థియేటర్, డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థను నాశనం చేస్తున్నది ఆ నలుగురే, గద్దర్ అవార్డ్స్ లో తెలంగాణ వారికి అన్యాయం జరిగింది – టీఎఫ్ సీసీ ఛైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్

Must Read

తెలుగు చిత్ర పరిశ్రమలో మొదలైన థియేటర్స్ సమస్యకు ఇండస్ట్రీలోని ఆ నలుగురే కారణం అన్నారు టీఎఫ్ సీసీ ఛైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్. ఆ నలుగురే తమ స్వార్థంతో థియేటర్స్, డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థను నాశనం చేస్తున్నారని ఆయన చెప్పారు. ఎఫ్ డీసీ ఛైర్మన్ అధికారాలను దిల్ రాజు దుర్వినియోగం చేశారని, గద్దర్ అవార్డ్స్ లో తెలంగాణ కళాకారులకు, సాంకేతిక నిపుణులకు అన్యాయం జరిగిందని రామకృష్ణ గౌడ్ అన్నారు. ఈ రోజు టీఎఫ్ సీసీ కార్యాలయంలో రామకృష్ణ గౌడ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ – నేను 92లో ఇండస్ట్రీకి వచ్చాను. శివాజీ రాజాతో అల్లరి పెళ్లాం అనే మూవీ నిర్మించాను. అప్పటి నుంచి నిర్మాతగా, దర్శకుడిగా, డిస్ట్రిబ్యూటర్ గా కొనసాగుతున్నాను. 2002 వరకు థియేటర్స్ లో పర్సెంటేజీ సిస్టమ్ ఉండేది. ఆ తర్వాత ఇండస్ట్రీలో సురేష్ బాబు లాంటి కొందరు తమ స్వార్థంతో రెంట్ సిస్టమ్ మొదలుపెట్టారు. ఆ తర్వాత అల్లు అరవింద్, దిల్ రాజు, ఏషియన్ సునీల్ లాంటి వాళ్లు సురేష్ బాబు బాటలోనే నడిచి మొత్తం థియేటర్స్ ను తమ కబంధ హస్తాల్లో పెట్టుకున్నారు. మొత్తం 1500 థియేటర్స్ లో 300 థియేటర్స్ మాత్రమే ఓనర్స్ రన్ చేస్తున్నారు. మిగతా 1200 థియేటర్స్ ను వీళ్లే లీజ్ కు తీసుకుని రెంట్ మీద నడుపుతున్నారు. మరికొన్నింటికి మెయింటనెన్స్ ఇచ్చి తీసుకున్నారు. దాంతో ఒకప్పుడు తెలంగాణలో 150 మంది డిస్ట్రిబ్యూటర్స్ ఉంటే ఇప్పుడు వేళ్లమీద లెక్కపెట్టేంత మందే మిగిలారు. ఏపీలోనూ పరిస్థితి అలాగే ఉంది. పర్సెంటేజీ సిస్టమ్ పెట్టాలని మేము నిరాహార దీక్ష చేశాం. ఇప్పుడు పవన్ కల్యాణ్ ను విమర్శిస్తున్న ఆర్ నారాయణమూర్తి మా దీక్ష దగ్గరకు అలా వచ్చి ఇలా వెళ్లేవాడు. ఏపీలో థియేటర్స్ వ్యవస్థ ప్రక్షాళనకు పవన్ కల్యాణ్ తీసుకుంటున్న చర్యలను అభినందిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారికి మా తెలంగాణా ఫిల్మ్ ఛాంబర్ నుండి పూర్తి సహకారం ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారి మాదిరిగానే తెలంగాణలోనూ ప్రభుత్వం అలాంటి చర్యలు చేపట్టాలి. థియేటర్స్ లో తినుబండారాల రేట్స్ అధికంగా ఉండి సామాన్యుడు థియేటర్స్ కు వెళ్లలేకపోతున్నాడు. ఓటీటీలో చూద్దాంలే అనుకుంటున్నాడు. థియేటర్స్ కు కంటెంట్ ఇచ్చే డిజిటల్ ప్రొవైడర్స్ రెంట్ అధికంగా ఉంటోంది. 50 థియేటర్స్ లో సినిమా రిలీజ్ చేస్తే 5 లక్షలు కట్టాల్సి వస్తోంది. దీనికి తోడు ట్యాక్స్ కూడా కట్టాల్సివస్తోంది. ఒకప్పుడు పర్సెంటేజీ వల్ల డిస్ట్రిబ్యూటర్స్ అంతా బాగుపడ్డారు. ఈరోజు నష్టాలు వస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం థియేటర్స్ వ్యవస్థ బాగు కోసం మన సినిమాటోగ్రఫీ మంత్రివర్యుల ఆధ్వర్యంలో చర్యలు చేపట్టాలి. అలాగే గద్దర్ పేరుతో తెలంగాణ ప్రభుత్వం అవార్డ్స్ ఇవ్వడం సంతోషకరం. అయితే తెలంగాణ అవార్డ్స్ జ్యూరీకి మురళీ మోహన్, జయసుధను ఛైర్మన్స్ గా పెట్టడం ఏంటో అర్థం కాలేదు. తెలంగాణ అవార్డ్స్ లో తెలంగాణ వారికి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. దిల్ రాజు ఎఫ్ డీసీ ఛైర్మన్ గా తన అధికారాలను దుర్వినియోగం చేశాడు. తన వాళ్లకే అవార్డ్స్ ఇచ్చుకున్నాడు. కమిటీ ఉన్నవాళ్ల సినిమాలకు అవార్డ్స్ ఇవ్వకూడదనే నిబంధనలు కూడా పాటించలేదు. థియేటర్స్ బంద్ ఇష్యూలోనూ దిల్ రాజు ప్రమేయం ఉంది అన్నారు.

