ఈ సంక్రాంతి ఏడు తరాలు అటు, ఏడు తరాలు ఇటు గుర్తుండిపోతుంది: ‘అనగనగా ఒక రాజు’ విజయోత్సవ వేడుకలో స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్‌ పొలిశెట్టి

సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలో అడుగుపెట్టి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న చిత్రం ‘అనగనగా ఒక రాజు’. స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్‌ పొలిశెట్టి కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి, సంచలన విజయాన్ని అందుకుంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రానికి నూతన దర్శకుడు మారి దర్శకత్వం వహించారు. మీనాక్షి చౌదరి కథానాయికగా నటించారు.

భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘అనగనగా ఒక రాజు’ చిత్రం.. కడుపుబ్బా నవ్వించడమే కాకుండా, భావోద్వేగ సన్నివేశాలతో హృదయాలను హత్తుకొని సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో విజయోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు. ప్రముఖ నిర్మాత, టీఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు, ప్రముఖ దర్శకుడు బాబీ కొల్లి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఇంతటి అద్భుతమైన చిత్రంలో భాగమైన ప్రతి ఒక్కరికీ ఈ వేడుకలో జ్ఞాపికలను అందజేశారు. నటీనటులు, సాంకేతిక నిపుణులతో పాటు పంపిణీదారులకు జ్ఞాపికలను అందించడం జరిగింది.

ప్రముఖ నిర్మాత, టీఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు మాట్లాడుతూ.. “అనగనగా ఒక రాజు చిత్ర బృందానికి నా శుభాకాంక్షలు. నిర్మాత నాగవంశీకి ప్రత్యేక అభినందనలు. వంశీ సినిమాని ఎంతో ప్రేమిస్తాడు. సినిమాని ఎంత ప్రేమిస్తే, అంత విజయం వస్తుందని.. మా లాంటి వారు కూడా వంశీని చూసి నేర్చుకోవాలి. దర్శకుడు మారికి, చిన్మయికి, మిక్కీ జె. మేయర్ కి అందరికీ నా శుభాకాంక్షలు. గత సంక్రాంతికి ‘సంక్రాంతికి వస్తున్నాం’తో, ఈ సంక్రాంతికి ‘అనగనగా ఒక రాజు’తో విజయాలు అందుకున్న మీనాక్షికి కంగ్రాట్స్. ఈ సినిమాలో నవీన్ వన్ మ్యాన్ షో చేశాడు. విడుదలకు ముందు రోజు ఈ సినిమా చూసినప్పుడే, ఖచ్చితంగా విజయం సాధిస్తుందని నమ్మకం కలిగింది. సినిమా మొదలై, విడుదలయ్యే వరకు.. పగలు, రాత్రి అనే తేడా లేకుండా కష్టపడతాడు నవీన్. సాధారణ నటుడిగా ప్రయాణం మొదలుపెట్టి, నన్ను నమ్మి థియేటర్ కి వస్తే మిమ్మల్ని నవ్విస్తానని ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న హీరో నవీన్. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా నుంచి నవీన్ ప్రయాణం చూశాను. ఈ సినిమా ఇంతటి విజయం సాధించడానికి ప్రధాన కారణం నవీన్ అని ప్రతి ఒక్కరూ చెప్పడం సంతోషంగా ఉంది. సినిమా కోసం నవీన్ ప్రాణం పెడతాడు. కష్టానికి తగిన ప్రతిఫలం వస్తుందని చెప్పడానికి ఉదాహరణ ఈ అనగనగా ఒక రాజు.” అన్నారు.

