అన్నపూర్ణ ఫోటో స్టూడియో – నిర్మాత యష్ రంగినేని ఇంటర్వ్యూ
చైతన్య రావ్, లావణ్య జంటగా నటించిన సినిమా “అన్నపూర్ణ ఫోటో స్టూడియో”. మిహిరా, ఉత్తర, వైవా రాఘవ, లలిత్ ఆదిత్య ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని బిగ్ బెన్ సినిమాస్ పతాకంపై యష్ రంగినేని నిర్మించారు. చెందు ముద్దు దర్శకత్వం వహించారు. “అన్నపూర్ణ ఫోటో స్టూడియో” సినిమా ఈ నెల 21న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను తెలియజేశారు నిర్మాత యష్ రంగినేని.
వర్ధన్ దేవరకొండ గారి ద్వారా నాకు చెందు పరిచయం. చెందు దగ్గర మంచి కథ ఉంది వినమని ఆయనే చెప్పారు. చెందు చెప్పిన కథ నాకు బాగా నచ్చింది. మూడేండ్ల కిందట ఇదంతా జరిగింది. చెందు చెప్పిన కథలోని పల్లెటూరి నేపథ్యం, టర్న్ లు, ట్విస్ట్ లు నచ్చాయి. నాకు పాత తెలుగు సినిమాలు ఇష్టం. లండన్ వెళ్లినప్పుడు ఎన్టీఆర్ పాత సినిమాలు చూస్తుంటాను. సినిమాలో ఎంటర్ టైన్ మెంట్ అంటే ఇలా ఉండాలని అనిపిస్తుంటుంది. చెందు చెప్పిన కథలోని పీరియాడిక్ నేపథ్యం, కోనసీమ పల్లెటూరి బ్యాక్ డ్రాప్ ఆకట్టుకుంది. మనం ఈ సినిమా చేస్తున్నాం అని అతనితో చెప్పాను. 2022 ఆగస్టులో సినిమా షూటింగ్ ప్రారంభించాం.
ఈ కథను సాధ్యమైనంత ఆసక్తికరంగా ఎలా చూపిద్దాం అని సినిమా ప్రారంభించేప్పుడు చెందుతో డిస్కస్ చేశాను. ఆ వారం రిలీజయ్యే సినిమాల్లో మన సినిమాలో ఏదో ఒక కొత్తదనం ఉండాలి, అందుకు ఏం చేయాలో చర్చించాం. చెందు కథలోని స్క్రీన్ ప్లే ను ఆసక్తికరంగా రాస్తారు. ఓ పిట్ట కథ కంటే ఇందులో స్టోరీ టర్న్స్ , థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి.
పల్లెటూరిలో జరిగే ప్రేమ కథ ఇది. కొన్ని కారణాల వల్ల హీరో పెళ్లి చేసుకోవడం ఆలస్యమవుతుంది. ఇంతలో ఒక అనూహ్య ఘటన జరుగుతుంది. ఆ ఘటన వల్ల వీరి ప్రేమ కథ ఎలాంటి మలుపులు తిరిగింది అనేది థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఆసక్తికరంగా సాగుతుంది. జెన్యూన్ గా ఈ సినిమాను నిర్మించాం. సినిమాటిక్ లిబర్టీస్ ఎక్కువగా తీసుకోలేదు. అయితే పూర్తి కమర్షియల్ అంశాలుంటాయి. అవి కథలోని కుదిరాయి.
మొత్తం సినిమా ఎడెనిమిది మెయిన్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఆ పాత్రలన్నీ కథలో ఏదో ఒక పర్పస్ తో ప్రవర్తిస్తాయి. ప్రతి పాత్ర సినిమా ముగియడానికి కనెక్ట్ అయి ఉంటుంది. ఇందులో ఓ పాత్రలో నేనూ నటించాను. పేరున్న నటుడు అయితే ఎక్సెపెక్టేషన్స్ ఉంటాయని దర్శకుడు నన్నే ఆ క్యారెక్టర్ చేయమన్నారు. సినిమాలో లొకేషన్స్ ఓ ప్రధాన ఆకర్షణ అవుతాయి. పల్లెటూర్ల ప్రకృతి అందాన్నిచూస్తారు. అలాగే మ్యూజిక్ ఆకట్టుకుంటుంది.
