ఒక్కడే అందరినీ ఎదుర్కొంటే.. ‘లాస్ట్ మ్యాన్ ఇన్ టవర్’తో వస్తున్న మనోజ్ బాజ్‌పాయ్, దివ్య దత్తా, బోమన్ ఇరానీ

Must Read

అభివృద్ధి చెందుతోన్న నగరంతో పాటు ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. ఎంత మారినా కూడా కొన్నింటిని వదులుకోవడం మాత్రం అంత సులభం కాదు. ముఖ్యంగా మనకు ఎంతో అనుబంధం ఉన్న ఇంటిని వదిలిపెట్టడం మరింత కష్టం. ఇలాంటి ఆసక్తికరమైన కథాంశంతో తెరకెక్కిన చిత్రమే ‘లాస్ట్ మ్యాన్ ఇన్ టవర్’. మనోజ్ బాజ్‌పాయ్, బోమన్ ఇరానీ, దివ్య దత్తా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఓ రిటైర్డ్ టీచర్ చుట్టూ తిరుగుతుంది. ముంబైలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివసించే ఆయన.. ఆ భవనాన్ని పునర్నిర్మించేందుకు (రీడెవలప్‌మెంట్) భారీ మొత్తంలో డబ్బు ఇస్తామన్న ఆఫర్ వచ్చినా ఇల్లు ఖాళీ చేయడానికి అంగీకరించడు. తనకు ఎంతో ఇష్టమైన ఇంటిని కాపాడుకోవడం కోసం ఏకంగా ఆ హౌసింగ్ సొసైటీలోని అందరినీ ఎదిరిస్తాడు. ఒక వ్యక్తి తన ఇంటి కోసం ఎంతవరకు పోరాడగలడు? ఈ క్రమంలో ఎదురయ్యే పరిణామాలేంటి? అనే ఆసక్తికర అంశాలతో ఈ డ్రామా తెరకెక్కింది. ఈ చిత్రం నవంబర్ 6 నుంచి హిందీ జీ5లో ప్రీమియర్ కానుంది.

రానా దగ్గుబాటి నిర్మాణ సంస్థ స్పిరిట్ మీడియా ఈ చిత్రాన్ని నిర్మించింది. బెన్ రేఖి దర్శకత్వం వహించారు. అరవింద్ అడిగా రాసిన ఇదే పేరుతో ఉన్న నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ముంబై నగరంలో వేగంగా మారుతున్న పట్టణ జీవనశైలి నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. మనిషికి తన ఇంటితో ఉండే అనుబంధం, మానవ సంబంధాల్లోని సంక్లిష్టతలు, మ‌నిషికి ఎదుర‌య్యే కష్టమైన నిర్ణయాలను ఈ సినిమా ఆవిష్క‌రిస్తుంది. మధ్యతరగతి ప్రజల ఆశలు, ఆకాంక్షలను ప్రతిబింబించేలా ఇందులో పాత్రలను తీర్చిదిద్దారు. ఒక వ్యక్తి నమ్మకాలు, అభిప్రాయాలు.. ఓ సమాజంలోని అందరి ఆశయాలకు ఎదురుగా నిలిస్తే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్నది ఆసక్తికరంగా చూపించనున్నారు. భావోద్వేగాలతో కూడిన కథ, బలమైన నటనతో ‘లాస్ట్ మ్యాన్ ఇన్ టవర్’ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతోంది.

ముంబైలోని ఓ పాత హౌసింగ్ సొసైటీ నేపథ్యంలో ‘లాస్ట్ మ్యాన్ ఇన్ టవర్’ కథ సాగుతుంది. ఇందులో మనోజ్ బాజ్‌పాయ్ యోగేశ్ మిశ్రా అనే రిటైర్డ్ ఫిజిక్స్ టీచర్ పాత్రలో కనిపిస్తారు. ఆ అపార్ట్‌మెంట్‌లోని మిగతా వారంతా రీడెవలప్‌మెంట్ ఒప్పందానికి అంగీకరించగా.. యోగేశ్ మాత్రం అందుకు ఒప్పుకోకుండా ఒంటరిగా పోరాటం చేస్తాడు. ఈ ఒప్పందం వల్ల తమకు మంచి భవిష్యత్తు ఉంటుందని అంద‌రూ అనుకుంటారు. కానీ యోగేశ్ మాత్రం తనకు ఎంతో అనుబంధం ఉన్న ఇంటిని, అక్కడి మనుషుల మధ్య ఉన్న ఆత్మీయతను వదులుకోవడానికి ఇష్టపడడు. అయితే ఆయన తీసుకున్న నిర్ణయం క్రమంగా పరిస్థితులను మార్చేస్తుంది. ఒకప్పుడు తన స్నేహితులుగా భావించిన వారే ఆయనకు దూరమవుతారు. తమ ఆశలు, ఆకాంక్షలకు యోగేశ్ అడ్డుపడుతున్నాడని భావించి అతడిని ఓ పరాయివాడిలా చూడటం మొదలుపెడతారు. ఇలా తన ఇంటిని కాపాడుకోవాలనే ఓ వ్యక్తి పట్టుదల.. చివరకు అతడిని తన వాళ్లకే దూరం చేసే పరిస్థితులకు ఎలా దారితీసిందన్నదే ఈ సినిమా కథాంశం.

