సరస్వతి అమ్మవారి కటాక్షం ఉండాలి గాని భాషతో పనేముంది యాసతో పనేముంది అన్నట్లుంది ప్రముఖ తెలుగు రచయిత –దర్శకుడు జనార్ధన మహర్షి పని. తెలుగులో ఎందరో గొప్ప దర్శకుల వద్ద అనేక విజయవంతమైన చిత్రాలకు పనిచేసి సినిమా రచయితగా తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించారు జనార్ధనమహర్షి. తెలుగులో దాదాపు 75 చిత్రాలకు పైగా పనిచేసిన సమయంలోనే ఆయన కన్నడ సూపర్‌స్టార్లతో పనిచేసి కన్నడ స్టార్‌రైటర్‌గా మారిన సంగతి తెలిసిందే.
కన్నడలో దాదాపు 20 సినిమాలకు పైగా పనిచేసి చాలా సూపర్‌హిట్లను సొంతం చేసుకున్నారు. తమిళంలో రెండు సినిమాలు, మళయాలంలో ఓ సినిమాని రచించారాయన. ప్రస్తుతం ఆయన హిందీలో మూడు చిత్రాలకు రచనా బాధ్యతలు వహిస్తూ తెలుగు వారందరూ మా జనార్ధనమహర్షి అని గర్వంగా ఫీలయ్యే దశలో ఉన్నారు.
ఇటువంటి దశలో ఆయన దేశమంతా తనదే అన్నట్లు ఏ భాషలో అయినా సినిమాను ప్రేమిస్తాను సినిమాను శ్వాసిస్తాను అన్నట్లుగా పంజాబి భాషలోకి అడుగుపెట్టారు. జనార్ధనమహర్షి మాట్లాడుతూ–‘‘ మనీష్‌భట్ దర్శకత్వంలో పంజాబి సూపర్‌స్టార్ జయ్ రంధావా, ధీప్ సెహగల్ జంటగా నటించిన చిత్రం ‘జి జాట్ విగడ్ గ్యా’. మే17న విడుదలవుతున్న ఈ పంజాబి సినిమాను రచన చేస్తున్నందుకు వ్యక్తిగతంగా ఎంతో ఆనందంగా ఉంది అన్నారు జనార్ధనమహర్షి. ఈ సినిమా ట్రైలర్‌కి భారీఎత్తున స్పందన రావటంతో సినిమాకి విపరీతమైన క్రేజ్ వచ్చిందని పంజాబ్‌లో కూడా రచయితగా మంచి రచయితగా విజయం సాధిస్తానని నమ్మకం వచ్చింది’’ అన్నారు.