ఈ మధ్య మేము తిరుపతి, విజయవాడ..ఇలా చాలా చోట్ల ప్రివ్యూస్ వేశాం. యూత్ చాలా మంది వచ్చి సినిమా చూశారు. ఇది ఎయిటీస్ బ్యాక్ డ్రాప్ కాబట్టి ఇప్పటివారు కనెక్ట్ అవుతారో లేదో అనుకున్నాం. కానీ సినిమా చూశాక వాళ్లు మంచి ఫీడ్ బ్యాక్ ఇచ్చారు. స్ట్రెస్ రిలీఫ్ అయ్యే సినిమా చూశామని అన్నారు. ఇలాంటి రెస్పాన్స్ సంతోషాన్నిచ్చింది. దాదాపు 3 వేల కిలోమీటర్ల టూర్ ఈ సినిమా కోసం తిరిగాం.
చెందు లాంటి దర్శకుడు దొరకడం మా లక్ అనుకోవాలి. ఎందుకంటే ఎంత బడ్జెట్ లో సినిమా చేయాలని, వృథా ఖర్చు ఎలా తగ్గించాలి అనే విషయంలో అతనికి స్పష్టత ఉంది. మేము పెళ్లి చూపులు సినిమాను ఎంత ప్లానింగ్ గా చేయాలనుకున్నామో..ఈ సినిమాను కూడా అలాగే పక్కాగా ప్రొడక్షన్ చేశాం.
చైతన్య రావ్ మంచి నటుడు, చూడ్డానికి బాగుంటాడు. ఈ సినిమాలో బాగా పర్మార్మ్ చేశాడు. గోదావరి యాసలో పర్పెక్ట్ గా తన క్యారెక్టర్ చేశాడు. అలాగే లావణ్య కూడా బాగా నటించింది. ఈ సినిమాను ఈటీవీ విన్ యాప్ వాళ్లకు ఇచ్చాం. మా సినిమా చూసి బాగుందని వారు తీసుకునేందుకు వచ్చారు. ఇవాళ చాలా కొద్ది చిత్రాలకే ఓటీటీ రైట్స్ వస్తున్నాయి. సినిమా బాగుంటే ఎవరైనా కొంటారు. నాకు పరిచయాలు ఉన్నాయని కొనరు కదా. ఫిల్మ్ ప్రొడక్షన్ లోకి వచ్చే నా ఫ్రెండ్స్ కూడా ఇదే విషయం చెబుతుంటాను.
చిన్న సినిమా పెద్ద సినిమా అనే మాటలు ఇబ్బంది కలిగిస్తాయి. పెళ్లి చూపులు చిన్న సినిమానే విడుదలయ్యాక ఎంత పెద్ద విజయం సాధించిందో మీకు తెలుసు. బడ్జెట్ స్కేల్ వైజ్ చిన్నా పెద్దా ఉంటాయి అంతే. విజయ్ దేవరకొండతో మేము నిర్మించిన డియర్ కామ్రేడ్, పెళ్లి చూపులు సినిమాలను త్వరలో రీ రిలీజ్ చేస్తాం. డియర్ కామ్రేడ్ మేము ఊహించినంత రీచ్ కాలేదు. అయితే మా పెట్టుబడి మాకు వచ్చింది. ప్రస్తుతం నా దగ్గర రెండు స్క్రిప్ట్స్ ఉన్నాయి. అయితే విజయ్ తో కుదిరినప్పుడు తప్పకుండా చేస్తాం.
ఆనంద్ మంచి పర్సన్. అతనిలో చాలా టాలెంట్ ఉంది. నీకు ఒక్క హిట్ వస్తే చాలు అని చెప్పేవాడిని. అలాంటి హిట్ బేబీ సినిమాతో దక్కింది. ఒక మంచి కాన్సెప్ట్ కొత్త వాళ్లతో చేస్తే ఎలాంచి రిజల్ట్ వస్తుందో బేబీ సినిమా చూపించింది.