బలగం’ వంటి సినిమా హిట్టయితే ఆ కిక్కే వేరు..దిల్ రాజు
దిల్‌రాజు ప్రొడక్షన్స్ శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మించిన సినిమా ‘బలగం’. ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ రామ్, సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు. వేణు ఎల్దండి దర్శకత్వం వహించారు. మార్చి 3న రిలీజైన ఈ సినిమా సక్సెస్ టాక్ తెచ్చుకుంది. ఈ సందర్భంగా స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించారు..
దిల్ రాజు ప్రొడక్షన్స్‌ను హర్షిత్, హన్షిత నిర్మాతలుగా స్టార్ట్ చేశారు. నేను నిర్మాతగా జర్నీ స్టార్ట్ చేసినప్పుడు ఆర్య, బొమ్మరిల్లు వంటి సినిమాలను చేశాను. అప్పుడు కొత్త వాళ్లతోనే ఆ సినిమాలు చేశాను. క్రమక్రమంగా అలాంటి అప్రోచ్ నా సైడ్ నుంచి తగ్గిపోయిందనాలి. అందుకు కారణాలు ఏమైనా కావచ్చు. అందుకని హర్షిత్, హన్షితలను కూర్చో పెట్టుకుని రీస్టార్ట్ కావాలని చెప్పాను. నిర్మాణ రంగంలోకి రావాలని అనుకుంటున్నారు, ఆసక్తి ఉందని అంటున్నారు కాబట్టి జర్నీ స్టార్ట్ చేయమని చెప్పాను. ఆ క్రమంలో చాలా స్క్రిప్ట్స్ వింటూ వచ్చాం. అప్పుడు నేను బలగం స్క్రిప్ట్ విన్నాను. దాన్ని వినమని హర్షిత్, హన్షితలకు చెప్పాను. వాళ్లు విన్నారు, నచ్చింది. దీంతో పాటు మరో రెండు స్క్రిప్ట్స్ నచ్చటంతో ఆ సినిమాలు కూడా స్టార్ట్ చేశాం. వీటితో పాటు ఏటీఎం వెబ్ సిరీస్ కూడా చేశారు. సినిమాల విషయానికి వస్తే.. బలగం సినిమానే దిల్ రాజు ప్రొడక్షన్స్‌లో ముందుగా పూర్తయ్యింది.
బలగం సినిమా చేసే సమయంలో నేను హర్షిత్, హన్షితలను మానసికంగా ప్రిపేర్ చేశాను. పాండమిక్ తర్వాత ప్రేక్షకులు చిన్న సినిమాలు చూడటానికి పెద్దగా రావటం లేదని, దీనికి స్క్రిప్ట్ స్టేజ్ నుంచే వర్క్ చేయాల్సి ఉంటుంది. థియేట్రికల్ రిలీజ్ చేయాలంటే ఎక్స్‌పెరిమెంటల్ ఉండాలని నేను వారికి చెప్పాను. అలాగే చేశారు. బడ్జెట్ వాళ్లు అనుకున్న దాని కంటే కాస్త ఎక్కువే అయ్యింది. అయితే కూడా నాన్ థియేట్రికల్ రైట్స్ వల్ల ఇబ్బంది రాలేదు. ఇప్పుడు వాళ్లకు థియేటర్స్‌లో ఏదైతే వస్తుందో అది వాళ్లకు ఎంజాయ్‌మెంట్.సినిమా చూసిన వారందరూ చాలా బాగుందని అన్నారు. విమర్శకులు కూడా సినిమా గురించి పాజిటివ్‌గా స్పందించారు. చిన్న సినిమాలు చేసినప్పుడు ప్రతీది నిర్మాత కంట్రోల్‌లోనే ఉంటుంది. చిన్న సినిమా హిట్ అయితే ఆ కిక్కే వేరు.
