నందమూరి అభిమానులతో పాటు, తెలుగు సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘NBK109’. హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోతున్న గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న 109వ చిత్రమిది. తన నటవిశ్వరూపంతో ఐదు దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తున్న బాలకృష్ణ, మరో అద్భుతమైన చిత్రంతో అలరించడానికి సిద్ధమవుతున్నారు. బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. కేవలం ప్రకటనతోనే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు విశేషంగా ఆకట్టుకొని, ‘NBK109’ పై అంచనాలను రెట్టింపు చేశాయి. ఇక ఇప్పుడు అందరూ ఎంతగానో ఎదుచూస్తున్న ఈ చిత్ర టైటిల్ టీజర్ విడుదలైంది.
కార్తీక పూర్ణిమ శుభ సందర్భంగా చిత్ర టైటిల్ ని ప్రకటించడంతో పాటు, టీజర్ ను విడుదల చేశారు నిర్మాతలు. ఈ సినిమాకి ‘డాకు మహారాజ్’ అనే శక్తివంతమైన టైటిల్ ను పెట్టారు. శుక్రవారం ఉదయం హైదరాబాద్ లోని ఏఎంబీ మాల్ లో ‘NBK109’ టీజర్ విడుదల కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు దర్శకుడు బాబీ కొల్లి, నిర్మాత సూర్యదేవర నాగవంశీ, సంగీత దర్శకుడు ఎస్. తమన్ హాజరయ్యారు.
96 సెకన్ల నిడివితో రూపొందిన ‘డాకు మహారాజ్’ టీజర్, టైటిల్ కి తగ్గట్టుగానే అద్భుతంగా ఉంది. “ఈ కథ రాజ్యం లేకుండా యుద్ధం చేసిన ఒక రాజుది, గండ్ర గొడ్డలి పట్టిన యమధర్మ రాజుది, మరణాన్ని వణికించిన మహారాజుది” అంటూ ‘డాకు మహారాజ్’గా బాలకృష్ణను పరిచయం చేసిన తీరు అదిరిపోయింది. మునుపెన్నడూ చూడని సరికొత్త రూపంలో గుర్రంపై బాలకృష్ణ ఎంట్రీ ఇవ్వడం అభిమానులకు పూనకాలు తెప్పించేలా ఉంది. టీజర్ లోని ప్రతి ఫ్రేమ్ లో భారీతనం కనిపిస్తుంది. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. తమన్ నేపథ్య సంగీతం టీజర్ ని మరోస్థాయికి తీసుకెళ్లింది. మొత్తానికి టీజర్ చూస్తుంటే, బాలకృష్ణతో కలిసి దర్శకుడు బాబీ థియేటర్లలో ప్రేక్షకులను సరికొత్త అనుభూతిని అందించే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ను అందించడబోతున్నారని అర్థమవుతోంది.
టీజర్ విడుదల కార్యక్రమంలో దర్శకుడు బాబీ కొల్లి మాట్లాడుతూ, ” టీజర్ మీ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను. మీరు చూసిన టీజర్ లో డూపులు లేవు, డూప్లికేట్ లు లేవు. బాలకృష్ణ గారే అన్నీ నిజంగా చేశారు. గుర్రం ఎక్కింది ఆయనే, నడిపింది ఆయనే, యుద్ధానికి వచ్చేది కూడా ఆయనే. మీరు చూసినవన్నీ ఒరిజినల్ షాట్స్. తమన్ గారు అద్భుతమైన సంగీతం అందించారు. నేనైనా, నాగవంశీ గారైనా దీనిని ఎప్పుడూ సాధారణ సినిమాలా చూడలేదు. బాలయ్య గారు సృష్టిస్తున్న రికార్డులను దృష్టిలో పెట్టుకొని, కేవలం మాస్ లోనే కాకుండా అన్ని వర్గాలలో ఆయనకు ఉన్న ఆదరణను దృష్టిలో పెట్టుకొని, ఎప్పుడూ చూడని కొత్త బాలకృష్ణ గారిని చూపించాలని, సినిమా మొదటి నుంచి ఎంతో శ్రద్ధతో పని చేస్తూ వచ్చాము. టీజర్ లో మీరు చూసింది చాలా చాలా తక్కువ. సినిమా ఇంకా వేరే స్థాయిలో ఉంటుంది. దర్శకుడిని నమ్మి స్వేచ్ఛను ఇస్తారు బాలకృష్ణ. అందుకే ఇంత అద్భుతమైన అవుట్ పుట్ వచ్చింది. నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతలకు, నాకు సహకరించిన బృందం అందరికీ ధన్యవాదాలు. చివరగా ఒక్క మాట.. యుద్ధం గట్టిగా ఉండబోతుంది” అన్నారు.
నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ, “బాలకృష్ణ గారిని చాలా కొత్తగా చూపించాలని నేను, దర్శకుడు బాబీ ముందు నుంచి అనుకుంటున్నాం. టీజర్ లో మీరు చూసింది చాలా చిన్నది. సినిమాలో ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. థియేటర్లలో ఈ సినిమా అభిమానులకు అసలుసిసలైన పండుగలా ఉంటుంది.” అన్నారు.
సంగీత దర్శకుడు ఎస్. తమన్ మాట్లాడుతూ, “బాబీ చాలా గొప్ప సినిమా తీశారు. బాలయ్య గారితో ఇది నా ఐదవ సినిమా. ఆయనతో పని చేయడం సంతోషంగా ఉంది. సినిమా ఏదైతే కోరుకుంటుందో, దానికి తగ్గట్టుగా సంగీతం అందిస్తున్నాను. ఈ సినిమా అద్భుతంగా ఉంటుంది.” అన్నారు.
‘డాకు మహారాజ్’ చిత్రం సంక్రాంతి కానుకగా 2025, జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రముఖ ఛాయాగ్రాహకుడు విజయ్ కార్తీక్ కన్నన్ కెమెరా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కళా దర్శకుడిగా అవినాష్ కొల్లా, ఎడిటర్ గా నిరంజన్ దేవరమానే వ్యవహరిస్తున్నారు.
God of Masses Nandamuri Balakrishna is entertaining audiences, fans and movie-lovers for past five decades…
"ఆదిత్య", "విక్కీస్ డ్రీమ్", "డాక్టర్ గౌతమ్" వంటి సందేశాత్మక బాలల చిత్రాలతో పసి మనసుల్లో మంచి నాటే ప్రయత్నం చేసి…
Bheema Gani Sudhakar Goud, acclaimed for meaningful children's films such as Aditya, Vicky's Dream, and…
వైవిధ్యమైన కథలతో ఆకట్టుకునే కథానాయకుడు త్రిగుణ్ (అదిత్ అరుణ్) హీరోగా, హెబ్బాపటేల్, ఇషాచావ్లా, వర్షిణి హీరోయిన్స్‌గా స్వాతి సినిమాస్ పతాకంపై…
Actor Trigun (Adit Arun), known for captivating audiences with diverse storylines, stars as the hero…
నివాస్, అమిత శ్రీ జంటగా నటిస్తున్న సినిమా "తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా". ఈ చిత్రంలో ఇతర కీలక పాత్రల్లో 30…