జేమ్స్ కామెరూన్ అద్భుత సృష్టి 'అవతార్'. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా 'అవతార్-2- ది వే ఆఫ్ వాటర్' రూపొందించారు. దాదాపు 13 సంవత్సరాల తర్వాత వస్తున్న ఈ సీక్వెల్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సీక్వెల్ కోసం జేమ్స్ కామెరూన్ అండ్ టీం సంవత్సరాల కాలం పాటు పనిచేసి మరోసారి అద్భుతమైన, హై-ఎండ్ స్టీరియోస్కోపీని అందించనున్నారు. 'అవతార్ 2' ప్రపంచ సినీ చరిత్రలో నాల్గవ అత్యంత ఖరీదైన చిత్రం. గత అవతార్ రికార్డులని బ్రేక్ చేసి అత్యధిక వసూళ్లు సాధించే చిత్రంగా 'అవతార్ 2' సరికొత్త చరిత్ర సృష్టిస్తుందని భావిస్తున్నారు. అనేక ఇతర భాషలతో పాటు, అవతార్ 2 తెలుగు వెర్షన్ కూడా డిసెంబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒక ఆసక్తికరమైన అప్ డేట్ ఏమిటంటే.. తెలుగు దర్శకుడు శ్రీనివాస్ అవసరాల కూడా ఈ అద్భుత చిత్రం కోసం పని చేశారు. 'అవతార్-2- ది వే ఆఫ్ వాటర్' తెలుగు వెర్షన్ కి డైలాగ్స్ రాశారు శ్రీనివాస్ అవసరాల. రచయిత- దర్శకుడైన శ్రీనివాస్ అవసరాల డైలాగ్స్ రైటింగ్ విలక్షణంగా వుంటుంది. అవతార్ 2 తన మార్క్ డైలాగులతో తెలుగు ప్రేక్షకులకు మరింత ప్రత్యేకం కానుంది. 'అవతార్-2- ది వే ఆఫ్ వాటర్' విజువల్ గ్రాండియర్‌ను తెరపై చూడాలంటే మరో నాలుగు రోజులు ఆగాలి.