పని చేయాలని కోరుకుంటున్నాను. మా కెమెరామెన్ పనితనం అద్భుతం. మీరు చూసిన ఫ్రేమ్స్ అన్ని ఆయన వల్లే సాధ్యమయ్యాయి. మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా నా మొదటి సినిమా నుంచి నాతో పని చేస్తున్నారు. ఈ సినిమా ఆయనకి చాలా స్పెషల్. ఎందుకంటే ఆయన అద్భుతమైన నేపథ్య సంగీతంతో పాటు సాంగ్స్ కూడా ఇచ్చారు. నాతో పాటు నటించిన ఆది, ఆనంద్, మధు అలాగే నాతో పాటు నటించిన ఇతర నటీనటులు అందరికీ ఒక స్పెషల్ మూవీ ఎక్స్పీరియన్స్ లా ఉండబోతుందని నేను ఆశిస్తున్నాను. ‘గ్యాంగ్స్ అఫ్ గోదావరి’ని ఇంత పెద్ద సినిమాగా చేయడానికి సిద్ధమైనందుకు మా నిర్మాతలు నాగ వంశీ గారు, చిన్న బాబు గారికి చాలా థాంక్స్. 31వ తేదీన సినిమా విడుదలవుతుంది. అందరూ థియేటర్లో సినిమా చూడండి. ఇప్పుడు మీరు ఎంత అరుస్తున్నారో అంతకుమించి థియేటర్స్ లో అరుస్తారని మేము ఆశిస్తున్నాము. ఇది ఒక మాస్ మూవీ.. మీరు కచ్చితంగా ఎంటర్టైన్ అవుతారని భావిస్తున్నాను.” అన్నారు.
కథానాయిక నేహశెట్టి మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. జై బాలయ్య. బాలకృష్ణ గారు ఎప్పుడూ యువ ప్రతిభను ప్రోత్సహిస్తూ ఉంటారు. ఈరోజు మా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చినందుకు బాలకృష్ణ గారికి కృతఙ్ఞతలు. ఈ వేడుకకు వచ్చిన రాధిక ఫ్యాన్స్ కి, మాస్ కా దాస్ ఫ్యాన్స్ కి, మరీ మఖ్యంగా బాలకృష్ణ గారి ఫ్యాన్స్ కి ధన్యవాదాలు. సితార అనేది నా హోమ్ ప్రొడక్షన్. నాకు మరో ఇల్లు లాంటిది. నన్ను ఎంతో బాగా చూసుకున్నారు. నన్ను నమ్మి ‘రాధిక’, ‘బుజ్జి’ లాంటి అద్భుతమైన పాత్రలలో నటించే అవకాశమిచ్చిన నిర్మాత నాగవంశీ గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. దర్శకుడు కృష్ణ చైతన్య గారు.. నా జీవితంలో కలిసిన గొప్ప వ్యక్తుల్లో ఒకరు. “మాటలు కంటే చర్యలు చాలా బిగ్గరగా మాట్లాడతాయి” అని ఆయన నమ్ముతారు. ఈ సినిమా విషయంలో అదే జరగబోతుంది. సినిమా అంతా నాతో ఎంతో ఓపికగా ఉంటూ, నన్ను ఎంతగానో ప్రోత్సహించిన చైతన్యకి బిగ్ థాంక్స్. మీ మాస్ కా దాస్, నా సహనటుడు విశ్వక్ సేన్. ఈ సినిమాలో విశ్వక్ తో నాది అద్భుతమైన ప్రయాణం. కొన్ని సందర్భాల్లో డైలాగుల విషయంలో ఇబ్బంది ఎదురైతే.. విశ్వక్ ఎంతో ఓపికగా నాకు హెల్ప్ చేశాడు. అందరికీ ఇలాంటి కో యాక్టర్ దొరకాలని కోరుకుంటున్నాను. నేను, అంజలి కలిసి కొన్ని సన్నివేశాల్లో నటించాము. త్వరలోనే మళ్ళీ కలిసి పని చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమాలో భాగమైన నటీనటులు, సాంకేతిక సిబ్బంది అందరికీ కృతఙ్ఞతలు. గతేడాది వేసవి నుంచి ఈ ఏడాది వేసవి వరకు ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం. మే 31న ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’తో వస్తున్నాం. మా సినిమాపై మీ ప్రేమని కురిపించి, మాకు విజయాన్ని అందిస్తారని ఆశిస్తున్నాను.” అన్నారు.
