ఏపీ నూతన టూరిజం, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రిగా ఎంపికైన కందుల దుర్గేష్ గారికి సీనియర్ నిర్మాత, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీ నట్టి కుమార్ ఓ ప్రకటనలో శుభాకాంక్షలు తెలియజేశారు. “ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో జనసేన పార్టీ తరపున నిడదవోలు నియోజకవర్గంలో విజయం సాధించిన ఆయనకు రాజకీయాలలో సుదీర్ఘ అనుభవం ఉంది. సినీ పరిశ్రమకు చెందిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పార్టీకి చెందిన శాసనసభ్యుడికే టూరిజం, సినిమాటోగ్రఫీ శాఖను కేటాయించడం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారి ముందుచూపుకు ఇది ఓ నిదర్శనం. టూరిజం, సినిమాటోగ్రఫీ శాఖలకు చక్కటి అవినాభావ సంబంధం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ లో తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధికి ఇది ఎంతగానో దోహదం చేస్తుంది. విశాఖపట్టణం, అరకు, రాజముండ్రి, గోదావరి తీరం, తిరుపతి, మదనపల్లి వంటి ప్రకృతి రమణీయ ప్రదేశాలలో షూటింగులకు అనువుగా ఆ లొకేషన్స్ ను తీర్చిదిద్దెందుకు తప్పకుండా దుర్గేష్ గారు కృషిచేస్తారన్న నమ్మకం ఉంది. అలాగే చిన్న, పెద్ద సినిమా సమస్యలు, థియేటర్ల సమస్యలు, చిత్ర పరిశ్రమలో ఎంతోకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి దుర్గేష్ గారు పెద్ద పీట వేస్తారని విశ్వసిస్తున్నాం. తెలుగు సినీ పరిశ్రమ నుంచి ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో 68 శాతం ఏపీ నుంచే వస్తోంది. మంత్రికి శుభాకాంక్షలు తెలిపేందుకు త్వరలోనే తెలుగు సినీ పరిశ్రమ తరపున ఆయనను కలుస్తాం” అని నట్టి కుమార్ పేర్కొన్నారు.