ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ‘టిల్లు స్క్వేర్’ చిత్రం ఉంటుంది: ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిత్ర బృందం

Must Read

ఈమధ్య కాలంలో తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న సీక్వెల్ అంటే ‘టిల్లు స్క్వేర్’ అని చెప్పవచ్చు. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన ‘డీజే టిల్లు’ ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఈ చిత్రం యువత మరియు సినీ ప్రియుల్లో కల్ట్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. దాంతో ఈ చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న ‘టిల్లు స్క్వేర్’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పాటలు, ప్రచార చిత్రాలు ఆ అంచనాలను రెట్టింపు చేశాయి.

‘టిల్లు స్క్వేర్’ చిత్రానికి సిద్ధు జొన్నలగడ్డ కథనం, సంభాషణలు అందించగా.. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌,ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘డీజే టిల్లు’కి మించిన వినోదాన్ని అందించడానికి ‘టిల్లు స్క్వేర్’ చిత్రం మార్చి 29న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం హైదరాబాద్ లో ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకులు అనిల్ రావిపూడి, బాబీ కొల్లి, బొమ్మరిల్లు భాస్కర్, వెంకీ అట్లూరి, నీరజ కోన ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ ఐదుగురు దర్శకులు కలిసి ‘టిల్లు స్క్వేర్’ రిలీజ్ ట్రైలర్ ను ఆవిష్కరించారు. ఈ రిలీజ్ ట్రైలర్ విశేషంగా ఆకట్టుకొని సినిమా పట్ల ఆసక్తిని మరింత పెంచుతోంది.

కథానాయకుడు సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ.. “డీజే టిల్లు అంటే ముందుగా అందరికీ గుర్తొచ్చేది టైటిల్ సాంగ్. ఈ పాట కోసం రామ్ మిరియాల గారిని ఆఫీస్ కి పిలిపించాము. పారితోషికం గురించి మాట్లాడుతుంటే.. అప్పుడు ఆయన డబ్బులు గురించి తర్వాత చూద్దాం.. ముందు పాట బాగా రావాలి అన్నారు. సినీ పరిశ్రమలో ఇలా ఉండేవాళ్ళు చాలా తక్కువమంది ఉంటారు. రామ్ మిరియాలను కలిసిన ప్రతిసారీ ఒక మాట అంటాను. అదేంటంటే.. నువ్వు పాడినప్పుడు నీ గొంతులో మట్టివాసన ఉంటుంది. అంత రియల్ గా, అంతా రా గా ఉంటుంది. డీజే టిల్లు పాటని అంత అద్భుతంగా స్వరపరిచిన రామ్ మిరియాల గారికి, అంతే అద్భుతంగా రాసిన కాసర్ల శ్యామ్ గారికి ధన్యవాదాలు. సినిమాని ఆ పాటే భుజాల మీద తీసుకెళ్లి సగం మోసింది. నాకు ఇలాంటి పాట అందించిన మీ ఋణం ఎప్పటికీ తీర్చుకోలేను. అలాగే ఈ సినిమాలో భాగమైన శ్రీరామ్ చంద్ర గారి వాయిస్ చాలా బాగుంటుంది. బేబీ సినిమాలో ఆయన వాయిస్ విని పిచ్చొడిని అయిపోయాను. మనసు విరిగిన కుర్రాళ్ళ మనస్సులో ఉన్న బాధ అంతా ఆయన గొంతులోనే ఉంటుంది. శ్రీరామ్ గారు మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరుకుంటున్నాను. మా మార్కస్, లడ్డు గురించి చెప్పాలి. ఈ జర్నీలో మేము మంచి ఫ్రెండ్స్ అయ్యాం. ఈ సినిమాలో వారి పాత్రలు చాలా బాగుంటాయి. అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. నా తల్లిదండ్రుల పాత్రలు పోషించిన మురళీధర్ గారు, సుజాత గారు, మిగతా నటీనటులకు థాంక్స్. డీజే టిల్లు అనేది యువతని దృష్టిలో పెట్టుకొని తీసిన సినిమా. కానీ సినిమా విడుదలైన తర్వాత కుటుంబ ప్రేక్షకులకు, అందునా ముఖ్యంగా ఆడవాళ్లకు, చిన్న పిల్లలకు టిల్లు పాత్ర బాగా నచ్చడం మమ్మల్ని ఆశ్చర్యపరిచింది. టిల్లు పాత్రని ప్రేక్షకులు హృదయాల్లో పెట్టుకున్నారు. నన్ను సిద్ధు కంటే కూడా ఎక్కువగా టిల్లు అనే పిలుస్తున్నారు. బయట ఎక్కడైనా కనిపిస్తే టిల్లు అన్న అంటూ ప్రేమగా పిలుస్తుంటారు. అందుకే సీక్వెల్ అంటే మొదట కాస్త భయపడ్డాను. కానీ ఒక్కటే అనుకున్నాను. మొదటి పార్ట్ లా ఉండకూడదు, కానీ అదే స్థాయిలో వినోదాన్ని పంచాలి. అలాగే టిల్లు పాత్రలో ఉన్న సోల్ మిస్ అవ్వకూడదు. హీరోయిన్ పాత్ర కూడా మొదటి పార్ట్ లాగే బాగా ఫేమస్ అవ్వాలి. ఇలా అన్నీ దృష్టిలో పెట్టుకొని కథ రాసుకున్నాము.

