‘‘నిజజీవితంలో అనూ ఇమ్మాన్యుయేల్ చాలా స్ట్రెయిట్ ఫార్వడ్ అమ్మాయి. కెరీర్‌లో వేసే ప్రతి అడుగు మంచి స్థాయికి తీసుకెళ్లాలనే ఆలోచన ఉంటుంది. సింధూ పాత్ర కూడా అలాగే ఉంటుంది. అది నాకు, సింధూకి ఉన్న పోలిక’’ అని అనూ ఇమ్మాన్యుయేల్ అన్నారు. అల్లు శిరీష్ సరసన ఆమె నటించిన చిత్రం ‘ఊర్వశివో.. రాక్షసివో’. రాకేష్ శశి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జీఎ2 పిక్చర్స్ అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ మొగిలిలేని, విజయ్ ఎం నిర్మించారు. ఈ నెల 4న ప్రేక్షకుల ముందుకొస్తుందీ సినిమా. ఈ సందర్భంగా చిత్ర హీరోయిన్ అను ఇమ్మాన్యూయేల్ చెప్పుకొచ్చిన ముచ్చట్లు…
ఇందులో సింధూ అనే సాఫ్ట్‌వేర్ అమ్మాయిగా నటించా. కెరీర్‌లో మంచి స్థాయికి ఎదగాలనే తపన ఉన్న అమ్మాయి. ఆమెకి ప్రేమ కావాలి. కానీ ప్రేమే జీవితం అనుకోదు. అలాంటి అమ్మాయికి శ్రీకుమార్ అనే సింపుల్ కుర్రాడు పరిచయం అవుతాడు. సింపుల్ కుర్రాడికి, కెరీర్ ఓరియెంటెడ్ అమ్మాయికి మధ్య ప్రేమకథ ఎలా నడించింది అన్నది కథ. హీరో, హీరోయిన్ క్యారెక్టర్స్ డిఫరెంట్ మైండ్‌సెట్‌తో కాంట్రాస్ట్‌గా ఉంటాయి. అదే సినిమాకు హైలైట్‌గా నిలుస్తుంది. న్యూ ఏజ్ జానర్ కథ ఇది. యూత్‌ని బాగా ఇంపాక్ట్ చేస్తుంది.
అరవింద్‌గారు ముఖ్య కారణం…
ఈ కథ ఎంపిక చేసుకోవడానికి చాలా కారణాలున్నాయి. మొదట బన్నీవాస్ ఈ కథతో నా దగ్గరకు వచ్చారు. సబ్జెక్ట్ విన్నాక చేయాలా? వద్దా అనే సందిగ్థంలో ఉన్నా. చాలా మీటింగ్‌ల తర్వాత ఓ రోజులు అల్లు అరవింద్‌గారిని కలిశాను. ‘ఇలాంటి హీరోయిన్ ఓరియెంటెడ్ క్యారెక్టర్ చేస్తే బావుంటుంది. డిఫరెంట్‌గా ట్రై చేయ్’ అన్నారు. నేను ఇంటికి వెళ్లి ఆలోచనలో పడ్డా. వెళ్తునప్పుడే నా డైలాగులు మాత్రమే కాకుండా ఫుల్ స్ర్కిప్ట్ నాకు ఇచ్చారు. నా పాత్రకు సంబంధించిన స్ర్కిప్ట్ కాకుండా ఫుల్ స్ర్కిప్ట్ చదవడం ఇదే మొదటిసారి. ఫైనల్‌గా కథ, సింధూ పాత్ర, అరవింద్‌గారి మాటలు నన్ను కన్విన్స్ చేశాయి. సింధూ పాత్రను ఓకే చేశా. జనరల్‌గా ఓ సినిమా నా దగ్గరకు వచ్చిందీ అంటే హీరో ఎవరు, ఇతర ఆర్టిస్ట్‌లు ఎవరు? అని అడుగుతా. కానీ గత రెండు, మూడేళ్లలో సినిమా రంగంలో చాలా మార్పులు చూశాం. ప్రేక్షకులకి హీరో ఎవరనేది కూడా అక్కర్లేదు. కంటెంట్ ఎలా ఉందనేది చూస్తున్నారు. కంటెంట్ బావుందా లేదా అన్నదే చూస్తున్నారు. నా మొదటి చిత్రం ‘మజ్ను’, ‘శైలజారెడ్డి అల్లుడు’ చిత్రాల్లోనే నా పాత్ర నిడివి ఎక్కువగా ఉంటుంది. మిగిలిన సినిమాల్లో ఐదారు సీన్లలోనే కనిపిస్తా. ఇందులో అలా కాదు. ఫుల్ లెంగ్త్ సినిమాలో కనిపిస్తాను. అది కూడా చాలా కొత్త పాత్రలో కనిపిస్తా. సంగీతం సినిమాకు ఎసెట్ అవుతుంది.