ఈ సంఘర్షణలో ప‌ట్టించుకునే వారు లేక నిర్ల‌క్ష్యానికి గురైన గృహిణి సంగీత పురి పాత్ర‌లో దివ్య దత్తా నటించారు. తన కుమారుడికి మెరుగైన భవిష్యత్తును అందించాలన్నది ఆమె ఆశ. అయితే ఈ ఆశయమే ఆమెను యోగేశ్‌కు ఎదురుగా నిలిచేలా చేస్తుంది. మరోవైపు డెవలపర్ ధర్మేన్ షా పాత్రలో బోమన్ ఇరానీ కనిపించనున్నారు. హౌసింగ్ సొసైటీ రీడెవలప్‌మెంట్ పనులను ముందుకు తీసుకెళ్లేందుకు ఆయన ప్రయత్నిస్తుంటారు. దీంతో ఆ సొసైటీలో మొదలైన వివాదం క్రమంగా ముంబై నగరంలో వస్తున్న మార్పులకు అద్దం పట్టేలా మారుతుంది. అభివృద్ధి, మెరుగైన జీవితం కోసం మనుషులు పడే తపనకు.. సమాజంలో ఐక్యత, ఆత్మీయత, అనుబంధాల విలువలకు మధ్య జరిగే సంఘర్షణను ఈ సినిమా చూపించనుంది.

అరవింద్ అడిగా రాసిన ఇదే పేరుతో ఉన్న నవల ఆధారంగా రూపొందిన ఈ చిత్రం మధ్యతరగతి జీవితంలోని మరో కోణాన్ని ఆవిష్కరిస్తుంది. తాను నమ్మిన విలువల కోసం ఒంటరిగా నిలబడినప్పుడు ఎదురయ్యే ఒంటరితనం, గతంతో ఉన్న అనుబంధాన్ని కాపాడుకోవాలనుకునే క్రమంలో ఇతరుల కలలు, ఆశయాలను ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు తీసుకోవాల్సిన కఠిన నిర్ణయాలను భావోద్వేగభరితంగా తెరకెక్కించారు.

“Last man in Tower” Trailer: https://www.youtube.com/watch?v=ZuKPSLzSm88

యోగేశ్ మిశ్రా కేవలం మార్పును అంగీకరించలేకపోతున్నాడా? లేక తన ఇంటిపై అతడికి ఉన్న అనుబంధం వెనుక మరేదైనా బలమైన కారణం ఉందా? ఒక ప్రదేశానికి ప్రత్యేకతను తీసుకొచ్చేది అక్కడ నివసించే మనుషులేనా? లేక ఆ ప్రదేశంతో ముడిపడిన జ్ఞాపకాలు, అనుభూతులకు కూడా అంతే ప్రాధాన్యం ఉంటుందా? గతంతో ఇంతటి అనుబంధం ఉన్నప్పుడు.. మెరుగైన భవిష్యత్తు ఉంటుందన్న హామీ మాత్రమే మనిషిని ముందుకు నడిపించగలదా? ఇలాంటి ఆలోచింపజేసే ప్రశ్నలకు స‌మాధానం తెలియాలంటే న‌వంబ‌ర్ 6 నుంచి స్ట్రీమింగ్ కానున్న‌ ‘లాస్ట్ మ్యాన్ ఇన్ టవర్’ను చూడాల్సిందే. ఈ సంద‌ర్భంగా…

