రవితేజ ప్రతిష్టాత్మక 75వ చిత్రానికి ‘మాస్ జాతర’ టైటిల్ ఖరారు

Must Read

తనదైన కామెడీ టైమింగ్, మాస్ యాటిట్యూడ్, విలక్షణ డైలాగ్ డెలివరీతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు మాస్ మహారాజా రవితేజ. స్వయంకృషితో స్టార్ గా ఎదిగిన రవితేజ, విభిన్న చిత్రాలతో దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తున్నారు. సామాన్య ప్రేక్షకులు తమని తాము చూసుకొని ఆనందించే తరహా పాత్రలతో ‘మాస్ మహారాజా’ అనే బిరుదును పొందారు. ఎన్నో ఘన విజయాలను ఖాతాలో వేసుకున్న మాస్ మహారాజా, ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు.

మూడు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో మైలురాళ్లను అందుకున్న రవితేజ, ఇప్పుడు 75వ సినిమా మైలురాయికి చేరుకున్నారు. తన ప్రతిష్టాత్మక 75వ చిత్రం కోసం తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర నిర్మాణ సంస్థలలో ఒకటైన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో చేతులు కలిపారు. రచయిత-దర్శకుడు భాను భోగవరపు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

దీపావళి శుభ సందర్భంగా రవితేజ 75వ చిత్రం యొక్క టైటిల్ ని, విడుదల తేదీని నిర్మాతలు ప్రకటించారు. ఈ చిత్రానికి “మాస్ జాతర” అనే, అందరూ మెచ్చే శక్తివంతమైన టైటిల్ ను పెట్టారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ సృజనాత్మకంగా, కట్టిపడేసేలా ఉంది. జాతర సందడిలో, దీపావళి పండుగను తలపిస్తూ టపాసుల వెలుగుల నడుమ, తుపాకీ పట్టుకొని నడిచి వస్తున్న రవితేజ పోస్టర్ ఆకట్టుకుంటుంది. ఈ పోస్టర్ మాస్ మహారాజా అభిమానులతో పాటు, సినీ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

“మాస్ జాతర” చిత్రం మే 9, 2025న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాల పట్ల దర్శకుడు భాను భోగవరపు మరియు నిర్మాతలు ఎంతో నమ్మకంగా ఉన్నారు. “మాస్ జాతర” అనే టైటిల్ కి తగ్గట్టుగానే ఈ సినిమా థియేటర్లలో మాస్ జాతరను తలపిస్తుందని నిర్మాతలు నమ్మకం వ్యక్తం చేశారు.

మాస్ మహారాజా రవితేజ అంటేనే వినోదానికి, మాస్ సినిమాలకు పెట్టింది పేరు. అలాంటి రవితేజ, తన నుంచి మంచి మాస్ ఎంటర్‌టైనర్ ను కోరుకునే అభిమానులు, ప్రేక్షకుల కోసం “మాస్ జాతర”తో రాబోతున్నారు. ఇది విందు భోజనంలా, అసలుసిసలైన మాస్ మహారాజా సినిమాలా ఉంటుందని చిత్ర బృందం చెబుతోంది.

ఈ సినిమాలో యువ సంచలనం శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. రవితేజ-శ్రీలీల జోడి గతంలో “ధమాకా”తో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. వీరి కలయికలో “మాస్ జాతర” రూపంలో మరో బ్లాక్ బస్టర్ రావడం ఖాయమని చిత్ర బృందం నమ్మకంగా ఉంది.

“ధమాకా” విజయంలో కీలకపాత్ర పోషించిన సంగీత సంచలనం భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నారు. వీరి కాంబినేషన్ మరోసారి థియేటర్లలో మాస్ బ్లాస్ట్ ఇవ్వబోతుంది. ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణుడు విధు అయ్యన్న ఛాయాగ్రాహకుడిగా వ్యవరిస్తున్న ఈ చిత్రానికి, జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. ఈ మాస్ ఎంటర్‌టైనర్ మే 9, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Latest News

Ravi Teja Prestigious RT75 Titled As ‘MASS JATHARA’

Mass Maharaaj of South Indian Cinema, Ravi Teja has been a symbol of infectious energy and dominating screen presence...

More News