టీఎఫ్ సీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, హీరో కిరణ్ మాట్లాడుతూ – అవార్డ్స్ ఉండేది మాలాంటి యువ ఔత్సాహిక నటులను ప్రోత్సహించేందుకు. గద్దర్ అవార్డ్స్ లో తెలంగాణకు చెందిన నాలాంటి ఆర్టిస్టులకు ప్రోత్సాహం లభిస్తుందని ఆశించాం. కానీ మమ్మల్ని నిరుత్సాహరిచారు. నేను తెలుగులో 20 చిత్రాల్లో నటించా, తమిళంలో రెండు సినిమాలు చేశా. ఆ రెండు చిత్రాలకే నాకు ఒక అవార్డ్ వచ్చింది. తెలుగులో చేసిన మూవీస్ కు ప్రైవేట్ సంస్థల అవార్డ్స్ వచ్చాయి గానీ ప్రభుత్వం ఇచ్చిన గద్దర్ అవార్డ్స్ లో మాలాంటి ప్రతిభ గల కొత్త వారిని మర్చిపోయారు. ప్రభుత్వం గద్దర్ పేరుతో ఇచ్చిన ఈ అవార్డ్స్ విషయంలో మరోసారి పునసమీక్ష చేసుకోవాలి అన్నారు.

తెలంగాణ డైరెక్టర్స్ యూనియన్ ప్రెసిడెంట్ రమేష్ నాయుడు మాట్లాడుతూ – వినోద పరిశ్రమ అయిన ఫిలిం ఇండస్ట్రీలో కొందరు రాజకీయాలు చేస్తున్నారు. గద్దర్ అవార్డ్స్ లో తెలంగాణ నటీనటులు, సాంకేతిక నిపుణులకు అన్యాయం జరిగింది. ప్రతిభ ఉన్న ఏపీ వారికి కూడా అవార్డ్స్ ఇవ్వండి, కానీ తెలంగాణ స్థానిక నటీనటులను, సాంకేతిక నిపుణులను విస్మరించారు. రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయాక కూడా టీఎఫ్ సీసీని అధికారికంగా గుర్తించడం లేదు. ప్రభుత్వం సినిమా పరిశ్రమలో జరుగుతున్న ఇలాంటి వాటిపై దృష్టిసారించి చర్యలు తీసుకోవాలి అన్నారు.

తెలంగాణ రైటర్స్ యూనియన్ ప్రెసిడెంట్ అమృత్ గౌడ్ మాట్లాడుతూ – దిల్ రాజు తన సొంత అవార్డ్స్ లా గద్దర్ అవార్డ్స్ విషయంలో వ్యవహరించారు. తన ఇంటి సినిమాలకు, కమిటీ మెంబర్స్ సినిమాలకు అవార్డ్స్ ఇచ్చారు. దిల్ రాజు తన తప్పును సవరించుకుని మరోసారి అవార్డ్స్ ప్రకటించాలి. తెలంగాణ స్థానిక కళాకారులకు ప్రాధాన్యమివ్వాలి. ప్రజాధనంతో అందిస్తున్న గద్దర్ అవార్డ్స్ ను దుర్వినియోగం చేయడాన్ని వ్యతిరేకిస్తున్నాం. అన్నారు.

Latest News

‘బకాసుర రెస్టారెంట్‌’ నుంచి అయ్యో ఏమీరా ఈ జీవితం సాంగ్‌ను ఆవిష్కరించిన బ్లాక్‌బస్టర్‌ డైరెక్టర్‌ దర్శకుడు హరీశ్‌ శంకర్‌

పలు విజయవంతమైన చిత్రాలతో మంచి నటుడిగా, కమెడియన్‌గా అందరికి సుపరిచితుడైన ప్రవీణ్‌ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం 'బకాసుర రెస్టారెంట్‌', ఈ చిత్రంలో వైవా హర్ష...

More News