వేణు ఎల్దండి డైరెక్టర్‌గా డెబ్యూ అయ్యాడు. తను కథ చెప్పిన తర్వాత అంతా కొత్త వాళ్లతోనే ముందుకు వెళ్లాలనుకున్నప్పుడు బడ్జెట్ వేసి ఇచ్చాను. సినిమా బడ్జెట్ అనుకున్న దాని కంటే 25 శాతం ఎక్కువైంది. అందుకు సినిమా ఆలస్యం కావటం వంటి కారణాలు ఏవైనా కావచ్చు. వేణులో ఇంత మంచి దర్శకుడు ఉన్నాడని నాకు కూడా తెలియదు. తను కథ చెప్పే సమయంలోనే నేను కనెక్ట్ అయ్యాను. నేను తెలంగాణలో చిన్న పల్లెటూరు నుంచి వచ్చాను. మనుషులు చనిపోయినప్పుడు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. అప్పుడు ఎమోషన్స్ ఎలా ఉంటాయనే దాన్ని నేను దగ్గర నుంచి గమనించాను. మన సంస్కృతిలో ఏముందనే విషయాన్ని వేణు పట్టుకున్న తీరు నాకు బాగా నచ్చింది. అక్కడి నుంచి వర్క్ చేసుకుంటూ వచ్చాం. ఆ సమయంలోనే సినిమాను కమర్షియల్ యాంగిల్‌లో కాకుండా నేచురల్‌గా ఉండాలని చెప్పాను.
చిన్న సినిమా అంటే ప్రేక్షకుడితో సహా అందరికీ చిన్న చూపు. చాలా అద్భుతమైన సినిమాగా ఉంటే తప్ప ఆడియెన్స్ థియేటర్స్‌కు రారు. అలాంటి బ్యూటీఫుల్ కాన్సెప్ట్ మూవీనే బలగం. ఆ కథ వినగానే నచ్చేసింది. బలగం సినిమాను చాలా ప్రేమతో చేశాను. సినిమా ఫస్ట్ కాపీ రెడీ అయిన తర్వాత ఓటీటీకి ఇచ్చేద్దామా? అని అన్నారు కూడా. ఇలాంటి సినిమాను థియేటర్‌కు తీసుకెళ్లటానికి నేను రంగంలోకి దిగాను. అందు కోసమే ముందుగానే షోస్ వేశాను. ఈ సినిమాలో మంచి ఎమోషన్స్‌తో పాటు మెసేజ్ ఉంది. కాబట్టి దాన్ని ఎంత మంది చూస్తే అంత మంచిదని నేను ప్లాన్ చేసుకుని ముందుకు వెళ్లాను.
తెలంగాణ బ్యాక్ డ్రాప్‌లో సాగే సినిమా కావటంతో అది ఆంధ్ర ప్రజలకు కనెక్ట్ అవుతుందా కాదా? అని ఆలోచించాను. నా సినిమాను డిస్ట్రిబ్యూటర్స్‌కి, డైరెక్టర్స్‌కి చూపించాను. నా డౌట్‌ను వాళ్లకి వక్తం చేశాను. వాళ్లు చెప్పింది ఒకటే. ‘సినిమా తెలంగాణనా, ఆంధ్రానా అని కాదు సార్.. బలమైన ఎమోషన్స్ ఉన్నాయి’ అన్నారు. అదే కనెక్ట్ అవుతుందని అన్నారు. రిలీజ్ తర్వాత సినిమా చూసిన వారందరూ అదే చెబుతున్నారు.
బలగం సినిమా చూసిన వారందరూ అవార్డ్ వస్తుందని అంటున్నారు. అయితే నేను అవార్డు కోసం సినిమా చేయలేదు. వస్తే మంచిదే. ఇంతకు ముందు నేను చేసిన శతమానం భవతి, మహర్షి సినిమాలకు నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. కానీ నేను అవార్డుల కోసం ఆ సినిమాను చేయలేదు. మంచి సినిమాలను అందించాలనే ఉద్దేశంతో చేశాను.
డైరెక్టర్ వేణు ఎల్దండి మా బ్యానర్‌లోనే రెండో సినిమాను కూడా చేస్తున్నాడు. రెండు నెలల క్రితం తను చెప్పిన ఐడియాస్‌లో ఒకటి బాగా నచ్చింది. దాని మీద వర్క్ చేయమని చెప్పాను. రీసెంట్ దానికి సంబంధించిన క్లైమాక్స్ చెప్పాడు.సూపర్బ్‌గా ఉందనిపించటంతో వర్క్ చేయమని చెప్పాను. ఈ సారి చేసే సినిమా కాస్త కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి.
నెక్ట్స్ దిల్ రాజు ప్రొడక్షన్స్‌లో ఓ డాన్స్ మాస్టర్‌ను హీరోగా .. సింగర్‌ను మ్యూజిక్ డైరెక్టర్‌గా పరిచయం చేస్తూ శశి అనే కొత్త దర్శకుడితో సినిమా చేస్తున్నాం. అది కూడా ఓ ఎక్స్‌పెరిమెంట్ మూవీ.