దర్శకుడు కృష్ణ చైతన్య మాట్లాడుతూ.. “ముందుగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన నందమూరి బాలకృష్ణ హృదయపూర్వక ధన్యవాదాలు. కారణజన్ములు ఎప్పుడూ మన వెన్నంటే ఉండి నడిపిస్తారని పెద్దవారు చెబుతుంటారు. సరిగ్గా సంవత్సరం క్రితం మే 28న ‘జోహార్ ఎన్టీఆర్’ అనే ఫస్ట్ పోస్టర్ తో ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ మొదలైంది. ఆరోజు నుంచి ఈరోజు వరకు వెనకాల ఎన్టీఆర్ గారే ఉండి నడిపిస్తున్నారు అనిపిస్తుంది. ఏ కంటెంట్ రిలీజ్ చేసినా.. గ్లింప్స్ రిలీజ్ చేసినా, టీజర్ రిలీజ్ చేసినా, సాంగ్స్ రిలీజ్ చేసినా, ట్రైలర్ రిలీజ్ చేసినా.. ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. జీవితంలో తల్లి, తండ్రి, గురువు చాలా ముఖ్యం. మా అమ్మగారు, నాన్నగారి ఆశీస్సుల వల్లే నేను ఇక్కడి వరకు వచ్చాను. అలాగే మా గురువుగారు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు.. ఈ సినిమాకి మూలం, ఆద్యం.. ఆయనే వల్లే మొదలైంది. అక్కడి నుంచి చినబాబు గారు, నాగవంశీ గారు, సాయి సౌజన్య గారు మమ్మల్ని నమ్మి, మా వెనకాల నిలబడి.. మమ్మల్ని నడిపించారు. వారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. చినబాబు గారు స్క్రిప్ట్ దగ్గర నుంచి, చివరి రీల్ పంపించేవరకు వరకు కూడా మాతో కూర్చున్నారు. చినబాబు గారికి మనస్ఫూర్తిగా కృతఙ్ఞతలు. యువన్ శంకర్ రాజా గారు అద్భుతమైన సంగీతం అందించారు. ఆయనతో కలిసి పని చేయడం సంతోషంగా ఉంది. ఎడిటర్ నవీన్ నూలి గారు నాకు వెన్నెముకలా నిలబడి ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. మా డీఓపీ అనిత్ సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంటుంది. విశ్వక్ సేన్ గురించి చెప్పాలంటే.. నా మాస్ కా దాస్.. నా బ్రదర్. మా బంధం మాటల్లో చెప్పలేనిది. ఒక్కటి మాత్రం చెప్పగలను. విశ్వక్ పోషించిన లంకల రత్న పాత్ర మిమ్మల్ని నవ్విస్తుంది, మిమ్మల్ని ఏడిపిస్తుంది, మిమ్మల్ని భయపెడుతుంది. అలాగే, ఈ సినిమాలో రత్న జీవితంలో ఇద్దరు బలమైన అమ్మాయిలు ఉన్నారు. బుజ్జిగా నేహా శెట్టి, రత్నమాలగా అంజలి పాత్రలు గుర్తుండిపోతాయి. ఈ సినిమాకి పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు పేరుపేరునా కృతఙ్ఞతలు. అలాగే మా దర్శక విభాగంలోని ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతఙ్ఞతలు. బాలకృష్ణ గారి గురించి మాట్లాడే అంత స్థాయి నాకు లేదు. ఆయన ఇక్కడికి రావడం మా అదృష్టం. బాలకృష్ణ గారి ఆశీస్సులు ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను.” అన్నారు.
ఈ వేడుక అభిమానుల ఆనందోత్సాహాల నడుమ ఆద్యంతం ఆహ్లాదకరంగా సాగింది. ఈ కార్యక్రమంలో నటులు హైపర్ ఆది, మధునందన్, ఆనంద్, నృత్య దర్శకులు భాను మాస్టర్, యశ్ మాస్టర్ తదితరులు పాల్గొన్నారు.