బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్‌పై పెళ్లి చూపులు, డియర్ కామ్రేడ్, దొరసాని, అన్నపూర్ణ ఫోటో స్టూడియో వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించి నిర్మాతగా మంచి అభిరుచి ఉన్న వ్యక్తిగా గుర్తింపు పొందారు యష్ రంగినేని. ఈ రోజు ఆయన తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు.

ఇటీవల నటుడిగా కూడా ఆయన కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు. రోషన్ మేక హీరోగా నటించిన ఛాంపియన్ చిత్రంలో యష్ రంగినేని కీలక పాత్రలో కనిపించారు. ఇందులో మాల వీరయ్య పాత్రలో ఆయన చేసిన నటనకు మంచి స్పందన లభించింది.

యష్ రంగినేనితో పని చేసిన కొంతమంది దర్శకులు కూడా ఆయన నటన గురించి ఆసక్తికరంగా మాట్లాడుతున్నారు. ఒక దర్శకుడు మాట్లాడుతూ, “యష్ గారికి మంచి స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది. ఆయన వ్యక్తిత్వం, బాడీ లాంగ్వేజ్ వల్ల తెరపై కనిపించే సన్నివేశాలకు ఒక ప్రత్యేకమైన ప్రభావం వస్తుంది” అని అన్నారు.
మరో దర్శకుడు మాట్లాడుతూ, “నిర్మాతగా ఇప్పటికే మంచి అభిరుచి ఉన్న వ్యక్తిగా ఆయన పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు నటుడిగా కూడా పాత్రను అర్థం చేసుకుని పనిచేయడానికి ప్రయత్నిస్తున్నారు” అని చెప్పారు.

ఇంకొక దర్శకుడు మాట్లాడుతూ, “ఆయన ఫిట్‌నెస్, డెడికేషన్ చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. కెమెరా ముందు చాలా నేచురల్‌గా కనిపిస్తారు. ముఖ్యంగా ఇంటెన్స్ పాత్రలకు ఆయన బాగా సూట్ అవుతారు” అని అభిప్రాయపడ్డారు.
ఇప్పటికే కొన్ని చిత్రాల్లో ప్రాధాన్యత ఉన్న పాత్రల కోసం యష్ రంగినేనిని సంప్రదిస్తున్నట్లు సినీ వర్గాల్లో వినిపిస్తోంది. ప్రస్తుతం ఆయన నటిస్తున్న కొన్ని చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయని సమాచారం.