కుటుంబం మొత్తం చూసే సినిమా…
ఈ సినిమాకు శిరీష్ హీరో అని నాకు ముందే తెలుసు. ఈ సినిమాకు ముందు ఎప్పుడే శిరీష్‌ని కలవలేదు. పూజ రోజున మొదటిసారి కలిశా. డైరెక్టర్ కథ మొత్తం నెరేట్ చేశాక నేను, శిరీష్ కాఫీ షాప్‌లో కూర్చుని పాత్రల గురించి మాట్లాడుకున్నాం. ఒకరి తత్వం గురించి ఒకరు తెలుసుకున్నాం. శ్రీ, సింధూ పాత్రల్లో రియలిస్టిక్‌గా కనిపించడానికి కష్టపడ్డాం. స్ర్కీన్‌పై మా ఇద్దరి మధ్య లవ్ సీన్స్, కెమిస్ట్రీ, ఎమోషన్స్ బాగా ఆకట్టుకుంటాయి. శిరీష్ గుడ్ కోస్టార్. సినిమా మేకింగ్ మీద చాలా పట్టుంది. మ్యూజిక్, ఆర్ట్, టెక్నికల్ ఇలా అన్ని విషయాల మీద అతనికి అవగాహన ఉంది. నాతో మ్యూజిక్ గురించి ఎక్కువగా మాట్లాడేవాడు. దర్శకుడు రాకేశ్ శశి డెడికేటింగ్ పర్సన్. అతనికి సినిమా తప్ప వేరే లోకం తెలీదు. ఒక షాట్ ఇలా రావాలి అంటే అలా వచ్చే వరకూ వదిలిపెట్టడు. అతని డెడికేషన్, ఓర్పు, కథ చెప్పిన తీరుతోపాటు గీతా ఆర్ట్స్ బ్యానర్ వాల్యూ కూడా నేనీ సినిమా చేయడానికి కారణం. గీతా బ్యానర్‌లో వల్గర్ సినిమాలు రావని, కుటుంబం మొత్తం చూసే చిత్రాలు వస్తాయనే నమ్మకం ఉంది కాబట్టే ఈ సినిమా చేశా. ఫ్యామిలీ మొత్తం కలిసి చూసి ఎంజాయ్ చేసే చిత్రమిది.
పోలికలు… తేడాలు ఉన్నాయి…
నిజజీవితంలో అనూ ఇమ్మాన్యుయేల్ చాలా స్ట్రెయిట్ ఫార్వడ్ అమ్మాయి. కెరీర్‌లో వేసే ప్రతి అడుగు మంచి స్థాయికి తీసుకెళ్లాలనే ఆలోచన ఉంటుంది. సింధూ పాత్ర కూడా అలాగే ఉంటుంది. అది నాకు, సింధూకి ఉన్న పోలిక. ట్రైలర్‌లో చూపించిన ఫిజికల్ రిలేషన్‌షిప్ నిజజీవితంలో నాకు కనెక్ట్ కాదు.
నా చేతిలో ఏమీ లేదు…
కెరీర్ బిగినింగ్‌లోనే నేను పవన్‌కల్యాణ్, అల్లు అర్జున్, నాగచైతన్య వంటి స్టార్‌ల సరసన యాక్ట్ చేశా. ఎవరితో యాక్ట్ చేసిన కథ, బ్యానర్ గురించి ఆలోచిస్తా. నాకు అవకాశాలు రావడం లేదు అన్నది కరెక్ట్ కాదు. కాకపోతే వరుసగా సినిమాలు చేయడం లేదు. నేను చేసిన సినిమాలు ఆడలేదేమో కానీ నటిగా నేను ఫెయిల్ అనే మాట ఎక్కడా వినిపించలేదు. అనూ కళ్లతో అభినయించగలదు అనే మార్క్ సంపాదించుకున్నా. కొన్ని సినిమాల రిజల్ట్ చూశాక నన్ను నేను మార్చుకున్నా. రెగ్యులర్ సినిమాలకు దూరంగా ఉంటున్నా. వచ్చిన అవకాశంలో ఆ పాత్రకు నేను సూట్ అవుతాను అనుకుంటేనే ఓకే చేస్తున్నా. లేదంటే ఇంట్లో కూర్చుంటా. ఏదో వచ్చాం… చేశాం.. వెళ్లాం అనుకునే పద్దతిలో లేను. మంచి కథ ఎంచుకోవడం, పాత్రకు న్యాయం చేయడం వరకే నా చేతిలో ఉంది. అంతకు మించి ఏదీ నా చేతిలో ఉండదు. దర్శకుడు చెప్పింది చేస్తాం.. ఇచ్చిన డైలాగ్ చెబుతామంతే. సక్సెస్ నా చేతిలో లేదు.