కుటుంబ భావోద్వేగాలతో కూడిన చిత్రం లక్కీ భాస్కర్ మీనాక్షి చౌదరి

Must Read

అందరూ మెచ్చేలా లక్కీ భాస్కర్ చిత్రం ఉంటుంది : కథానాయిక మీనాక్షి చౌదరి

వైవిద్యభరితమైన సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ, వరుస విజయాలను ఖాతాలో వేసుకుంటున్న ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ “లక్కీ భాస్కర్” అనే మరో వైవిధ్యమైన చిత్రంతో అలరించడానికి సిద్ధమైంది. దేశవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి ప్రతిభగల దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. మీనాక్షి చౌదరి కథానాయిక. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రానికి, జి.వి. ప్రకాష్ కుమార్ సంగీత దర్శకుడు. దీపావళి కానుకగా అక్టోబర్ 31వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో ముచ్చటించిన కథానాయిక మీనాక్షి చౌదరి, చిత్ర విశేషాలను పంచుకున్నారు.

లక్కీ భాస్కర్ ప్రయాణం ఎలా సాగింది? సితార సంస్థలో పనిచేయడం ఎలా ఉంది?
గుంటూరు కారం తర్వాత సితార ఎంటెర్టైన్మెంట్స్ లో ఇది నా రెండో సినిమా. ఈ మంచి సినిమాలో భాగం కావడం నాకు సంతోషంగా ఉంది. సితార సంస్థ నన్ను కుటుంబసభ్యురాలిలా చూస్తుంది. ఈ అవకాశమిచ్చిన చినబాబు గారికి, వంశీ గారికి కృతఙ్ఞతలు. దుల్కర్ సల్మాన్, వెంకీ అట్లూరి గారితో కలిసి లక్కీ భాస్కర్ చేయడం అనేది మంచి అనుభూతి. నటీనటులు కానీ, సాంకేతిక నిపుణులు కానీ ఇందులో ఎందరో యువ ప్రతిభావంతులు ఉన్నారు. బాగా ప్రిపేర్ అయ్యి ఈ సినిమాని ప్రారంభించడం గొప్ప విశేషం. అందువల్ల నాది, దుల్కర్ గారిది తెలుగు మాతృభాష కానప్పటికీ మేము ఒక్కరోజు కూడా ఇబ్బందిపడలేదు. దుల్కర్ సల్మాన్ గారు గొప్ప నటుడు. అలాగే మంచి మనిషి. ఆయనతో కలిసి పని చేయడం సంతోషంగా ఉంది.

మధ్యతరగతి భార్యగా, తల్లిగా ఈ సినిమాలో నటించారు.. పాత్ర కోసం ఏమైనా హోంవర్క్ చేశారా?
డబ్బు కారణంగా మధ్యతరగతి మనిషి జీవితంలో, అతని కుటుంబంలో ఎలాంటి మార్పులు వచ్చాయనే దాని చుట్టూ ఈ కథ తిరుగుతుంది. నేను మొదటిసారి తల్లి పాత్ర పోషించాను. ఇది నాకు కొంచెం ఛాలెంజింగ్ గా అనిపించింది. నా చిన్నప్పుడు మా అమ్మ ఎలా ఉండేదో తెలుసుకొని, అందుకు తగ్గట్టుగా పాత్రలో ఒదిగిపోయాను. ఇందులో నేను పోషించిన సుమతి పాత్ర ప్రేక్షకులకు చేరువవుతుందనే నమ్మకం ఉంది.

కెరీర్ స్టార్టింగ్ లో తల్లి పాత్ర చేయడం రిస్క్ అనిపించలేదా?
మొదటి నుంచి నా ఆలోచన ఏంటంటే మంచి కథలు చేయాలి, మంచి టీంతో పని చేయాలి. వయసుకు తగ్గ పాత్రలే చేయాలనే పరిమితిని నటులు పెట్టుకోకూడదు. ఒకే తరహా పాత్రలు చేస్తే నటీనటులకు కాదు, ప్రేక్షకులకు కూడా బోర్ కూడా కొడుతుంది. అందుకే నటిగా పాత్రల ఎంపికలో వైవిద్యం చూపించాలని అనుకుంటున్నాను. అందుకు తగ్గట్టుగానే సినిమాలను ఎంచుకుంటున్నాను.

