ఈశా గ్రామోత్సవం, ఇది కుల అడ్డంకులను చేధించడానికి, మహిళలకు సాధికారత కల్పించడానికి అలాగే గ్రామీణ స్ఫూర్తిని పునరుద్ధరించడానికి ఒక సామాజిక సాధనం: ఈశా గ్రామోత్సవం 2023 గ్రాండ్ ఫినాలేలో కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్
“ఈశా గ్రామోత్సవం – గ్రామస్తులు వ్యసనాలకు దూరంగా ఉండటానికి, సమాజంలోని కుల అడ్డంకులను తొలగించడానికి, మహిళలకు సాధికారత కల్పించడానికి ఇంకా గ్రామీణ స్ఫూర్తిని పునరుద్ధరించడానికి సహాయపడే – సామాజిక పరివర్తనకు సమర్థవంతమైన సాధనంగా మారిందని తెలిసి నేను సంతోషిస్తున్నాను” అని – శనివారం కోయంబత్తూరులోని, ఈశా యోగా కేంద్రంలోని ఆదియోగి వద్ద జరిగిన ఈశా గ్రామోత్సవం గ్రాండ్ ఫినాలేలో పాల్గొన్న కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్ అన్నారు.
2004లో సద్గురు చే ప్రారంభించబడిన ఈ సామాజిక కార్యక్రమం, గ్రామీణ ప్రజల జీవితాల్లోకి క్రీడాస్ఫూర్తిని ఇంకా ఉల్లాసాన్ని తీసుకురావడానికి ఉద్దేశించబడింది. ఈ మహత్తర కార్యక్రమంలో మంత్రి గారితో పాటు, ఫౌండర్-ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకులలైన సద్గురు, ప్రముఖ తమిళ నటుడు సంతానం మరియు మాజీ భారత హాకీ కెప్టెన్ ధనరాజ్ పిళ్ళై పాల్గొన్నారు.
“సద్గురు చేపట్టిన ఈ అద్భుతమైన కార్యక్రమం, గ్రామీణ క్రీడలను ఇంకా సంస్కృతిని మరెక్కడా లేని విధంగా వేడుక జరుపుకుంటోంది. ఈశా గ్రామోత్సవం – గ్రామీణ ప్రజలకు ఆరోగ్యం, ఐశ్వర్యం ఇంకా శ్రేయస్సు తీసుకురావాలనే లక్ష్యంతో 2004లో ప్రారంభించబడింది, ఇక ఇప్పుడు నేను ఇక్కడ క్రీడాకారులను చూస్తున్నాను, వారిలో కొందరు కూలీలుగా, వ్యవసాయదారులు అలాగే మత్స్యకారులు ఉన్నారు; కాని నేను వారిలో క్రీడా స్పూర్తిని చూడగలుగుతున్నాను,” అని శ్రీ ఠాకూర్ అన్నారు.
112 అడుగుల ఆదియోగి వద్ద నిర్వహించబడిన ‘ఫినాలే’లో – క్రీడాకారులు కనబరిచిన గ్రామీణ ప్రతిభ పాటవం ఆకర్షణీయంగా నిలిచింది. ప్రపంచంలోని నలుమూలల నుండి తరలివచ్చిన ప్రేక్షకులు – ఛాంపియన్‌షిప్ ట్రోఫీ కోసం క్రీడాకారులు తమ సర్వస్వాన్ని పెట్టి ఆడుతుండగా – ఉత్కంఠగా వీక్షిస్తూ, ఈలలు వేస్తూ వారిని ప్రోత్సాహపరిచారు.
ఈ సందర్భంగా ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకులలైన సద్గురు మాట్లాడుతూ, “వేడుక స్ఫూర్తి అనేదే జీవితానికి ఆధారం, అలాగే మీరు సరదాగా ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది. కాబట్టి 25,000 గ్రామాలలో, 60,000 మందికి పైగా ఆటగాళ్ళను, అలాగే ఆ గ్రామాల్లోని వందలు, వేలాది ప్రేక్షకులు, ఏదో ఒక సమయంలో మైమరిచిపోయి – ఎగరడం, అరవడం, కేకలు వేయడం, నవ్వడం ఇంకా కంటతడి పెట్టడం వంటివి చేయడాన్ని చూడటం చాలా అద్భుతంగా ఉంది. జీవితం గొప్పగా జరగడానికి కావాల్సింది ఇదే” అని అన్నారు.