అయినా మొదట కాస్త భయపడ్డాము. యుద్ధం గెలుస్తామో లేదో మన చేతుల్లో ఉండదు.. కానీ పోరాటం మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది. అది నమ్మే మా టీం అంతా టిల్లు స్క్వేర్ కోసం శాయశక్తులా కృషి చేశాం. ఫైనల్ అవుట్ పుట్ చూసుకున్నాక మాకు సంతృప్తి కలిగింది. మొదటి పార్ట్ కి ఏమాత్రం తగ్గకుండా ఉంటుంది. ఈ సినిమాలో చాలా సర్ ప్రైజ్ లు ఉన్నాయి. మార్చి 29న థియేటర్లకు రండి, ఖచ్చితంగా ఈ సినిమా మిమ్మల్ని అలరిస్తుంది. అలాగే ఈ సినిమా విషయంలో నేను కొందరికి థాంక్స్ చెప్పాలి. ముందుగా మ్యాడ్ చిత్ర దర్శకుడు కళ్యాణ్ కృష్ణ. నేను, కళ్యాణ్, ఆంథోనీ, మల్లిక్ కలిసి ఈ సినిమా రాశాము. కళ్యాణ్ మాకు చాలా హెల్ప్ చేశాడు. అలాగే ఎడిటర్ నవీన్ నూలి గారికి, డీటీఎస్ ఇంజనీర్ రాధాకృష్ణ గారికి థాంక్స్ చెప్పుకోవాలి. అందరికంటే ముఖ్యంగా మా నిర్మాత నాగవంశీ గారికి ప్రత్యేక కృతఙ్ఞతలు. మాకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చి, ఖర్చు విషయంలో ఏమాత్రం వెనకాడకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. మాకు అండగా నిలిచిన చినబాబు గారికి, త్రివిక్రమ్ గారికి చాలా చాలా థాంక్స్. సినిమా కొన్నిసార్లు మాకు అర్థమైన దానికంటే.. త్రివిక్రమ్ గారికి ఎక్కువ అర్థమై మాకు ఎంతో సాయం చేశారు. భీమ్స్ సిసిరోలియో గారి నేపథ్య సంగీతం అద్భుతంగా ఉంది. టిల్లు లో మాస్ ని తన సంగీతంతో ఇంకా ఎక్కువ తీసుకొచ్చారు. మార్చి 29న థియేటర్లలో చాలా చాలా నవ్వబోతున్నారు. చాలా థ్రిల్స్, షాక్ లు, సర్ ప్రైజ్ లు ఉంటాయి. మాస్ క్లైమాక్స్ ని చూడబోతున్నారు. టిల్లు స్క్వేర్ మీ అంచులను ఏమాత్రం తగ్గకుండా ఉంటుంది. తాజాగా నేను, అనుపమ కలిసున్న పోస్టర్ విడుదల చేసినప్పుడు.. కొందరు నెగటివ్ కామెంట్స్ రాశారు. అమ్మాయిలను అలా కామెంట్ చేయడం కరెక్ట్ కాదు. ఈ విషయంలో దృష్టిలో పెట్టుకుంటారని ఆశిస్తున్నాను.” అన్నారు.