దర్శకుడు బెన్ రేఖి మాట్లాడుతూ.. ‘‘అద్భుతమైన టీమ్‌తో కలిసి ‘లాస్ట్ మ్యాన్ ఇన్ టవర్’ చిత్రాన్ని తెరకెక్కించడం ఎంతో సంతృప్తినిచ్చింది. రానా దగ్గుబాటి నిర్మాతగా వ్యవహరించగా.. సూనీ తారాపోరేవాలా స్క్రిప్ట్ అందించారు. అరవింద్ అడిగా రాసిన అద్భుతమైన నవల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించాం. ముఖ్యంగా ఈ సినిమాలో ఇద్దరు గొప్ప నటులు మనోజ్ బాజ్‌పాయ్, బోమన్ ఇరానీ కలిసి తొలిసారి నటించడం చూడటం ఎంతో ఆనందంగా ఉంది. కష్టకాలంలో కుటుంబం, సమాజంతో మనకున్న అనుబంధాలను ఎలా కాపాడుకోవాలనే విషయాన్ని ఈ సినిమా చర్చిస్తుంది. కాలం గడిచేకొద్దీ ఈ కథలోని అంశాలు మరింత ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి’’ అన్నారు.

న‌టుడు మనోజ్ బాజ్‌పాయ్ మాట్లాడుతూ.. ‘‘లాస్ట్ మ్యాన్ ఇన్ టవర్ సినిమాలో యోగేశ్ మిశ్రా పాత్రలోని సంక్లిష్టత నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. తాను నమ్మిన సిద్ధాంతాల కోసం గట్టిగా నిలబడే వ్యక్తి అతడు. అయితే అతడి నిర్ణయం సరైనదా? కాదా? అన్న ప్రశ్నను ఈ కథ ప్రేక్షకుల్లో కలిగిస్తుంది. నటుడిగా నాకు ఈ పాత్రలోని భిన్న కోణాలు ఎంతో ఆసక్తిని కలిగించాయి. మొండితనం, బలహీనత, తన ఇంటిపై, అక్కడ ముడిపడిన జ్ఞాపకాలపై యోగేశ్‌కు ఉన్న గాఢమైన అనుబంధం.. ఇలా ఎన్నో భావోద్వేగాలతో కూడిన పాత్ర ఇది. ముంబై లాంటి నగరంలో రీడెవలప్‌మెంట్ అనేది నిత్యజీవితంలో భాగమైపోయింది. ఒకప్పుడు మనకు ఎంతో పరిచయమైన భవనాల స్థానంలో కొత్త నిర్మాణాలు వస్తున్నాయి. అయితే ఈ మార్పుల వెనుక ఉన్న మానవీయ కోణాన్ని ఈ సినిమా ఆవిష్కరిస్తుంది. ఇలాంటి మార్పులు కుటుంబాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? తమతో ముడిపడిన జ్ఞాపకాలను వదిలి వెళ్లడం ఎలా ఉంటుంది? కొత్త జీవితాన్ని ప్రారంభించాలనే ఆలోచన ఎలాంటి అనిశ్చితి లేదా ఉత్సాహాన్ని కలిగిస్తుంది? అనే అంశాలను ఇందులో చూపించాం.
‘లాస్ట్ మ్యాన్ ఇన్ టవర్’ హిందీ జీ5లో విడుదలవుతుండటం సంతోషంగా ఉంది. ఈ సినిమా ద్వారా మరింత మంది ప్రేక్షకులు ఈ కథను చూసి, తమకు ఇల్లు అంటే నిజంగా ఏమిటో ఆలోచించే అవకాశం లభిస్తుంది. ఇల్లు అంటే నాలుగు గోడలేనా? లేక ఆ గోడల మధ్య నివసించే మనుషులా? అన్న ప్రశ్నకు ప్రతి ఒక్కరూ తమదైన సమాధానం వెతుక్కుంటారు’’ అని తెలిపారు.

దివ్య దత్తా మాట్లాడుతూ.. ‘‘లాస్ట్ మ్యాన్ ఇన్ టవర్ సినిమా నన్ను ఆకర్షించడానికి ప్రధాన కారణం.. ఇందులో మనుషుల ప్రవర్తన, వారు తీసుకునే నిర్ణయాలను కేవలం మంచి, చెడు అనే కోణంలో కాకుండా చాలా సహజంగా చూపించడం. ప్రతి ఒక్కరికీ వారి పరిస్థితులు, ఆశలు, ఆకాంక్షలు, వారు అలా ప్రవర్తించడానికి కొన్ని కారణాలు ఉంటాయి. అందుకే ఈ సినిమాలోని సంఘర్షణ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది. ముఖ్యంగా ఇందులో నా పాత్రకు ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన చాలా సంతోషాన్నిచ్చింది. నా పాత్ర ప్రవర్తించిన తీరు, ఆమె చూపించిన ఆవేశంతో ప్రేక్షకులు ఏకీభవించకపోవచ్చు. కానీ ఆమె అలా ఎందుకు ప్రవర్తించింది? ఆమె నిర్ణయాల వెనుక ఉన్న పరిస్థితులేంటి? అన్నది మాత్రం అర్థం చేసుకున్నారు. ఒక నటిగా ప్రేక్షకులు నా పాత్రతో కనెక్ట్ అవ్వడం ఎంతో సంతృప్తినిచ్చింది. వారు నా పాత్ర నిర్ణయాలతో ఏకీభవించకపోయినా.. ఆమె భావాలను, పరిస్థితులను అర్థం చేసుకోవడం ఆనందంగా ఉంది. ఇప్పుడు ఈ సినిమా హిందీ జీ5లో ప్రీమియర్ అవుతుండటం సంతోషంగా ఉంది. ఈ కథలోని భిన్నమైన భావోద్వేగాలు, ఆలోచింపజేసే అంశాలు మరింత మంది ప్రేక్షకులకు చేరువవుతాయని ఆశిస్తున్నాను’’ అని తెలిపారు.

స్పిరిట్ మీడియా నిర్మాత రానా దగ్గుబాటి మాట్లాడుతూ.. ‘‘లాస్ట్ మ్యాన్ ఇన్ టవర్ ఒక అద్భుతమైన మానవీయ కథ. మనం జీవితంలో తీసుకునే నిర్ణయాలు, దేనిని వదులుకోవడానికి ఇష్టపడతాం? దేనిని చివరి వరకు పట్టుకుని ఉంటాం? అనే అంశాలను ఈ సినిమాలో చూపించిన తీరు ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. మనోజ్ బాజ్‌పాయ్, దివ్య దత్తా, బొమన్ ఇరానీతో పాటు ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరూ తమ పాత్రలకు అద్భుతమైన లోతును తీసుకొచ్చారు. వారి నటన సినిమాకు మరింత బలాన్ని చేకూర్చింది’’ అన్నారు.

జీ5 గురించి:
జీ5 భారతదేశంలోనే అతిపెద్ద స్వదేశీ వీడియో స్ట్రీమింగ్ వేదిక. దక్షిణాసియా కంటెంట్‌ను ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులకు చేరువ చేస్తూ 190కి పైగా దేశాల్లో సేవలందిస్తోంది. జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్‌కు చెందిన ఈ ఓటీటీ వేదిక.. స్థానిక భాషలు, ప్రాంతీయ అభిరుచులకు ప్రాధాన్యతనిస్తూ విభిన్నమైన వినోదాన్ని అందిస్తోంది.

హిందీ, తమిళం, తెలుగు, బెంగాలీ, మలయాళం, కన్నడ, మరాఠీ భాషల్లో ఒరిజినల్స్, భారతీయ, అంతర్జాతీయ చిత్రాలు, టీవీ షోలు, లైవ్ స్పోర్ట్స్, పిల్లల కార్యక్రమాలు, వార్తలు, లైవ్ టీవీ, మైక్రో డ్రామాలతో కూడిన విస్తృతమైన కంటెంట్ లైబ్రరీ జీ5 సొంతం. విభిన్న భాషలు, అభిరుచులకు అనుగుణంగా ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తోంది. జీ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ఫిఫాతో 2034 వరకు కుదుర్చుకున్న దీర్ఘకాలిక భాగస్వామ్యంలో భాగంగా.. భారత్‌లో ఫిఫా నిర్వహించే ప్రధాన ఫుట్‌బాల్ టోర్నమెంట్లను కూడా జీ5 ప్రసారం చేయనుంది. ఇందులో 2026, 2030 ఫిఫా ప్రపంచకప్‌లు కూడా ఉన్నాయి.

Latest News

బ్రహ్మాజీ ఆవిష్కరించిన “యువర్స్ బాబీ” ఫస్ట్ లుక్

జెనీషా ఏ వన్ మూవీ పతాకంపై సంజయ్ ఆర్, రావ్, రిచా జోషి, నటాషా సింగ్ , ప్రాచీ థాకర్, హీరో హీరోయిన్లుగా రామ్ మోహన్...

More News