జీవితంలో ఉల్లాసాన్ని తీసుకురావాల్సిన అవసరాన్ని ఎత్తిచూపుతూ, సద్గురు ఇలా అన్నారు, “మన మంత్రిగారు, మీరు ఏదో ఒక ఆట ఆడాలి అంటున్నారు. మీ పరిస్థితులు ఏంటో నాకు తెలీదు. మీరు అపార్ట్మెంట్ భవనంలో నివసిస్తున్నారో లేదా ఇంకెక్కడ నివసిస్తున్నారో నాకు తెలీదు. సరే, కనీసం ఒకరిపై ఒకరు బంతి విసరవచ్చు. ఒకవేళ బంతి లేకపోతే, ఉల్లిపాయ విసరండి. ఉల్లిపాయ చాలా ఖరీదైనది అయితే, బంగాళాదుంప విసరండి – జీవితాన్ని ఉల్లాసభరితంగా మార్చుకోవడానికి ఏదోటి విసరండి”
ఫైనల్స్‌లో పోటీపడుతున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆనందపురం త్రోబాల్ జట్టు కెప్టెన్, కుమారి మాట్లాడుతూ, “మొదట్లో, మేము ఆడటానికి మా కుటుంబాలు ప్రోత్సహించలేదు, కానీ మేము ఫైనల్స్‌కు చేరుకోవడం అనేది వారి దృక్పథాన్ని మార్చేసింది, ఆ తర్వాత వారే మమ్మల్ని అందరికంటే ఎక్కువగా ప్రోత్సహించారు. మా జట్టు సభ్యులు, సాధారణంగా రోజువారీ పనులు చేసుకుంటూ ఉంటారు, కాబట్టి రోజూ రాత్రి పూట ప్రాక్టీస్ చేసే వాళ్ళం. ఒక ఆమె అయితే, ఫైనల్స్‌లో పాల్గొనేందుకు తన మూడు నెలల పాపను కూడా విడిచి పెట్టి వచ్చింది! ఇక్కడికి రావడంతో మా కల సాకారమైంది. శిక్షణ నుండి మొదలుకొని కోయంబత్తూరుకు ప్రయాణించే వరకూ – మాకు అండగా నిలిచిన ఈశా వాలంటీర్లకు ఎనలేని కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ”అని పంచుకున్నారు.
అయితే, ఈశాగ్రామోత్సవం ఫైనల్ మ్యాచ్‌లు – వాటి పేరుకి తగ్గట్టుగా – ప్రేక్షకులను సీట్లకు కట్టిపడేసేలా చేశాయి. వాలీబాల్‌లో, సేలంకు చెందిన ఉత్తమసోల్‌పురం FEC సితురాజపురంపై గెలిచి అగ్రస్థానంలో నిలిచింది. త్రోబాల్‌లో, కోయంబత్తూరుకు చెందిన పీజీ పుడూర్ విజేత ట్రోఫీని గెలుచుకోగా, కర్ణాటకలోని మరగోడుకు చెందిన బ్లాక్ పాంథర్ రెండో స్థానంలో నిలిచింది. మహిళల కబడ్డీలో, అబ్బురపరిచే రైడ్స్ ఇంకా డిఫెన్స్‌లు జరుగగా, ఈరోడ్ జట్టు దిండిగల్ జట్టును ఓడించింది. పారాలింపిక్స్ ఆటల్లో, కోయంబత్తూర్‌కు చెందిన కోయంబత్తూర్ పారా వాలీబాల్ అసోసియేషన్, కన్యాకుమారికి చెందిన కుమారి కింగ్స్‌పై గెలిచి పారాలింపిక్ వాలీబాల్ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకుంది.
ఆగస్టు నెలలో ప్రారంభమైన ఈ క్రీడా మహోత్సవం, దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ ఇంకా కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలలో ఆవిష్కృతమైంది. దాదాపు 194 గ్రామీణ ప్రాంతాల్లో జరిగిన ఈ ఆటలతో – ఈశా గ్రామోత్సవం 60,000 మంది క్రీడాకారులకు స్ఫూర్తినిచ్చింది. అందులో 10,000 మంది గ్రామీణ మహిళలు ఉండగా, వీరిలో చాలా వరకూ గృహిణులు. వీరు కబడ్డీ, త్రోబాల్ వంటి ఈవెంట్‌లలో పాల్గొన్నారు.
ఒక ప్రత్యేక నిర్మాణం గల ఈ ఈశా గ్రామోత్సవం, ప్రొఫెషనల్ ఆటగాళ్ళ కోసం కాదు. ఇది సామాన్య గ్రామీణ ప్రజలకు – అంటే రోజువారీ వేతనంకై పనులు చేసుకునే వారి నుండి, మత్స్యకారుల నుండి, గృహిణుల నుండి ఇతరుల వరకూ – తమ రోజువారీ పనుల నుండి కొంచెం విరామం పొంది, క్రీడలలోని ఐక్యం చేసే శక్తిని ఇంకా వేడుకనీ ఆస్వాదించేందుకు ఒక వేదికను అందిస్తుంది.
ఈశా గ్రామోత్సవాన్ని నిర్వహిస్తున్న ఈశా ఔట్రీచ్, క్రీడలు & యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖచే నేషనల్ స్పోర్ట్స్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ (NSPO)గా గుర్తింపు పొందింది. సచిన్ టెండూల్కర్, ఒలింపిక్ పతక విజేత రాజవర్ధన్ సింగ్ రాథోడ్, కర్ణం మల్లేశ్వరి వంటి క్రీడా ప్రముఖులు గతంలో క్రీడా ఉత్సవాల ఫైనల్స్‌లో ప్రత్యేక అతిథులుగా పాల్గొన్నారు. మిథాలీ రాజ్, పివి సింధు, వీరేంద్ర సెహ్వాగ్, శిఖర్ ధావన్ మరియు జవగళ్ శ్రీనాథ్ ఈశా గ్రామోత్సవానికి తమ మద్దతు తెలిపారు.
ఫోటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి