సూర్య, వెంకీ అట్లూరి కలయికలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రానికి ‘విశ్వనాథ్ & సన్స్’ టైటిల్ ఖరారు
సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న ‘సూర్య46’ చిత్రానికి ‘విశ్వనాథ్ & సన్స్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ పేరు విన్న తక్షణమే ఒక క్లాసీ, స్వచ్ఛమైన కుటుంబ కథా చిత్రాన్ని చూడబోతున్నామని స్పష్టమవుతోంది. సూర్య ఒక చిన్నారితో కలిసి కనిపించిన ఫస్ట్ లుక్ పోస్టర్లు.. మధుర జ్ఞాపకాలను గుర్తు చేస్తూ, సూర్యలోని పాతకాలపు మాధుర్యాన్ని మళ్లీ తెరపై చూపిస్తూ ప్రేక్షకులకు అందమైన అనుభూతిని కలిగిస్తున్నాయి.
భారీ స్థాయి కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మమిత బైజు, రాధిక శరత్‌కుమార్, రవీనా టాండన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘సార్/వాతి’, ‘లక్కీ భాస్కర్’ వంటి వరుస విజయాలతో దూసుకుపోతున్న బ్లాక్‌బస్టర్ దర్శకుడు వెంకీ అట్లూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. గొప్ప కథకుడిగా, భావోద్వేగాలతో కూడిన రచనకు పేరుగాంచిన ఆయన, ఈ సినిమాతో మరో చిరస్మరణీయ అనుభూతిని అందించనున్నారు.

విజయవంతంగా చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘విశ్వనాథ్ & సన్స్’, జూలైలో ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ సినిమాపై అభిమానుల్లో, ప్రేక్షకుల్లో భారీ అంచనాలు, ఉత్సాహం నెలకొనగా.. వాటిని రెట్టింపు చేసేలా త్వరలోనే టీజర్ విడుదల కానుంది.
ప్రేక్షకులను గొప్ప సినీ అనుభూతిని అందించడం కోసం అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా, ఛాయాగ్రాహకుడిగా నిమిష్ రవి వ్యవహరిస్తున్నారు. ఎడిటింగ్ బాధ్యతలను నవీన్ నూలి నిర్వహిస్తున్నారు. కళా దర్శకుడిగా బంగ్లాన్ వ్యవహరిస్తున్నారు. సమష్టి కృషితో ప్రేక్షకులను కథలో లీనం చేసే గొప్ప ప్రపంచాన్ని తెరపై ఆవిష్కరిస్తున్నారు.
‘సార్/వాతి’, ‘లక్కీ భాస్కర్’ వంటి వరుస విజయాల తర్వాత ప్రముఖ నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య కలిసి మరో ప్రతిష్టాత్మక తమిళ-తెలుగు ద్విభాషా చిత్రాన్ని అందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై నిర్మితమవుతున్న ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. ఎక్కడా రాజీ పడకుండా భారీ స్థాయిలో రూపుదిద్దుకుంటున్న ‘విశ్వనాథ్ & సన్స్’ సినిమాపై అన్ని వర్గాల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి.
చిత్రం: విశ్వనాథ్ & సన్స్
తారాగణం: సూర్య, మమిత బైజు, రాధిక శరత్‌కుమార్, రవీనా టాండన్
రచన, దర్శకత్వం: వెంకీ అట్లూరి
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య
సంగీతం: జి.వి. ప్రకాష్ కుమార్
ఛాయాగ్రహణం: నిమిష్ రవి
కూర్పు: నవీన్ నూలి
కళ: బంగ్లాన్
ఫైట్ మాస్టర్: వి. వెంకట్
కొరియోగ్రాఫర్: విజయ్ బిన్నీ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: యలమంచిలి గోపాలకృష్ణ
లైన్ ప్రొడ్యూసర్: ఉమామహేశ్వరరావు
బ్యానర్స్: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్
సమర్పణ: శ్రీకర స్టూడియోస్
పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్

