45 నిమిషాలు కథ విని ఓకే చేశారు సమంత

Must Read

సమంత టైటిల్ పాత్రలో నటించిన సినిమా ‘యశోద’. ఉన్ని ముకుందన్, వరలక్ష్మీ శరత్ కుమార్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్ కీలక పాత్రలు పోషించారు. హరి, హరీష్ దర్శకత్వం వహించారు. శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. నిర్మాతగా ఆయనది 40 ఏళ్ళ అనుభవం. స్ట్రెయిట్ తెలుగు, డబ్బింగ్ కలిపి 45కు పైగా సినిమాలు చేశారు. ‘ఆదిత్య 369’ వంటి గొప్ప సినిమాలు తీశారు. ఇప్పుడు సరోగసీ నేపథ్యంలో కొత్త కథతో ‘యశోద’ తీశారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో నవంబర్ 11న సినిమా విడుదలవుతోంది. ఈ సినిమాతో పాటు సమంత గురించి నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ మీడియాతో ముచ్చటించారు. ఆ విషయాలు మీ కోసం…

సమంత నటించిన తొలి పాన్ ఇండియా సినిమా ‘యశోద’ ఎలా మొదలైంది సార్?
*శివలెంక కృష్ణప్రసాద్ :* ‘సమ్మోహనం’ తర్వాత నేను నిర్మించిన డైరెక్ట్ సినిమా ‘యశోద’. దీనికి మా అంకుల్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి ఆశీస్సులు నాతో ఉన్నాయని అనుకుంటున్నాను. ఆయన సెప్టెంబర్ 25, 2020లో పరమపదించారు. అప్పుడు నేను చెన్నై వెళ్ళాను. ఎస్పీ చరణ్‌కు మద్దతుగా కొన్ని రోజులు ఉన్నాను. అప్పుడు ఎగ్జిక్యూటివ్ నిర్మాత సెంథిల్ చెప్పడంతో హరి, హరీష్ దగ్గర కథ విన్నాను. కొత్త పాయింట్ కావడంతో ఎగ్జైట్ అయ్యాను. అప్పుడు కోయంబత్తూరుకు చెందిన వాళ్ళు ఎవరో నిర్మాత. నా సలహా అడిగితే రెండు మూడు విషయాలు చెప్పాను.

తమిళ నిర్మాత చేయాల్సిన సినిమా మీ దగ్గరకు ఎలా వచ్చింది?
నేను చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చిన పదిహేను ఇరవై రోజుల తర్వాత మా ఎగ్జిక్యూటివ్ ఫోన్ చేశాడు. ‘ఆ నిర్మాత కరోనా తర్వాత చేద్దామంటున్నారట! మీకు చేసే ఉద్దేశం ఉందా?’ అని అడిగారు. అక్టోబర్‌లో మరోసారి కథ విన్నా. బడ్జెట్ ఎంత? అని అడిగితే మూడు నాలుగు కోట్లు అన్నారు. నేను షాక్ అయ్యాను. శంకర్ సినిమా తరహాలో పెద్ద పాయింట్ ఉంది. తక్కువలో ఎందుకు చేస్తున్నారని అడిగా. తాము కొత్త దర్శకులం కాబట్టి అంత బడ్జెట్ ఎవరిస్తారని అడిగా. మళ్ళీ కథపై రీ వర్క్ చేశారు. ఏడెనిమిది నెలల తర్వాత స్క్రిప్ట్ సంతృప్తికరంగా వచ్చింది. ఆ టైమ్‌లో ‘పుష్ప’, ‘కెజిఎఫ్’ సినిమాలు డబ్బింగ్ జరుగుతోంది. మనం కూడా పాన్ ఇండియా చేస్తే బావుంటుందని అనుకున్నాం.

స్క్రిప్ట్ రెడీ అయిన తర్వాత సమంత దగ్గరకు వెళ్ళారా?
అవును. ‘యశోద’ను అన్ని భాషల్లో చేయడానికి తగ్గ కథానాయిక ఎవరని చూస్తే సమంత గారు అయితే బావుంటుందని అనిపించింది. ‘ఫ్యామిలీ మ్యాన్ 2’తో ఆవిడకు దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. సమంత చేస్తారా? లేదా? అసలు కథ వింటారా? అంటే ఆమె మేనేజర్, నిర్మాత మహేంద్ర తప్పకుండా వింటారని చెప్పారు. గత ఏడాది సెప్టెంబర్ 8న సమంత కథ విన్నారు. వెంటనే చేస్తానని చెప్పారు. అన్ని భాషల్లో చేద్దామని చెబితే ఆవిడ ఓకే అన్నారు. సమంత తర్వాత మరో కీలక పాత్రకు వరలక్ష్మీ శరత్ కుమార్ తీసుకున్నాం. కథ డిమాండ్ చేయడంతో ఒక్కో పాత్రకు ఒక్కొక్కరిని ఎంపిక చేసుకున్నాం.

సమంతతో జర్నీ, వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది?
ఆమె స్క్రిప్ట్ విన్నప్పటి నుంచి ‘యశోద’తో సమంత ట్రావెల్ చేశారు. ‘శాకుంతలం’ పూర్తి కావడంతో ఫోకస్ మొత్తం సినిమాపై పెట్టారు. షూటింగ్ టైమ్‌లో బాధ్యతగా ప్రతి విషయాన్ని చూసుకున్నారు.

సమంత ఆరోగ్యం గురించి ఎక్కువ చర్చ జరుగుతోంది. విడుదల సమయంలో ఆవిడ లేని లోటు…
సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత మాకు డబ్బింగ్ టైమ్‌లో మాకు సమంత హెల్త్ గురించి తెలిసింది. తెలుగు డబ్బింగ్ చెప్పారు. తమిళంలో చెప్పే టైమ్‌కు ఎనర్జీ లెవల్స్ తగ్గాయి. వేరే వాళ్ళతో చెప్పించవచ్చని అన్నాను. తమిళంలో తన వాయిస్ అందరికీ తెలుసని ఆవిడే చెప్పారు. హిందీలో చిన్మయి చెప్పారు. మూడు నాలుగు రోజులు డాక్టర్‌ను దగ్గర పెట్టుకుని డబ్బింగ్ చెప్పారు. ఆవిడ డిడికేషన్‌కు హ్యాట్సాఫ్. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికి మూడు నాలుగు రోజుల ముందు మాకు తెలిసింది.

‘యశోద’ కథ ఏంటి? సరోగసీని వ్యాపారంగా మార్చేశారని చెబుతున్నారా?
కాదండి. సరోగసీ నేపథంలో జరుగుతున్న క్రైమ్ చూపిస్తున్నాం. క్రైమ్స్ రకరకాలు.

గతంలో మీరు ప్రయోగాత్మక సినిమాలు చేశారు? ఆ సినిమాల్లో హీరోలు ఉన్నారు. ఫస్ట్ టైమ్ మీరు హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా చేశారు. ఇది ప్రయోగమా?
ప్రయోగం కాదు. ఎక్స్‌పరిమెంట్ అనుకుని చేయలేదు. ఎగ్జైట్‌మెంట్‌తో ‘యశోద’ చేశా. ”నువ్వు ‘ఆదిత్య 369’ చెయ్యవయ్యా. నిన్ను 30 ఏళ్ళు గుర్తు పెట్టుకుంటారు” అని బాలు అంకుల్ చెప్పారు. టైమ్ ట్రావెల్ విని ఎగ్జైట్ అయ్యా. ఇప్పుడు కూడా కథ విని అలాగే చేశా.

లేడీ ఓరియెంటెడ్ సినిమా, పాన్ ఇండియా లెవల్ అంటే రిస్క్ అనిపించలేదా?
సినిమా బావుంటే ప్రేక్షకులు చూస్తారు. కాన్ఫిడెన్స్ ఉంది. ఫస్ట్ టైమ్ విడుదలకు ముందు నాకు ఈ సినిమా కంఫర్ట్ లెవల్ లోకి వచ్చింది. రిలీజ్ తర్వాత కూడా కంఫర్టబుల్ గా ఉంటాను.

