- ‘ఐ, నోబడీ’ చిత్రీకరణలో మాకెన్నో సవాళ్లు ఎదురయ్యాయి. యాక్షన్ సీక్వెన్స్ కోసం చాలా కష్టపడ్డాం’ –
మలయాళ టాప్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, జాతీయ అవార్డు గ్రహీత పార్వతి తిరువోతు నటించిన చిత్రం ‘ఐ, నోబడీ’. ముకేష్ ఆర్ మెహతా, సుప్రియా మీనన్, సి.వి.సారథి నిర్మించిన ఈ మూవీకి నిస్సాం బషీర్ దర్శకత్వం వహించారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ ‘ఐ, నోబడీ’ జూలై 9న మలయాళంలోనూ, జూలై 10న తెలుగులోనూ గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలైంది. అగ్ర నిర్మాణ సంస్థలు శ్రీ స్రవంతి మూవీస్, మైత్రీ మూవీస్ వారు ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేశారు. ఈ క్రమంలో 9వ తేదీన స్పెషల్ ప్రీమియర్లను ప్రదర్శించారు. ఈ ప్రీమియర్ ప్రదర్శన అనంతరం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో..
పృథ్వీరాజ్ సుకుమారన్ మాట్లాడుతూ .. ‘ఈ మధ్య కాలంలో నేను మా ఇంట్లో కంటే హైదరాబాద్‌లోనే ఎక్కువగా ఉంటున్నాను. ఎందుకో అందరికీ తెలిసే ఉంటుంది (నవ్వుతూ). ‘ ఐ, నోబడీ’ అనే చిత్రాన్ని చాలా సూక్ష్మంగా, ఒక్క ఫ్రేమ్ మిస్ అవ్వకుండా చూడాల్సి ఉంటుంది. నోబడీ అనే వ్యక్తి.. ఓ పెద్ద వ్యక్తిగా మారకుండా ఉండేందుకు సీఎం ఇంకో పెద్ద బాంబ్ వేస్తారు. అప్పుడు మీడియా, సోషల్ మీడియా అనేది రాజీవన్ అనే పాత్ర గురించి పట్టించుకోదు. ఫస్ట్ హాఫ్ అంతా ఒకలా నడిస్తే.. సెకండాఫ్ అంతా నెక్ట్స్ లెవెల్లో వెళ్తుంది. మంచి సినిమా తీస్తే విజయాన్ని అందిస్తారని తెలుగు ప్రేక్షకుల మీద నాకు అపరిమితమైన నమ్మకం ఉంది. ప్రభుత్వాలకు వ్యతిరేకంగా, అనుకూలంగా నేను ఎప్పుడూ సినిమాలు తీయను. నేను కేవలం ఆడియెన్స్‌ను ఎంటర్టైన్ చేసేందుకు మాత్రమే చిత్రాల్ని చేస్తుంటాను. ‘ ‘ఐ, నోబడీ’ చిత్రీకరణలో మాకెన్నో సవాళ్లు ఎదురయ్యాయి. యాక్షన్ సీక్వెన్స్ కోసం చాలా కష్టపడ్డాం. అన్నీ కూడా నేచురల్ లొకేషన్స్‌లో, త్రివేండ్రం సిటీ రోడ్ల మీదే చిత్రీకరించాం. ముకేష్ ఆర్ మెహతా, సి.వి.సారథి గారు నాకు అండగా నిలిచి చిత్ర నిర్మాణంలో సహకరించారు. ఇందులో కథ డబ్బు చుట్టూ తిరగదు. ఈ సమాజం ఇచ్చే బలవంతపు ఐడెంటిటీ, సోషల్ మీడియా, మీడియా ప్రభావం వంటి వాటి చుట్టూ తిరుగుతుంది. నేను ఏ కథ విన్నా కూడా ఓ ప్రేక్షకుడి గానే వింటాను. రాజమౌళి గారు, కార్తికేయ గారు నా టైంకి, డేట్స్‌కి తగ్గట్టుగా షూటింగ్‌ను ప్లాన్ చేస్తున్నారు. నాకు నటుడిగా బాగానే డబ్బులు వస్తున్నాయి. నిర్మాతగా నేను డబ్బులు సంపాదించాలని అనుకోను. మంచి చిత్రాల్ని అందించాలనే చూస్తుంటాను” అని అన్నారు.