సుమతి పాత్ర ఎలా ఉండబోతుంది?
భాస్కర్ దగ్గర ఏమీ లేనప్పుడు తనని తనగా ఇష్టపడుతుంది సుమతి. ప్రేమను పంచే కుటుంబం, బ్రతకడానికి అవసరమైనంత డబ్బు ఉంటే చాలు అనుకునే స్వభావం తనది. అయితే దురాశ, డబ్బు కారణంగా భాస్కర్-సుమతి మధ్య ఏం జరిగింది అనేది సినిమాలో ఆసక్తికరంగా ఉంటుంది. ఈ సినిమాతో నాకు నటిగా మంచి గుర్తింపు వస్తుందని, మరిన్ని మంచి కథలు వస్తాయని భావిస్తున్నాను.

కథ విన్న తర్వాత మొదట మీకు ఏమనిపించింది?
బ్యాంకింగ్ నేపథ్యంలో కొన్ని సిరీస్ లు వచ్చాయి. కానీ కుటుంబ భావోద్వేగాలను ముడిపెడుతూ వెంకీ అట్లూరి గారు ఈ కథ రాసిన విధానం నాకు బాగా నచ్చింది. ఎమోషన్స్ తో కూడిన ఒక బ్యూటిఫుల్ జర్నీ ఈ మూవీ. అలాగే నా పాత్ర కూడా నాకు బాగా నచ్చింది.

చైల్డ్ ఆర్టిస్ట్ రిత్విక్ గురించి?
నేను చూసిన ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్ లలో రిత్విక్ ఒకడు. ఎంతో ప్రతిభ ఉంది. డైలాగ్ లు మర్చిపోకుండా చెబుతాడు. ఎక్స్ ప్రెషన్స్ కరెక్ట్ గా ఇస్తాడు. అతనికి ఎంతో మంచి భవిష్యత్ ఉంది.

ట్రైలర్ విడుదల తర్వాత ఈ సినిమా మీద అంచనాలు రెట్టింపు అయ్యాయి కదా.. దీనిపై మీ స్పందన?
ఇది కథా బలమున్న సినిమా. అందుకే సినిమాపై ముందు నుంచి మేమందరం ఎంతో నమ్మకంగా ఉన్నాము. ట్రైలర్ విడుదల తర్వాత ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన చూసి మా నిజమవుతుందని ఆనందం కలిగింది.

సాంకేతికంగా సినిమా ఎలా ఉండబోతుంది?
సాంకేతిక విభాగం అద్భుతంగా పనిచేసి సినిమాని మరోస్థాయికి తీసుకెళ్లింది. జి.వి. ప్రకాష్ గారు సంగీతం చాలా బాగుంటుంది. అలాగే కెమెరా వర్క్, ఆర్ట్ వర్క్ ప్రతిదీ అద్భుతంగా ఉంటాయి.

దుల్కర్ సల్మాన్ గురించి?
ఆయన ఎంత గొప్ప నటుడో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో కూడా అద్భుతంగా నటించారు. భాస్కర్ పాత్రకు ఏం కావాలో అది చేసి, కథని భుజాలపై నడిపించారు. అలాగే తెలుగు మాతృభాష కానప్పటికీ, సంభాషణలు నేర్చుకొని చక్కగా చెప్పారు. మమ్మూట్టి గారి కొడుకు అయినప్పటికీ విభిన్న పాత్రలు ఎంచుకుంటూ, తనదైన నటనతో తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఏ పాత్ర ఇచ్చినా అందులో పూర్తిగా ఒదిగిపోతారు దుల్కర్ గారు. భాస్కర్ పాత్రలో కూడా అలాగే ఒదిగిపోయారు.

లక్కీ భాస్కర్ ఎలా ఉండబోతుంది?
ఎమోషన్స్ బాగుంటాయి. ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఉంటాయి. చూసిన ప్రతి ఒక్కరికి సినిమా కనెక్ట్ అవుతుంది. ఇదొక కామన్ మ్యాన్ కథ. అందరికీ నచ్చుతుంది.

తదుపరి సినిమాలు?
మట్కా, మెకానిక్ రాకీ విడుదలకు సిద్ధమవుతున్నాయి. వెంకటేష్, అనిల్ రావిపూడి గారి సినిమాలో నటిస్తున్నాను. మరికొన్ని చర్చల దశలో ఉన్నాయి.

Latest News

‘మట్కా’ ఆల్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కి నచ్చే సినిమా హీరో వరుణ్ తేజ్     

-మెగాస్టార్ చిరంజీవి లాంచ్ చేసిన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, కరుణ కుమార్, వైర ఎంటర్టైన్మెంట్స్, SRT ఎంటర్టైన్మెంట్స్ 'మట్కా' గ్రిప్పింగ్ ట్రైలర్ మెగా ప్రిన్స్ వరుణ్...

More News