ప్రముఖ దర్శకుడు బాబీ కొల్లి మాట్లాడుతూ.. “టైమ్ బాగుంటే హీరో అవుతారు అంటుంటారు. కానీ టైమింగ్ బాగుండి హీరో అయినవాడు నవీన్ పొలిశెట్టి. ఏడాది క్రితం నవీన్ కి పెద్ద యాక్సిడెంట్ అయ్యి, తీవ్ర గాయాలయ్యాయి. అప్పుడు కూడా నాతో మాట్లాడుతూ.. నాకు మంచి రచయితలు కావాలి, బ్లాక్ బస్టర్ సినిమా తీయాలి అంటున్నాడు. సినిమా అంటే అంత తపన తనకు. తన టీంతో కలిసి మంచి కథను రాసుకొని, ఇలాంటి విజయం సాధించడం అంటే మామూలు విషయం కాదు. సినిమా చూస్తున్నప్పుడు నాకేం అనిపించిందంటే.. ఒక్క ఫ్రేమ్ లో కూడా నవీన్ ఎనర్జీ వదల్లేదు. ఆ ఎనర్జీ వెనుక తన కష్టం, కసి ఉన్నాయి. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదుగుతాడు. ఇటీవల నేను చిరంజీవి గారిని కలిసినప్పుడు ఆయన నవీన్ గురించి మాట్లాడారు. నవీన్ నటించిన ‘అనగనగా ఒక రాజు’ సినిమా బాగుంది అంట కదా, ఎంత ఎనర్జీ ఉంటుంది ఆ అబ్బాయికి, ఈ కొత్త తరంలో నాకు బాగా నచ్చిన హీరో నవీన్ అని చెప్పారు. చిరంజీవి గారు తన సినిమా సక్సెస్ లో ఉండి కూడా నవీన్ సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేశారు. నవీన్ చిరంజీవి గారి మెప్పు పొందాడు. దర్శకుడు మారికి, చిన్మయికి, చిత్ర బృందం అందరికీ నా శుభాకాంక్షలు.” అన్నారు.

స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్‌ పొలిశెట్టి మాట్లాడుతూ.. “మా సినిమాలో ఒక డైలాగ్ ఉంది. రాజు గారి పెళ్లి ఏడు తరాలు అటు, ఏడు తరాలు ఇటు గుర్తుండిపోద్దని. అలాగే ఈ సంక్రాంతి మా అందరికీ ఏడు తరాలు అటు, ఏడు తరాలు ఇటు గుర్తుండిపోతుంది. తెలుగు సినీ చరిత్రలోనే ఇది అరుదైన సంక్రాంతి. పెద్ద సినిమాలతో పాటు విడుదలై, మీ సినిమా నిలబడుతుందా అని ఎందరో సందేహం వ్యక్తం చేశారు. ఇంతటి పోటీలో కూడా మా సినిమా నిలబడి, ఘన విజయం సాధించిందంటే దానికి కారణం తెలుగు ప్రేక్షకులే. మీకు ఎంత కృతఙ్ఞతలు చెప్పుకున్నా తక్కువే. మా సితార ఎంటర్టైన్మెంట్స్ సినిమా, మా నాగవంశీ గారి సినిమా, మా నవీన్ సినిమా వస్తుందని నమ్మి.. థియేటర్ కి వచ్చి సినిమా చూసిన ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులందరికీ శిరస్సు వంచి పాదాభివందనాలు చేసుకుంటున్నాను. మీరు లేకపోతే నవీన్ పొలిశెట్టి అనే వ్యక్తి లేడు. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఈ వేదిక మీద నిల్చొని లాభాలు పొందామని చెప్పడం సంతోషాన్ని కలిగించింది.

నేను కథ విన్నప్పుడు ముగ్గురు గురించి ఖచ్చితంగా ఆలోచిస్తాను. మొదటగా మా నిర్మాతకు నష్టం జరగకూడదు అనుకుంటాను. రెండు మా డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు నష్టపోకూడదు. మూడోది కష్టపడి సంపాదించిన డబ్బుని ఖర్చు పెట్టి సినిమా చూసే ప్రేక్షకులు. ఈ ముగ్గురు పెట్టే డబ్బుకి విలువ ఇవ్వాలని నేను ప్రతి కథకి ఆలోచిస్తాను. ఏడాదికి రెండు, మూడు సినిమాలు కూడా చేయవచ్చు. కానీ మంచి సినిమా చేయాలనే ఉద్దేశంతోనే కాస్త సమయం తీసుకుంటాను.

ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ, జాతిరత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి.. ఇప్పుడు అనగనగా ఒకరాజు. వరుసగా నాలుగు విజయాలు అందించారు. సినీ పరిశ్రమలో హీరో అవ్వడం అనేది చాలా కష్టం. యూట్యూబ్ నుంచి వచ్చి హీరో అయినవారు ఎవరూ లేరంటూ.. నేను హీరో ప్రయత్నాల్లో ఉన్నప్పుడు చాలామంది నిరాశపరిచారు. అలాంటి నాకు తెలుగు ప్రేక్షకులు వరుసగా నాలుగో బ్లాక్ బస్టర్ అందించారు. నా సినిమాలను మోస్తున్న తెలుగు ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా కృతఙ్ఞతలు. ఈ చిత్రంలో మంచి సందేశం కూడా ఇచ్చాము. రచన సమయంలో నేను, చిన్మయి, మారి అందరం ఎంతో కష్టపడ్డాము. ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా ఉండాలనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని రాయడం జరిగింది. కష్టపడకుండా ఏదీ రాదు. కష్టపడి పని చేస్తే, ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. అదే విషయాన్ని ఈ సినిమా ద్వారా చెప్పాము. మమ్మల్ని నమ్మి, రచనకు తగిన సమయమిచ్చి, అన్నీ సమకూర్చిన నాగవంశీ గారికి కృతఙ్ఞతలు. ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణం తెరవెనుక నాగవంశీ గారే. అలాగే మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించిన చినబాబు గారికి, త్రివిక్రమ్ గారికి ధన్యవాదాలు.

సాధారణ కుటుంబంలో పుట్టిన నేను, హీరో కావాలని చిన్నప్పటి నుంచి కలలు కనేవాడిని. దానికి స్ఫూర్తి మా గురువు గారు చిరంజీవి గారే. అలాంటిది చిరంజీవి గారి సినిమాతో పాటు విడుదలై, ఆయనతో పాటు విజయం సాధించడం సంతోషంగా ఉంది. చిరంజీవి గారు నా గురించి మాట్లాడారని బాబీ గారు చెప్పినప్పుడు నా కళ్ళలో నీళ్లు తిరిగాయి. ప్రేక్షకులు నాపై నమ్మకాన్ని, ప్రేమను ఇలాగే కొనసాగిస్తారని కోరుకుంటున్నాను.” అన్నారు.

కథానాయిక మీనాక్షి చౌదరి మాట్లాడుతూ.. “నాకు ఈ సంక్రాంతి మరింత ప్రత్యేకంగా మారింది. ప్రేక్షకులు మాపై ప్రేమను ఇలాగే కురిపించాలని కోరుకుంటున్నాను. మాకు ఇంతటి విజయాన్ని అందించిన ప్రేక్షకులను, ఈ సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతఙ్ఞతలు.” అన్నారు.

నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ.. “డిస్ట్రిబ్యూటర్లు మాకు లాభాలు వచ్చాయని చెప్పడమే.. నిర్మాతకు పెద్ద విజయం. మా డిస్ట్రిబ్యూటర్లు అందరూ మంచి లాభాలను చూశామని చెప్పడం చాలా సంతోషాన్ని ఇచ్చింది.” అన్నారు.

దర్శకుడు మారి మాట్లాడుతూ.. “మా వేడుకకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన దిల్ రాజు గారికి, బాబీ గారికి నమస్కారం. మా సినిమా ఇంత పెద్ద విజయం సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. సంక్రాంతి అనేది చాలా ప్రత్యేకమైనది. సంక్రాంతికి మా సినిమా విడుదలవ్వడం చాలా గొప్ప విషయం అనుకున్నాం. అలాంటిది మా సినిమా సంక్రాంతికి విడుదలై, వంద కోట్లకు పైగా గ్రాస్ తో చాలా పెద్ద విజయం సాధించింది. ముందుగా నాకు ఈ అవకాశమిచ్చిన నవీన్ గారికి ధన్యవాదాలు. ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. నన్ను నవీన్ గారికి పరిచయం చేసిన అనుదీప్ గారికి, నిర్మాతలు నాగవంశీ గారికి, చినబాబు గారికి, మా వెన్ను తట్టే త్రివిక్రమ్ గారికి మనస్ఫూర్తిగా కృతఙ్ఞతలు. ఈ చిత్రంలో భాగమైన నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. మేము థియేటర్ కి వెళ్లి సాధారణ ప్రేక్షకుల స్పందన చూశాము. సినిమా చూస్తూ వారు ఎంజాయ్ చేయడం చూసి, మేము పడిన కష్టమంతా మర్చిపోయాను. నవీన్ గారు వంద కోట్ల క్లబ్ లో చేరారు. ఆయన కష్టానికి, తపనకు దక్కిన విజయం ఇది.” అన్నారు.

రచయిత్రి, క్రియేటర్ డైరెక్టర్ చిన్మయి మాట్లాడుతూ.. “మా వేడుకకు విచ్చేసిన దిల్ రాజు గారికి, బాబీ గారికి కృతఙ్ఞతలు. ఈ సినిమా కోసం మేమందరం ఎంతో కష్టపడ్డాము. ఆ కష్టానికి ఫలితంగా మీరు ఇంతటి విజయాన్ని అందించారు. మా సినిమాని ఆదరించి, ఇంత పెద్ద హిట్ చేసిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. మమ్మల్ని నమ్మి, మాకు అండగా నిలిచి, ఈ చిత్ర విజయానికి కారణమైన నిర్మాతలు నాగవంశీ గారికి, చినబాబు గారికి, త్రివిక్రమ్ గారికి కృతఙ్ఞతలు.” అన్నారు.

గీత రచయిత చంద్రబోస్ మాట్లాడుతూ.. “రాజు గారి పెళ్ళిరో పాటలో ఇంత ఘనంగా, ఎంతో ధనంగా అనగనగా అని రాశాను. అందులో రాసినట్టుగానే ఈ సినిమా ఘన విజయం సాధించింది, ధన విజయం సాధించింది. నవీన్ గారిలో ఎంతో తపన, పట్టుదల చూశాను. ఆయన కృషి ఫలితమే ఇంతటి విజయం. నవీన్ గారికి, నిర్మాత నాగవంశీ గారికి, దర్శకుడు మారి గారికి, సంగీత దర్శకుడు మిక్కీ జె. మేయర్ గారికి అందరికీ ధన్యవాదాలు.” అన్నారు.

ప్రముఖ యాంకర్ సుమ కనకాల వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ వేడుక ఆద్యంతం ఆహ్లాదకరంగా సాగింది. ఛాయాగ్రాహకుడు యువరాజు, కళా దర్శకుడు గాంధీ, ఎడిటర్ వంశీ, నటులు చంద్ర, భద్రం, సంతోష్ తదితరులు ఈ వేడుకలో పాల్గొని, చిత్ర విజయం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ప్రేక్షకులకు కృతఙ్ఞతలు తెలిపారు.

చిత్రం: అనగనగా ఒక రాజు
తారాగణం: నవీన్‌ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి, రావు రమేష్ తదితరులు
సంగీతం: మిక్కీ జె. మేయర్
ఛాయాగ్రాహకుడు: యువరాజు
కళ: గాంధీ
కూర్పు: వంశీ
దర్శకత్వం: మారి
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య
నిర్మాణ సంస్థలు: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్
సమర్పణ: శ్రీకర స్టూడియోస్
పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్

TFJA

Recent Posts

వైభవంగా జరిగిన హీరో సతీష్ జై కుమార్తె ‘నైరా ‘ పుట్టినరోజు వేడుక

అంతకుమించి చిత్రం పేం సతీష్ జై, డాక్టర్ మైత్రి షరణ్ ల కుమార్తె "నైరా" మొదటి పుట్టినరోజు వేడుకలు ఇటీవల…

19 hours ago

హీరోలు సందీప్ కిషన్, విశ్వక్ సేన్ చేతుల మీదుగా హీరో తిరువీర్ “భగవంతుడు” మూవీ టీజర్ రిలీజ్

యంగ్ టాలెంటెడ్ హీరో తిరువీర్ నటిస్తున్న కొత్త సినిమా "భగవంతుడు". ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటిస్తోంది. కన్నడ…

20 hours ago

ఘనంగా తిరుపతిలో ‘సుమతి శతకం’ చిత్ర టైలర్ లాంచ్ ఈవెంట్ – ఫిబ్రవరి 6వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్ పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాతగా ఎంఎం నాయుడు రచన దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు…

22 hours ago

శ్రీరామ్‌ ‘ది మేజ్‌’ ఫస్ట్‌లుక్‌ అండ్‌ గ్లింప్స్‌ విడుదల

ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, ఒకరికి ఒకరు వంటి సూపర్‌హిట్‌ చిత్రాలతో తెలుగులో అందరికి సుపరిచితుడైన కథానాయకుడు శ్రీరామ్‌. ఈయన…

2 days ago

సబ్ స్క్రైబర్స్ కు బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ కంటెంట్ అందిస్తూ ఎంటర్ టైన్ చేస్తున్న ఆహా ఓటీటీ

తమ సబ్ స్క్రైబర్స్ కు మంచి ఎంటర్ టైన్ మెంట్ అందిస్తామనే ప్రామిస్ ను నిలబెట్టుకుంటూ బ్యాక్ టు బ్యాక్…

2 days ago

యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సీతా పయనం నుంచి ‘పయనమే’ అంటూ సాగే మెలోడియస్, రొమాంటిక్ పాట విడుదల

శ్రీ రామ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై మల్టీ టాలెంటెడ్ నటుడు, దర్శకుడు యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో రాబోతోన్న కొత్త…

2 days ago