పార్వతి తిరువోతు మాట్లాడుతూ .. ‘పృథ్వీకి సినిమాలంటే ఎంతో పిచ్చి. ఆయనకు సినిమాల పట్ల ఉండే ప్యాషన్ నాకు చాలా ఇష్టం. ఆయన ముందు నేను ఒక స్టూడెంట్‌లా ఉండి ఎంతో నేర్చుకుంటూ ఉంటాను. రాజీవన్, మీరా పాత్రలు చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. తెరపై ఎప్పుడూ ఫైటింగ్ చేస్తూనే కనిపిస్తుంటాం. పృథ్వీ, సుప్రియ నాకు ఎంతో సపోర్ట్‌గా ఉంటారు. మీరాలాంటి పాత్ర నాకు దక్కడం ఆనందంగా ఉంది. పృథ్వీతో డిఫరెంట్ చిత్రాలు చేసే అవకాశం దక్కడం నా అదృష్టం. నాకు ఎప్పుడూ ఒకే రకమైన పాత్రల్ని చేయాలని అనిపించదు. తెలుగులో ఓ సరికొత్త పాత్రతో రావాలని వెయిట్ చేస్తున్నాను” అని అన్నారు.
సంగీత దర్శకుడు జేక్స్ బిజాయ్ మాట్లాడుతూ .. ‘‘ ‘ఐ, నోబడీ’ పాటల విషయంలో నిస్సాం ముందే ఓ నిర్ణయంతో ఉన్నారు. అందరికీ అర్థం అవ్వాలని, ఎక్కువగా రీచ్ అవ్వాలనే ఉద్దేశంతోనే ఇంగ్లీష్, హిందీ భాషల్లో పాటలు కంపోజ్ చేశాం’ అని అన్నారు.
మైత్రి శశి మాట్లాడుతూ .. ‘‘ ‘ఐ, నోబడీ’ చిత్రం నాకు చాలా నచ్చింది. నెక్ట్స్ సీన్ ఏంటి? అన్నది అస్సలు గెస్ చేయలేం. యాక్షన్ సీక్వెన్స్ అద్భుతంగా ఉంటాయి. పృథ్వీరాజ్ గారు అద్భుతంగా నటించారు. తెలుగు వారికి కూడా ఈ చిత్రం చాలా నచ్చుతుందని, పెద్ద విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను. కొత్త రకమైన సినిమాలు ఎప్పుడు వచ్చినా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉంటారు’ అని అన్నారు.
నిర్మాత ముకేష్ ఆర్ మెహతా మాట్లాడుతూ .. ‘పృథ్వీరాజ్ గారు నిర్మాతల మనిషి. మాకు కూడా నాలుగు డబ్బులు రావాలనే ఆలోచిస్తుంటారు. మేం తీసే సినిమాల రిజల్ట్స్ ఎలా ఉన్నా కూడా మా బంధం మాత్రం ఆయనతో కొనసాగుతూనే ఉంటుంది. మా మూవీని తెలుగు ఆడియెన్స్ కచ్చితంగా ఆదరిస్తారని నమ్ముతున్నాను. థియేటర్ రిలీజ్ కోసమే ఈ సినిమాని తీశానని ఐమాక్స్ లార్జ్ స్క్రీన్‌లో ప్రివ్యూ వేశాను. ఇంకా ఓటీటీ రైట్స్, డిజిటల్ రైట్స్‌ని ఎవ్వరికీ అమ్మలేదు. థియేట్రికల్ రన్ పూర్తయ్యాకే ఈ చిత్రం ఓటీటీలోకి వస్తుంది’ అని అన్నారు.
పృథ్వీరాజ్ సుకుమారన్, పార్వతి తిరువోతు, హకీమ్ షాజహాన్, అశోకన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి దర్శకత్వం: నిస్సాం బషీర్, కథ – స్క్రీన్‌ప్లే – సంభాషణలు: సమీర్ అబ్దుల్, ఛాయాగ్రహణం: దినేష్ పురుషోత్తమన్ , సంగీతం: జేక్స్ బిజాయ్, నిర్మాతలు: ముకేష్ ఆర్ మెహతా, సుప్రియా మీనన్, సి.వి.సారథి.