‘యశోద’ కోసం భారీ సెట్స్ వేశారు. ఎందుకు?
ఇప్పుడు ఆస్పత్రులు ఫైవ్ స్టార్ రేంజ్‌లో ఉంటున్నాయి. అటువంటి ఆసుపత్రిలో షూటింగ్ చేయాలి. పైగా, మేం కరోనా మూడో వేవ్ సమయంలో షూటింగ్ చేశాం. ఆసుపత్రికి వెళితే అక్కడ ఇబ్బంది ఉండొచ్చు. అందుకని, సెట్స్ వేశాం. 55 రోజులు ఆ సెట్స్ లో షూటింగ్ చేశాం. ఆర్ట్ డైరెక్టర్ అశోక్ అద్భుతమైన సెట్స్ వేశారు.

సినిమాలో డైలాగులు ఎలా ఉండబోతున్నాయి?
దర్శకులు హరి, హరీష్ తమిళులు. ఇద్దరికీ తెలుగు రాదు. అందుకని, తెలుగులో మాటలు రాయడానికి సీనియర్ జర్నలిస్టులు పులగం చిన్నారాయణ, డా. చల్లా భాగ్యలక్ష్మి అయితే బావుంటుందని వాళ్ళకు పరిచయం చేశా. నాకు పదిహేనేళ్ళుగా చిన్నారాయణ పరిచయం. సినిమాలపై మంచి పుస్తకాలు రాశాడు . కథానుగుణంగా ఇద్దరూ చక్కటి మాటలు రాశారు. దర్శకులకు వాళ్ళ వర్క్ బాగా నచ్చింది. 

సినిమా చూసి సెన్సార్ వాళ్ళు ఏమన్నారు?
ఎగ్జైట్ అయ్యారు. తెలుగు సెన్సార్ అధికారులు బావుందన్నారు. వాళ్ళు కూడా ఎగ్జైట్ అయ్యారు. హిందీలో సెన్సార్ అధికారి చూసి ‘మీ సౌత్ వాళ్ళు మాత్రమే ఇలా ఆలోచిస్తారు’ అని చెప్పారు. సినిమా చూసి సెన్సార్ అధికారి నాకు ఫోన్ చేశారు. ఆయనకు అంత నచ్చింది.

డిస్ట్రిబ్యూషన్ కూడా మీరే చేస్తున్నారని విన్నాం. నిజమేనా?
అవునండి. ఏపీ, తెలంగాణలో సునీల్ గారు సపోర్ట్ చేస్తున్నారు. నార్త్ ఇండియాలో యూఎఫ్ఓ, కర్ణాటకలో డిస్నీ వాళ్ళ ద్వారా చేస్తున్నాం. తమిళ్, మలయాళంలో సూర్య గారి కంపెనీ ద్వారా చేస్తున్నాం. సినిమా మీద నమ్మకం ఉంది.

ఫస్ట్ కాపీ చూశాక ఏమనిపించింది? హరి, హరీష్ చెప్పినట్టు తీశారా?
కథను స్క్రీన్ మీదకు తీసుకొచ్చే క్రమంలో కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అవుతాం. ఇక్కడ ప్రేక్షకులు పాట ఆశిస్తారని, ఇంకొకటని అంటారు. ఎవరూ ఏమీ ఆశించరు. ప్రేక్షకుడు మంచి కథ, సినిమా కోరుకుంటారు. మా దర్శకులు హరి, హరీష్ కథ ప్రకారం తీశారు.

