“టీఎఫ్ సీసీ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ 2026” జ్యూరీ ఛైర్ పర్సన్ గా నటి ఇంద్రజ వ్యవహరిస్తారు: టీఎఫ్ సీసీ ఛైర్మన్ డా.ప్రతాని రామకృష్ణ గౌడ్*
- ఈ అవార్డ్స్ ఔత్సాహికులకు గొప్ప అవకాశంగా నిలుస్తుంది – జ్యూరీ ఛైర్ పర్సన్ నటి ఇంద్రజ
- జ్యూరీ మెంబర్ గా సంగీత దర్శకుడు భోలే శావలి
- దాదాపు 30 కేటగిరీల్లో మొదటి 5 మంది విజేతలకు బహుమతులు
- మొదటి విజేతకు రూ.10 వేలు, రెండో విజేతకు రూ.7500, మూడో విజేతకు రూ.5 వేలు
- జూన్ 13వ తేదీ వరకు ఉచితంగా ఎంట్రీలను పంపే అవకాశం
- జూన్ 21న హైదరాబాద్ లో అవార్డ్స్ ప్రధానోత్సవం

చిత్ర పరిశ్రమలో న్యూ యంగ్ టాలెంట్ ను ప్రోత్సహించేందుకు తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఛైర్మన్ డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ టీఎఫ్ సీసీ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ 2026 ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఫెస్టివల్ కు భారీగా ఎంట్రీలు వస్తున్నట్లు ఈ రోజు హైదరాబాద్ లో జరిగిన ప్రెస్ మీట్ లో డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ తెలిపారు. ఈ అవార్డుల కమిటీ జ్యూరీకి ఛైర్ పర్సన్ గా నటి ఇంద్రజను ఎంపిక చేసినట్లు ఆయన వెల్లడించారు. దాదాపు 30 కేటగిరీల్లో మొదటి ఐదుగురు విజేతలకు అవార్డ్స్ ఇస్తామని, మొదటి ముగ్గురు విజేతలకు అవార్డ్స్ తో పాటు నగదు బహుమతి కూడా అందిస్తామని డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ ప్రకటించారు. కర్ణాటక, తమిళనాడు వంటి ఇతర రాష్ట్రాల నుంచి కూడా తెలుగు వాళ్లు తమ షార్ట్ ఫిలింస్ పంపవచ్చని ఆయన అన్నారు. ఈ రోజు జరిగిన ప్రెస్ మీట్ లో
టీఎఫ్ సీసీ ఛైర్మన్ డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ – ఇండస్ట్రీ మీద ఎన్నో ఆశలతో రోజూ కొత్త వారు వస్తున్నారు. వారికి తమ కంటెంట్ ను ఎలా ప్రదర్శించాలి, తమ ప్రతిభను ఎలా చూపించాలనేది తెలియడం లేదు. అలాంటి యంగ్ టాలెంట్ కోసం టీఎఫ్ సీసీ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ 2026 నిర్వహిస్తున్నాం. గత నెలలో మేము ప్రకటన చేసినప్పటి నుంచి భారీగా ఎంట్రీలు వస్తున్నాయి. వీలైనంత ఎక్కువమందికి ప్రోత్సాహం అందించాలని మొదటి ఐదు స్థానాలకు అవార్డ్స్ ఇస్తున్నాం. మొదటి ముగ్గురు విజేతలకు నగదు బహుమతి కూడా ఉంటుంది. మెన్, వుమెన్ కు కలిపి దాదాపు 30 కేటగిరీలు ఉన్నాయి. మొదటి బహుమతిగా 10 వేలు, రెండో బహుమతిగా 7500, మూడో బహుమతిగా 5000 రూపాయలు ఇస్తాం. వచ్చేసారి ఈ నగదు బహుమతి మరింతగా పెంచుతాం. మేము దీని కోసం ఎవరి దగ్గరా ఎంట్రీ ఫీజు తీసుకోవడం లేదు. ఉచితంగా మీ కంటెంట్ పంపవచ్చు. ఈ నెల 13వ తేదీ వరకు సమయం ఉంది. ఈ నెల 21న హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఈవెంట్ నిర్వహిస్తాం. ఈ అవార్డుల కమిటీ జ్యూరీకి నటి ఇంద్రజ గారిని ఛైర్ పర్సన్ గా ఎంచుకున్నాం. ఆమె ఎన్నో చిత్రాల్లో హీరోయిన్ గా నటించి మనల్ని అలరించారు. ప్రేక్షకుల్లో ఆమెకున్న మంచి గుర్తింపు మా అవార్డ్స్ కు కూడా క్రేజ్ తీసుకొస్తుందని నమ్ముతున్నాం. ఇతర రాష్ట్రాల్లోని తెలుగు వారు కూడా తమ ఎంట్రీలను పంపవచ్చు. వచ్చే ఏడాది ఇంకా ముందుగానే అవార్డ్స్ కార్యక్రమానికి సన్నద్ధమవుతాం అన్నారు.