చిత్ర దర్శకుడు మల్లిక్ రామ్ మాట్లాడుతూ.. “గత రెండేళ్లుగా ‘డీజే టిల్లు’ పాటలను, మాటలను మీ జీవితంలో ఒక భాగం చేశారు. ఇప్పుడు ‘టిల్లు స్క్వేర్’ చిత్రాన్ని కూడా అలాగే ఆదరిస్తారని కోరుకుంటున్నాను. మార్చి 29న థియేటర్లకు వెళ్ళి చూడండి, ఖచ్చితంగా ఈ సినిమా మీకు నచ్చుతుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన నాగవంశీ గారికి, చినబాబు గారికి, త్రివిక్రమ్ గారికి ధన్యవాదాలు. సిద్ధుతో ఈ రెండేళ్ల ప్రయాణాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. ఈ ప్రయాణంలో నాకు సహకరించిన నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరికీ కృతఙ్ఞతలు. ‘డీజే టిల్లు’ మిమ్మల్ని ఎంతలా అలరించిందో.. ‘టిల్లు స్క్వేర్’ మిమ్మల్ని అంతకుమించి అలరిస్తుంది.

దర్శకులు అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. “టిల్లు స్క్వేర్ ట్రైలర్ చూసిన వెంటనే నేను సిద్ధుకి కాల్ చేసి మాట్లాడాను. 12-13 ఏళ్ళ క్రితం నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పటి నుంచి సిద్ధు నాకు పరిచయం. ఎంత కష్టపడి ఈ స్థాయికి వచ్చాడో నాకు తెలుసు. ఈ అభిమానానికి, స్టార్ బాయ్ ట్యాగ్ కి నువ్వు అర్హుడివి. అప్పట్లో రాజేంద్రప్రసాద్ గారి సినిమాలు పెద్ద హీరోల సినిమాల స్థాయిలో వసూళ్లు రాబట్టేవి. ఈ తరంలో సిద్ధు ఆ స్థానాన్ని భర్తీ చేయాలని కోరుకుంటున్నాను. అన్ని జానర్ సినిమాలు చేస్తూ సిద్ధు మరింత ఎదగాలి అని కోరుకుంటున్నాను. నాకు ట్రైలర్ లో “నేను పెంచలే.. వాడే పెరిగిండు” అనే డైలాగ్ బాగా నచ్చింది. దర్శకుడు మల్లిక్ రామ్ గారికి, నిర్మాత నాగవంశీ గారికి, రామ్ మిరియాల గారికి టీం అందరికీ ఆల్ ది బెస్ట్.” అన్నారు.