ఫిల్మ్ మేకింగ్‌లో నిర్మాతల ప్రమేయం తగ్గిందని, నిర్మాతలను ఫైనాన్షియర్లుగా ట్రీట్ చేస్తున్నారనే మాటలు వింటున్నాం. ఈ పరిస్థితులపై మీరేమంటారు?
ఎప్పటికప్పుడు వాతావరణం మారుతుంటుంది… దాన్ని లేటెస్ట్ అంటాం. ఐదారు నెలలుగా మళ్ళీ భయం మొదలైంది. ఇప్పుడు నిర్మాత భయపడాలి. ఎందుకంటే… కరోనా తర్వాత ప్రేక్షకులు అన్ని భాషల సినిమాలు చూస్తున్నారు. ఓటీటీల్లో సబ్ టైటిల్స్ ఉంటున్నాయి. వరల్డ్ సినిమా చూస్తున్నారు. అందుకని, ఏమాత్రం రొటీన్‌కి దగ్గరగా ఉన్నా నిర్ధాక్షిణ్యంగా మాట్లాడుతున్నారు. అది నెక్స్ట్ షో కలెక్షన్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తోంది. మంచి చెడులు ఉండటం లేదు. ప్రేక్షకులు తోక్కేస్తున్నారు. కాంబినేషన్స్ మీద కాకుండా మంచి సినిమాలు తీయాలని నిర్మాతలు కాన్సంట్రేషన్ చేస్తున్నారు.

‘యశోద’ బడ్జెట్ ఎక్కువ కదా! మీకు ప్రొడక్షన్‌లో ఎవరైనా అండగా ఉన్నారా?
చింతా గోపాలకృష్ణరెడ్డి గారు సహ నిర్మాతగా ‘యశోద’ చేశాం. ఆయన ఎంతో సపోర్ట్ చేశారు.

ఇప్పుడు నిర్మాతల వారసులు వస్తున్నారు. మీ వారసులు?
మా అబ్బాయి అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసుకుంటున్నాడు. వాడు సినిమాల్లోకి రాడు. కానీ, సినిమా అంటే మహా పిచ్చి. వంద డాలర్లు పెట్టి బ్లాక్‌లో సినిమా చూస్తారు. ఇక్కడ ఉన్నప్పుడు కూడా తెల్లవారు జామున మూడు, నాలుగు వేలు పెట్టి టికెట్ కొని బెనిఫిట్ షోస్ చూసేవాడు. టికెట్స్ కొనడానికి ఎంతైనా ఖర్చు పెట్టు గానీ సినిమాల్లోకి రావద్దని చెప్పాను. నేను పరిశ్రమలో ఎత్తు పల్లాలు చూసిన తర్వాత తీసుకున్న నిర్ణయం అది. పరిశ్రమలో మహానుభావులను చూశా.

మరి, మీ అమ్మాయి విద్య?
మా అమ్మాయి విద్య డిజిటల్‌లో వర్క్ చేస్తోంది. ఇప్పుడు తనది స్పాటిఫైలో ఉద్యోగం. ‘సమ్మోహనం’, ‘జెంటిల్ మన్’ సినిమాలకు హెల్ప్ చేసింది. ఈ సినిమాకూ అంతే! వద్దని చెప్పింది మా అబ్బాయికి మాత్రమే. అమ్మాయితో ‘నీ ఇష్టం’ అని చెప్పాను. ‘నాకు ఎంత వరకు చేయాలో తెలుసు నాన్నా’ అంది. ఉన్నంతలో మంచి సినిమాలు తీయాలనుకుంటున్నాను. మంచి సినిమాలు తీసి రిటైర్ అవ్వాలని ఉంది.

కాంబినేషన్ అని కాదు గానీ… మీరు ఇంతకు ముందు బాలకృష్ణ గారితో వరుస సినిమాలు చేశారు. మళ్ళీ ప్లానింగ్ ఉందా?
బాలకృష్ణతో ఎప్పుడూ నాకు స్వీట్ రిలేషన్షిప్ ఉంది. ఈ మధ్య కలిశా. ‘యశోద’ ఏ తరహా సినిమా అని అడిగారు. కొత్త కాన్సెప్ట్ అని చెప్పా. మీరు చేస్తే బ్రహ్మాండం అన్నారు. ఇప్పుడు కూడా సినిమా గురించి డిస్కషన్స్ వస్తాయి. ఆయన ఇమేజ్, నా అభిరుచికి తగ్గ కథ ఎవరైనా తీసుకొస్తే చేయాలని నాకు కూడా ఉంది.

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News