టీఎఫ్ సీసీ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ 2026 జ్యూరీ ఛైర్ పర్సన్ నటి ఇంద్రజ మాట్లాడుతూ – టీఎఫ్ సీసీ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ 2026 నిర్వహణ ద్వారా కొత్త వాళ్లను ప్రోత్సహించేందుకు రామకృష్ణ గౌడ్ గారు గొప్ప పని చేస్తున్నారు. ఈ విషయం నాకు చెప్పినప్పుడు సంతోషంగా జ్యూరీ ఛైర్ పర్సన్ గా ఉండేందుకు ఒప్పుకున్నాను. కంటెంట్ క్రియేట్ చేయడమే కాదు అది ప్రదర్శించే వేదిక బాగుండాలి. టీఎఫ్ సీసీ లాంటి పేరున్న అసోసియేషన్ ద్వారా మీ కంటెంట్ ప్రదర్శితమైతే అది అందరికీ చేరువ అవుతుంది. మీరు కోరుకునే స్థాయికి వెళ్లాలంటే మంచి మార్గంలోనే వెళ్లాలి. టీఎఫ్ సీసీ ద్వారా ఎంతోమందికి రామకృష్ణ గౌడ్ గారు ప్రోత్సాహం అందిస్తున్నారు. మీ సొంత సోషల్ మీడియాలో మీ కంటెంట్ పోస్ట్ చేసుకుంటే దాని రీచింగ్ 10 పర్సెంట్ కూడా ఉండదు. ఈ అవార్డ్స్ కోసం వివిధ విభాగాల నుంచి ఇండస్ట్రీ వాళ్లు జ్యూరీలో ఉంటారు. మీ ప్రతిభ వారి దృష్టిని ఆకర్షిస్తే మీరు కోరుకున్న అవకాశాలు వస్తాయి. అందుకే ఔత్సాహికులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ అవార్డ్స్ ద్వారా వచ్చే మనీ తక్కువని అనుకోవద్దు. ఈ అవార్డ్ విలువను డబ్బుతో కొలవలేం అన్నారు.
టీఎఫ్ సీసీ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ 2026 జ్యూరీ మెంబర్, మ్యూజిక్ డైరెక్టర్ భోలే శావలి మాట్లాడుతూ – రామకృష్ణ గౌడ్ అన్నగారు టీఫ్ సీసీ ద్వారా ఎంతోమంది కళాకారులకు సపోర్ట్ గా నిలుస్తున్నారు. వారిలో నేనూ ఉన్నాను. ఆయన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టీఎఫ్ సీసీ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ 2026లో నేనూ భాగస్వామిని కావడం సంతోషంగా ఉంది. మంచి పేరున్న రామకృష్ణ గౌడ్ గారు నిర్వహిస్తున్న ఈ అవార్డ్స్ పోటీల్లో ఔత్సాహికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరుతున్నా. ఇంద్రజ గారు ఈ అవార్డ్స్ కమిటీ జ్యూరీకి ఛైర్ పర్సన్ గా ఉండటం హ్యాపీగా ఉంది అన్నారు.

