షారుఖ్ ఖాన్, దీపిక పదుకోన్, జాన్ అబ్రహాం నటించిన సినిమా పఠాన్. ఈ చిత్రం టీజర్ అటు ఫ్యాన్స్ ని, ఇటు ఆడియన్స్ ని అమితంగా ఆకట్టుకుంది. దాదాపు నాలుగేళ్ల తర్వాత షారుఖ్ నటిస్తున్న చిత్రం కావడంతో సర్వత్రా భారీ అంచనాలున్నాయి. యష్‌రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న యాక్షన్ స్పెక్టకల్ పఠాన్‌లో షారుఖ్ అవయవసౌష్టవం చూసి జనాలు అబ్బురపడిపోతున్నారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది.
ఈ సినిమా కోసం కంపోజ్ చేసిన అత్యంత భారీ యాక్షన్ సీక్వెన్స్ లో నటించడానికి బాలీవుడ్ మెగాస్టార్ షారుఖ్ అంకితభావంతో పనిచేశారని, ఇలాంటి శారీరక సౌష్టవం పొందాలంటే, హద్దులు దాటిన ప్యాషన్ ఉండాలని, అది షారుఖ్ లో కనిపించదని అన్నారు దర్శకుడు.దర్శకుడు సిద్ధార్థ్ మాట్లాడుతూ “పఠాన్‌లో షారుఖ్ చూపించిన ఫిజిక్ కోసం ఆయన అత్యంత కృషి చేశారు. ఆయన కష్టానికి ఫలితం దక్కింది. టీజర్ చూసిన ప్రతి ఒక్కరూ ఆయన్ని ప్రశంసిస్తున్నారు. ఈ సినిమా కోసం నేను తొలిసారి షారుఖ్‌ని కలిసినప్పుడు జరిగిన సంభాషణ నాకు ఇంకా గుర్తుంది. శారీరకంగా ఈ సినిమా కోసం ఆయన ఎంత కష్టపడాలో మాట్లాడుకున్నాం.
ఆయన ప్రతి పదాన్ని గుర్తుంచుకున్నారు. ఆచరణలో పెట్టారు. ఇవాళ దాని ఫలితం స్క్రీన్ మీద కనిపిస్తోంది“ అని అన్నారు.సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ గురించి, షారుఖ్ గురించి అదనంగా దర్శకుడు మాట్లాడుతూ “సినిమా చూసే ప్రతి ఒక్కరిలోనూ ఓ ఉత్సాహం రావాలి. తనను చూస్తున్నంతసేపు ఆ ఉరకలు వేసే తనం ఆడియన్స్ లో ప్రవహించాలని కోరుకున్నారు షారుఖ్. అత్యంత ప్రమాదకరమైన స్టంట్లు చేశారు షారుఖ్. ప్రమాదకరమైన ప్రదేశాల్లో, ప్రమాదకరమైన వాతావరణంలో ఆయన చేసిన యాక్షన్ సీక్వెన్స్ కి థియేటర్లలో మరో రేంజ్ అప్లాజ్ దక్కి తీరుతుంది. ఇంత కష్టమైన స్టంట్స్ కోసం ఆయన శారీరకంగా అంతే గొప్పగా సిద్ధమయ్యారు. మన దేశంలోనే అత్యంత భారీ యాక్షన్ సినిమాగా రూపొందుతోంది పఠాన్. షారుఖ్‌ని స్క్రీన్ మీద చూసిన ప్రతి ఒక్కరికీ ఆయన చేసిన కృషి అర్థమవుతుంది. మేం డిజైన్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ ని నిజం చేయడానికి ఆయన తీసుకున్న శ్రమకు ఫిదా అయిపోయాం. షారుఖ్‌లాగా ఇంకెవరూ ఉండరు. సినిమాల పట్ల ఆయనకు ఉండే అంకితభావం, ప్రేమను అర్థం చేసుకోవాలంటే పఠాన్ విడుదలయ్యే వరకు ఆగాల్సిందే“ అని అన్నారు.వచ్చే ఏడాది జనవరి 25న హిందీ, తమిళ్, తెలుగులో విడుదల కానుంది పఠాన్.