దర్శకులు బాబీ కొల్లి మాట్లాడుతూ.. “ట్రైలర్ చాలా బాగుంది. సిద్ధుతో నాకో స్పెషల్ మూమెంట్ ఉంది. 2015లో ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సమయంలో ఒక సాంగ్ ట్యూన్ కోసం దేవిశ్రీ ప్రసాద్ గారి దగ్గరకు వెళ్ళి వస్తూ ఉన్నాను. అప్పుడు అనుకోకుండా ఇంగ్లీష్ మ్యాగజైన్ తిరగేస్తే సిద్ధు ది ఒక చిన్న ఫొటో చూశాను. ఈ అబ్బాయి ఎవరు చాలా బాగున్నాడు అని మా కో డైరెక్టర్ కి చెప్పి.. ఆఫీస్ కి పిలిపించాను. పవన్ కళ్యాణ్ గారి సినిమా ‘సర్దార్ గబ్బర్ సింగ్’లో ఏదైనా మంచి పాత్ర ఉంటుంది అనుకొని సిద్ధు వచ్చాడు. కానీ సిద్ధుని చూడగానే “భవిష్యత్ లో ఇతను ఎక్కడికో వెళ్తాడు” అని అనిపించింది. అప్పుడు సిద్ధుతో.. “ఈ సినిమాలో వేషం ఇవ్వడం కోసం నిన్ను పిలవలేదు, నువ్వు ఖచ్చితంగా పెద్ద హీరో అవుతావు” అని చెప్పాను. ‘డీజే టిల్లు’ తర్వాత ఒక వేడుకలో కలిస్తే.. సిద్ధునే ఈ విషయాన్ని నాకు గుర్తు చేశాడు. అందరూ అంటున్నట్టు సిద్ధు ఎనర్జీ మైండ్ బ్లోయింగ్. పిల్లల్లో కూడా సిద్ధుకి అభిమానులు ఉన్నారు. సీక్వెల్ ట్రైలర్ చూస్తే.. ‘డీజే టిల్లు’ కంటే డబుల్ ఎనర్జీ ఉంది. నిర్మాత నాగవంశీ గారు కూడా మా బాలయ్య బాబు గారి ‘NBK 109’ షూటింగ్ సమయంలో ఈ సినిమా గురించి చాలాసార్లు చెప్పారు. దర్శకుడు రామ్ మల్లికి గారికి, టీం అందరికీ ఆల్ ది బెస్ట్.” అన్నారు.

దర్శకులు బొమ్మరిల్లు భాస్కర్ మాట్లాడుతూ.. “ట్రైలర్ వేరే లెవెల్ లో ఉంది. సినిమా ఇంతకంటే పది రెట్లు ఎక్కువ ఉంటుంది. ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. ట్రైలర్ లో మొదటి ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ వరకు సిద్ధు ఎనర్జీ అదిరిపోయింది. సినిమా కూడా అలాగే ఉంటుంది. టీం అందరికీ ఆల్ ది బెస్ట్.” అన్నారు.

దర్శకులు వెంకీ అట్లూరి మాట్లాడుతూ.. “రిలీజ్ ట్రైలర్ చూశాక కడుపు నిండింది. ‘డీజే టిల్లు’ ఎంత వసూలు చేసిందో.. దానికి కనీసం నాలుగు రెట్లు ఎక్కువ ‘టిల్లు స్క్వేర్’ వసూలు చేయాలని కోరుకుంటున్నాను. టీం అందరికీ ఆల్ ది బెస్ట్.” అన్నారు.

దర్శకులు నీరజ కోన మాట్లాడుతూ.. “ట్రైలర్ అద్భుతంగా ఉంది. నేను ఇప్పటికే కొంత భాగం సినిమా కూడా చూశాను. ఆద్యంతం వినోదభరితంగా చాలా బాగుంది. దర్శకుడు మల్లిక్ రామ్ గారికి, నిర్మాత నాగవంశీ గారికి, సిద్ధుకి అందరికీ ముందుగానే కంగ్రాట్స్. సక్సెస్ పార్టీకి రెడీగా ఉండండి.” అన్నారు.

సుమ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ వేడుక అభిమానుల కోలాహలం నడుమ ఆద్యంతం ఆహ్లదకరంగా సాగింది. నటీనటులు మురళీధర్, ఆంథోనీ, సుజాత, సంగీత దర్శకులు రామ్ మిరియాల, భీమ్స్ సిసిరోలియో, గీత రచయిత కాసర్ల శ్యామ్, సినిమాటోగ్రాఫర్ సాయి ప్రకాష్, ఎడిటర్ నవీన్ నూలి, గాయకుడు శ్రీరామ్ చంద్ర, దర్శకుడు కళ్యాణ్ కృష్ణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Latest News

తెలంగాణ ప్రభుత్వం అనుమతితో శ్రీతేజ్‌ను పరామర్శించిన ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌

సంధ్య థియేటర్‌ తొక్కిసలాటలో గాయపడి కిమ్స్‌ హస్పటల్‌లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ ఈ రోజు (బుధవారం) పరామర్శించారు. శ్రీతేజ్‌ యోగా...

More News