తన్నిష్ఠ ఛటర్జీ, జేడీ చక్రవర్తి ప్రధాన పాత్రలో జాతీయ పురస్కార గ్రహీత, ప్రముఖ దర్శకుడు రాజేష్ టచ్‌రివర్ తెరకెక్కించిన సినిమా ‘దహిణి’. ఆషిక్ హుస్సేన్, బద్రుల్ ఇస్లాం, అంగన రాయ్, రిజు బజాజ్, జగన్నాథ్ సేథ్, శృతి జయన్ దిలీప్ దాస్, దత్తాత్రేయ ఇందులో ఇతర తారాగణం. ఓరియన్ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్, సన్‌టచ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ సినిమాను పద్మశ్రీ అవార్డు గ్రహీత, మానవతావాది సునీత కృష్ణన్, ప్రదీప్ నారాయణన్ సంయుక్తంగా నిర్మించారు.స్వీడిష్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌కు ‘దహిణి’ ఎంపిక అయ్యింది. ఈ సినిమాకు ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌లో గౌరవం దక్కడం ఇది రెండోసారి. ఈ చిత్రానికి పసిఫిక్ బీచ్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్‌లో ‘బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్’ అవార్డు లభించింది. వాస్తవ ఘటనలు ఆధారంగా రాజేష్ టచ్‌రివర్ సినిమాలు తీస్తుంటారు. దర్శకుడిగా ప్రయాణం ప్రారంభించినప్పటి నుండి ఆయనది అదే పంథా. గతంలో ఎన్నో సమస్యలను సినిమాల ద్వారా ఆయన వెలుగులోకి తీసుకొచ్చారు. ఇప్పుడు ‘విచ్ హంటింగ్’ పేరుతో పలు రాష్ట్రాలలో జరుగుతున్న దారుణాలను వెలుగులోకి తీసుకురావాలనే ప్రయత్నంతో… వివాదాస్పద అంశాలను స్పృశిస్తూ ‘దహిణి’ తెరకెక్కించారు.
ఒరిస్సాలోని మయూర్ బంజ్ జిల్లా, పరిసర ప్రాంతాల్లో జరిగిన యథార్థ ఘటన ఆధారంగా, వాస్తవికతకు దగ్గరగా ‘దహిణి’ చిత్రాన్ని రూపొందించారు. ఈ కథను అధ్యయనం చేస్తున్న సమయంలో తెలిసిన విషయాలు చిత్రబృందంలో ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురి చేస్తాయి. ప్రేక్షకులను కూడా ఆశ్చర్యానికి గురి చేయడం ఖాయం. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) ప్రకారం… మన దేశంలో 2001 నుండి 2019 వరకు దాదాపు 2937 మంది మంత్రవిద్యలు చేస్తున్నారనే అనుమానంతో దారుణంగా చంపబడ్డారు. కేవలం 2019 సంవత్సరంలోనే 102 మందిని మంత్రగత్తెలుగా భావించి వివిధ గ్రామాల ప్రజలు అత్యంత కిరాతంగా చంపారు. ఇటువంటి దురాగతాలపై ఎటువంటి కేసు లేదనే చెప్పాలి. ఒడిశా హైకోర్టు 2021లో చెప్పినదాని ప్రకారం… ప్రతి నెల నలుగురు మహిళలు మంత్రవిద్య చేస్తున్నారనే నెపంతో దారుణంగా హత్యకు గురవుతున్నారు. ప్రభుత్వ లెక్కలను పరిశీలిస్తే హత్యకు గురవుతున్నవాళ్లలో మహిళలే ఎక్కువ శాతం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక యునైటెడ్ నేషన్స్ అందించిన నివేదిక 1987 నుంచి 2003 మధ్యన సుమారు పాతికవేల మందిని మంత్రగత్తెలనే అనుమానంతో దారుణంగా చంపారని నిర్ధారణ చేసింది.
మన దేశంతో పాటు పలు దేశాలను పట్టి పీడిస్తున్న ‘విచ్ హంటింగ్’ సమస్యను వెలుగులోకి తీసుకు రావాలని… మానవ హక్కుల ఆందోళన, లింగ ఆధారిత హింసను ప్రస్తావిస్తూ రాజేష్ టచ్ రివర్ ‘ దహిణి’ సినిమాను రూపొందించారు.మానవ హక్కుల కార్యకర్త, పద్మశ్రీ పురస్కార గ్రహీత సునీత కృష్ణన్ మాట్లాడుతూ “ఆధునిక కాలంలో కూడా లింగ ఆధారిత హింసతో, ఇప్పటికీ అనాగరిక చర్యలను కొంత మంది పాటిస్తున్నారు. ఇది మానవ హక్కుల ఉల్లంఘన అయినప్పటికీ ఎవ్వరూ ఈ దారుణాల గురించి మాట్లాడకపోవడం దురదృష్టం. ఈ వాస్తవాలను అందరికీ తెలియజేయడానికి మేం చేసిన ప్రయత్నం ఈ సినిమా” అని అన్నారు. ప్రొడ్యూసర్ ప్రదీప్ నారాయణన్ మాట్లాడుతూ ”నేటి భారతంలో వేలాది మంది మహిళలను మంత్రగత్తెల పేరుతో ఎలా వేటాడుతున్నారు? మా సినిమాలో ఈ అంశం గురించి చాలా ఓపెన్‌గా ఈ ఇష్యూ గురించి చర్చిస్తున్నాం. దీని తర్వాత ప్రేక్షకులు మాట్లాడతారని ఆశిస్తున్నాం. ఈ సినిమా ప్రొడ్యూస్ చేయడం అదృష్టంగా భావిస్తున్నాను” అని అన్నారు.
ఈ చిత్రానికి పీఆర్వో: సురేంద్ర కుమార్ నాయుడు – ఫణి కందుకూరి (బియాండ్ మీడియా), సినిమాటోగ్రాఫర్: నౌషాద్ షెరీఫ్, ప్రొడక్షన్ డిజైనర్: సునీల్ బాబు, సౌండ్ డిజైనర్: అజిత్ అబ్రహం జార్జ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ : జార్జ్ జోసెఫ్, ఎడిటర్: శశి కుమార్, డైలాగ్ రైటర్: రవి పున్నం, స్పెషల్ మేకప్ డిజైన్ ఆర్టిస్ట్: ఎన్.జి. రోషన్, మ్యూజిక్ : డా. గోపాల్ శంకర్, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్: రాజేష్ టచ్ రివర్.