పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ ల ‘బ్రో’ చిత్రం నుంచి గుర్తుండిపోయే యుగళగీతం ‘జాణవులే’ విడుదల
తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ తేజ్ ద్వయం మొదటిసారి కలిసి నటిస్తున్న ‘బ్రో’ చిత్రం కోసం జీ స్టూడియోస్‌తో చేతులు కలిపింది. సముద్రఖని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించిన ఈ సినిమా జూలై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, ప్రోమోలు, టీజర్, మొదటి పాట ‘మై డియర్ మార్కండేయ’కు అద్భుతమైన స్పందన రాగా, ఈరోజు ‘బ్రో’ నుండి రెండవ పాట ‘జాణవులే’ విడుదలైంది. ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. స్వరకర్త స్వయంగా కె ప్రణతితో కలిసి ఆలపించిన ఈ పాటకు కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు.
‘జాణవులే’ పాట విడుదల కార్యక్రమం తిరుపతిలో అభిమానుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సాయి ధరమ్ తేజ్, సముద్రఖని, ప్రముఖ నిర్మాత ఎన్.వి. ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
అభిమానుల కేరింతల మధ్య ఎంతో ఆహ్లాదకరంగా సాగిన ఈ వేడుకలో సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ.. “మా గురువు, మేనమామ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ప్రేమ, ఆశీస్సులు మాపై ఎల్లప్పుడూ ఉంటాయి. ఆయనతో కలిసి నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే మీ ప్రేమ, అభిమానం నాపై ఎప్పుడూ ఇలాగే కురిపించాలని కోరుకుంటున్నాను. రోడ్డు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. జూలై 28 న థియేటర్లలో గోల చేయడానికి సిద్ధంగా ఉండండి” అన్నారు.
సముద్రఖని మాట్లాడుతూ.. “నా బ్రో సాయి ధరమ్ తేజ్ తో కలిసి పని చేయడం ప్రతిరోజూ పండగలా ఉంటుంది. బిగ్ బ్రో కళ్యాణ్ గారికి థాంక్స్ చెబుతూనే ఉంటాను. సినిమాలో ఆయన దేవుడిలా దిగి వస్తారు. త్రివిక్రమ్ అన్నయ్యకి, నిర్మాతలు విశ్వప్రసాద్ గారు, వివేక్ గారికి ధన్యవాదాలు. జీవితంలో మరిచిపోలేని సినిమా ఇది. మీతో కలిసి ఈ సినిమా చూడటం కోసం జూలై 28 కోసం ఎదురుచూస్తున్నాను” అన్నారు.
జాణవులే పాట, సాయి ధరమ్ తేజ్ మరియు సినిమాలో ఆయనకు జోడిగా నటించిన కేతిక శర్మపై చిత్రీకరించబడింది. సుందరమైన ప్రదేశాలలో చిత్రీకరించబడిన ఈ పాటకు భాను చక్కటి నృత్యరీతులను సమకూర్చారు. ఈ యుగళగీతం ఆకట్టుకునే కోరస్ విభాగాలతో ఆకర్షణీయమైన సంగీత హుక్ తో కట్టిపడేసేలా ఉంది.
“జాణవులే నెరజాణవులే.. నా జాన్ నువ్వులే జాణవులే.. వాణివిలే అలివేణివిలే.. నా మూన్ నువ్వులే జాణవులే” అంటూ కథానాయకుడు తన ప్రేయసిపై తనకున్న ఇష్టాన్ని తెలుపుతున్న అందమైన పంక్తులతో పాట ప్రారంభమైంది. ఆంగ్ల పంక్తులతో కూడిన అర్థవంతమైన తెలుగు సాహిత్యం పాటకు సరికొత్త రూపాన్ని ఇస్తూ, అన్ని వర్గాల వారికి చేరువయ్యేలా ఉంది. “నా ఎదల కథను మొదలు పెడితె ముందుమాట నీదే.. నీ కవల కలువ కనులు పలికె భాష చెప్పరాదే” వంటి పంక్తులతో పాట ఎంతో అందంగా సాగింది.
నాయకానాయికల కెమిస్ట్రీని, అద్భుతమైన లొకేషన్‌ల అందాన్ని ఛాయాగ్రాహకుడు కెమెరా కంటితో చక్కగా బంధించారు. మంచి అనుభూతిని పంచుతూ, ఎంతో ఆహ్లాదకరంగా సాగిన ఈ పాట మళ్ళీ మళ్ళీ వినాలి అనిపించేలా ఉంది. ఆకట్టుకునే కాస్ట్యూమ్స్, సాయిధరమ్ తేజ్-కేతిక స్క్రీన్ ప్రెజెన్స్, డ్యాన్స్ కలిసి ఈ పాటను మరో స్థాయికి తీసుకెళ్లాయి.
అద్భుతంగా స్వరపరిచిన పాటలకు ఎల్లప్పుడూ మంచి స్పందన లభిస్తుంది. రేవంత్, స్నిగ్ధ శర్మ ఆలపించగా, పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్, ఊర్వశి రౌతేలా కనువిందు చేసిన మొదటి పాట ‘మై డియర్ మార్కండేయ’ సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకుని ఇప్పటికే యూట్యూబ్‌లో 11 మిలియన్ల వీక్షణలను నమోదు చేసింది. ఇప్పుడు రెండవ పాట ‘జాణవులే’కి కూడా ఆ స్థాయి స్పందన వస్తుంది అనడంలో సందేహం లేదు.
ఈ సినిమాలో టైటిల్ పాత్రధారి(బ్రో)గా పవన్ కళ్యాణ్ నటిస్తుండగా, మార్క్ అకా మార్కండేయులుగా సాయి ధరమ్ నటిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్, సముద్రఖని, రోహిణి, రాజేశ్వరి నాయర్, రాజా, తనికెళ్ల భరణి, వెన్నెల కిషోర్, సుబ్బరాజు, పృధ్వీ రాజ్, నర్రా శ్రీను, యువలక్ష్మి, దేవిక, అలీ రెజా, సూర్య శ్రీనివాస్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. సుజిత్ వాసుదేవ్ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.
రచన, దర్శకత్వం: పి. సముద్రఖని
స్క్రీన్ ప్లే, డైలాగ్స్: త్రివిక్రమ్
బ్యానర్స్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్
నిర్మాత: టి.జి. విశ్వప్రసాద్
సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల
డీఓపీ: సుజిత్ వాసుదేవ్
సంగీతం: ఎస్.ఎస్. థమన్
ఆర్ట్: ఏ.ఎస్. ప్రకాష్
ఎడిటర్: నవీన్ నూలి
ఫైట్స్: సెల్వ
వీఎఫ్ఎక్స్ సూపర్‌వైజర్: నిఖిల్ కోడూరి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్. వెంకటరత్నం
కో-డైరెక్టర్: బి. చిన్ని
పీఆర్ఓ: లక్ష్మీ వేణుగోపాల్