ప్రముఖ జర్నలిస్ట్ పొన్నం రవిచంద్ర నిర్మించిన “ఫూలే” సినిమా ప్రత్యేక ప్రదర్శన హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి డిఫ్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు వివేక్ వెంకట స్వామి, శ్రీధర్ బాబు, పొన్నంప్రభాకర్, వాకిటి శ్రీహరితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా

కుల నిర్మూలన కోసం జ్యోతిరావు పూలే, సావిత్రీబాయి పూలే దంపతులు గొప్ప పోరాటం చేశారని, మహిళా విద్య కోసం వారు ఎదుర్కొన్న సవాళ్లను సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించారని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పూలే దంపతుల సామాజిక సేవా గుణం, వారి జీవితాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
డిఫ్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ – మా ముఖ్యమంత్రి గారితో సహా మంత్రివర్గ సహచరులను, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పూలే సినిమా ప్రత్యేక ప్రదర్శనకు ఆహ్వానించిన మా మంత్రివర్గ సహచరులు పొన్నం ప్రభాకర్ గారికి కృతజ్ఞతలు. ఈ సినిమా భారతీయ సమాజానికి అద్భుతమైన సందేశాన్నిస్తుంది. మహిళా అభ్యున్నతి కోసం, ఆనాటి సమాజంలో ఉన్న కులవివక్ష ఇతర ఇబ్బందులను తట్టుకుని సమసమాజం కోసం పూలే దంపతులు వేసిన పునాదులు వేశారు. ఈ రోజు ఆ ఫలాలను, ఫలితాలనే మన స్వంతత్ర భారతదేశంలో అనుభవిస్తున్నాం. వారు వేసిన పునాదుల మీద సాగుతూ వారి ఆశయాలను, లక్ష్యాలను సాధించడంలో మా ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో కృషి చేస్తాం. అన్నారు.

రచయిత మామిడి హరికృష్ణ మాట్లాడుతూ – సమసమాజ స్థాపన కోసం, మహిళా అభ్యున్నతి కోసం జ్యోతిరావు పూలే, సావిత్రీబాయి పూలే దంపతులు అద్వితీయ పోరాటం చేశారు. వారి పోరాటానికి సజీవ దృశ్యంలా ఈ సినిమాను రూపొందించడం అభినందనీయం. ఆ గొప్ప సంఘ సంస్కర్తల స్ఫూర్తితో ప్రతి ఒక్కరం గొప్ప సమాజం కోసం ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉంది. అన్నారు.
సంగీత దర్శకురాలు ఎంఎం శ్రీలేఖ మాట్లాడుతూ – పూలే సినిమాకు సంగీతాన్ని అందించే అవకాశం రావడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. పూలే సినిమా చూస్తున్నంత సేపు ఉద్వేగానికి గురయ్యాను. చివరలో కన్నీళ్లు వచ్చాయి. మహిళల కోసం జ్యోతిరావు పూలే, సావిత్రీబాయి పూలే చేసిన కృషి సర్వదా అభినందనీయం అన్నారు.
కాంగ్రెస్ నేత వీహెచ్ మాట్లాడుతూ – పూలే సినిమాను గొప్పగా రూపొందించారు. ఈ సినిమా ప్రతి ఒక్కరిలో స్ఫూర్తి కలిగిస్తుంది. ఈ సినిమాను ఊరూ వాడా ప్రదర్శించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నారు. పేదవారిని గొప్ప స్థాయికి తీసుకెళ్లేది చదువు మాత్రమే. ఆ చదువును అందరికీ అందించేందుకు మహిళా వివక్షను, దురాచారాలను రూపు మాపేందుకు కృషి చేస్తూ సమాజం కోసం జ్యోతిరావు పూలే, సావిత్రీబాయి పూలే తమ జీవితాలను అంకితం చేశారు. అన్నారు
నిర్మాత, జర్నలిస్ట్ పొన్నం రవిచంద్ర మాట్లాడుతూ – పూలే సినిమా ప్రత్యేక ప్రదర్శనకు సీఎం రేవంత్ రెడ్డి గారు రావడం సంతోషంగా ఉంది. ఆయన రెండు గంటలకు పైగా సమయం వెచ్చించి సినిమాను చూశారు. ఈ సినిమాను ప్రతి గ్రామంలో ప్రదర్శించేలా అవకాశం కల్పించాలని కోరుతున్నాను. సమాజంలోని రుగ్మతలు తొలగించుకునేందుకు, అందరికీ విద్యను అందించేందుకు ప్రతి ఒక్కరిలో పూలే సినిమా స్ఫూర్తిని కలిగిస్తుంది. అన్నారు.

