సినీ నటులు బండ్ల గణేష్, శివాజీ రాజా చేసిన పని ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. వీరిద్దరి 30 ఏళ్ల స్నేహం ఒక కుటుంబాన్ని నిలబెట్టింది. అదేమిటి అనుకుంటున్నారా అసలు విషయం ఏమిటంటే శివాజీ రాజా ప్రస్తుతం ఫిలింనగర్ కల్చరల్ క్లబ్ కు వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. త్వరలో ఫిలింనగర్ కల్చరల్ క్లబ్ కు ఎన్నికల జరుగుతున్న నేపథ్యంలో ఆయన మరోసారి వైస్ ప్రెసిడెంట్ గా బరిలోకి దిగేందుకు సిద్ధం అయ్యారు. నిజానికి శివాజీ రాజా ప్రెసిడెంట్ గా ఈసారి బరిలోకి దిగాలని భావించారు. కానీ ప్రెసిడెంట్ గా ఆది శేషగిరి రావు గారు బరిలో దిగుతున్నారని తెలుసుకొని ఆయన మీద గౌరవంతో తిరిగి వైస్ ప్రెసిడెంట్ గా పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. అయితే శివాజీ రాజా ప్రెసిడెంట్ గా పోటీ చేస్తున్నారని భావించిన బండ్ల గణేష్ వైస్ ప్రెసిడెంట్ గా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో శివాజీ రాజా, బండ్ల గణేష్ మధ్య ఉన్న స్నేహంతో బండ్ల గణేష్ శివాజీ రాజాను పోటీ నుంచి వైదొలగమని, మీరు ఒకసారి చేశారు కాబట్టి తాను ఒకసారి ప్రయత్నిస్తానని కోరారు.
మన ఇద్దరిలో ఎవరున్నా అల్టిమేట్ గా ప్రజలకు మంచి జరగాలని పేర్కొన్న శివాజీ రాజా ఒకవేళ నేను తప్పుకుంటే నువ్వు అడిగిన ఏదైనా మంచి పని నేను చేస్తాను లేదా నేను తప్పుకుంటే నేను చేయాలనుకున్న ఒక మంచి పనికి నువ్వు సహాయపడాలి అని కోరారు. దానికి బండ్ల గణేష్ వెంటనే ఒప్పుకున్నారు. ఇద్దరికీ సన్నిహితులైన కొందరి మధ్య ఏదైనా ఒక మంచి పనికి 5 లక్షల పదహారు వేల రూపాయలు విరాళం ఇచ్చేలా బండ్ల గణేష్ మాట ఇచ్చారు. ఆ డబ్బు ఎవరికి ఇవ్వాలా అని ఆలోచిస్తున్న సమయంలో 20 ఏళ్ల ఆక్సిడెంట్ కి గురై కళ్ళు పోగొట్టుకొని తాజాగా కిడ్నీ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్న నరేష్ అనే డ్రైవర్ కు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.
సాధారణంగా ఎన్నికలంటే హోరాహోరీ ఆరోపణలు ప్రత్యేకరోపణలతో మీడియాకు ఎక్కుతున్న ఈ రోజుల్లో ఒక మంచి పని చేస్తే పోటీ నుంచి వైదొలుగుతానని శివాజీ రాజా చెప్పడం వెంటనే దానికి బండ్ల గణేష్ కూడా మంచి పని అంటే నేనెందుకు చేయను అంటూ ఆయన కూడా సహాయం చేసేందుకు సిద్ధం కావడంతో శివాజీ రాజా సన్నిహితులు, మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్ సమక్షంలో నిర్ణయించి ఐదు లక్షల పదహారు వేల రూపాయల చెక్కును నరేష్ కుటుంబానికి అందజేశారు.
ఈ సందర్భంగా ఫిలింనగర్ కల్చరల్ క్లబ్ ఎన్నికల్లో తాను బండ్ల గణేష్ కు మద్దతు ఇస్తున్నానని, ఇప్పటికే చాలా మంది హేమాహేమీలు వైఎస్ ప్రెసిడెంట్ గా పని చేశారు, ఇప్పుడు బండ్ల గణేష్ కు ఒక అవకాశం ఇచ్చి చూడాలని శివాజీ రాజా కోరారు. ఇక డాక్టర్ కే వెంకటేశ్వర రావు (కేవీఆర్), కరాటం రాంబాబు, బండ్ల గణేష్, శివాజీ రాజా, ఏడిద శ్రీ రామ్, ఎఫ్ఎన్సీసీ కమిటీ మెంబర్లు సుష్మ, శైలజ, సంతోషం సురేష్, రవిరాజా చేతుల మీదిగా డ్రైవర్ నరేష్ కు 5 లక్షల 16 వేల చెక్కును అందించారు. ఇలాంటి మంచి నిర్ణయం తీసుకున్న బండ్ల గణేష్, శివాజీ రాజాలపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఎన్నికలలో పోటీ అంటే మంచి చేయడం కోసం పోటీ చేయడమే అని ఈ సందర్భంగా నిరూపితమైందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.